2025కు గుడ్‌బై పలికేశారా? కొత్త ఏడాదికి స్వాగతం అనేస్తున్నారా?. ఓకే.. గుడ్. 2026లో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారా?.. అయితే ఈ ఈజీ టిప్స్ మీకోసమే. 2025లో శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితాలివి! ఆలస్యమెందుకు?.. చదివేయండి..
తెలివిగా తినండి.. గుండె ఆరోగ్యంతోపాటు మన జీర్ణక్రియ సక్రమంగా ఉండేందుకు, నిద్ర, మూడ్ సమస్యలు అధిగమించేందుకు, రకరకాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం కొంచెం తెలివిగా తినాలని, తాగాలని 2025లో జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ తినడం ఎలా ఉండాలంటే..
➡️వారంలో ఒకటి నుంచి ఆరు వరకూ కోడిగుడ్లు తినడం గుండెజబ్బులతో చచ్చిపోయే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వారికీ కూడా ఇది వర్తిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగని అతిగా తినడం మంచిది కాదు.
➡️అధిక రక్తపోటు నుంచి తప్పించుకునేందుకు ఉప్పు తినడం తగ్గించడం కాకుండా.. ఆహారంలో మరింత పొటాషియం ఉండేలా చూసుకోవడం మేలు. అరటిపండ్లు, ఆప్రికాట్స్, చిలగడదుంపల్లో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది.
పొటాషియం అధికంగా ఉండేవి..
• అరటిపండ్లు
• ఆప్రికాట్స్ (జారదాలు)
• చిలగడదుంపలు (Sweet potatoes)
• పాలకూర, గోంగూర, కూరగాయలు
• బీన్స్, పప్పులు
• కొబ్బరి నీరు
• కలబంద (Avocado)
గమనిక.. కిడ్నీ సమస్యలు ఉన్నవారు అధిక పొటాషియం తీసుకోవడం ప్రమాదకరం కావొచ్చు. కాబట్టి, నిపుణుల సలహా తీసుకుని ఆహారంలో పొటాషియం బ్యాలెన్స్ తప్పకుండా చూసుకోవాలి
➡️రోజంతా కూర్చునే ఉంటున్నారా? అయితే మీ రక్తనాళాలను కాపాడుకోవాలంటే... కోకోలోని ఫ్లేవనాల్స్ బాగా ఉపయోగపడతాయి. ఇవి ‘సిట్టింగ్ డిసీజ్’తో వచ్చే సమస్యల తీవ్రతను తగ్గిస్తాయి. పరిశోధనల ప్రకారం..
రోజుకు కోకో పౌడర్ లేదా డార్క్ చాక్లెట్ (70% పైగా కోకో ఉన్నది) తీసుకోవడం రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫ్లేవనాల్స్ రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచి, రక్తనాళాలను సడలిస్తాయి. దీని వల్ల రక్తప్రవాహం పెరుగుతుంది, గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
ఎలా తీసుకోవాలంటే..
డార్క్ చాక్లెట్ (చక్కెర తక్కువగా ఉండే)
కోకో పౌడర్ (unsweetened)
కాకా నిబ్స్
కోకో డ్రింక్స్ (చక్కెర లేకుండా)
అధిక చక్కెర, పాలు కలిపిన చాక్లెట్ తీసుకుంటే ప్రయోజనం తగ్గిపోతుంది.
మితంగా తీసుకోవాలి (రోజుకు 10–20 గ్రాముల డార్క్ చాక్లెట్ సరిపోతుంది).
కొన్ని రకాల కొవ్వులు కేన్సర్ కణితులతో మన రోగ నిరోధక వ్యవస్థ పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అయితే మొక్కల ఆధారిత కొవ్వులు (plant-based fats) అలాంటి ప్రతికూల ప్రభావం చూపవు.
మంచి కొవ్వులు
• ఆలివ్ ఆయిల్
• కొబ్బరి నూనె
• పామ్ ఆయిల్ (మితంగా)
• అవకాడో, డ్రైఫ్రూట్స్
👆 ఇవి ఇమ్యూన్ సిస్టమ్‌ను దెబ్బతీయవు. కొన్ని సందర్భాల్లో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ ప్రభావం చూపుతాయి.
➡️మలబద్ధకాన్ని తొలగించేందుకు పీచు పదార్థం ఎక్కువగా ఉన్న పండ్లు ఉపయోగపడతాయి. అయితే కీవీ పండ్లు ఈ జాబితాలో తొలిస్థానంలో ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
➡️ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు, శాఖాహార ప్రధానమైన మెడిటరేనియన్ ఆహారం ఐబీఎస్ (ఇరిటెబుల్ బౌల్ సిండ్రోమ్) సమస్యను తగ్గిస్తుంది.
➡️అరటి పండు స్మూతీల్లో వాడే పదార్థాల్లోని మంచి పోషకాలు సరిగ్గా జీర్ణం కానివ్వదు. అరటిలో సహజంగా ఉన్న పోషకాలు, ఇతర పదార్థాల కలయిక వల్ల శరీరానికి పూర్తిగా అందకపోవచ్చు. కాబట్టి.. అరటితో పాలు / బాదం పాలు(ప్రోటీన్, కాల్షియం అందిస్తాయి), పీనట్ బట్టర్ / బాదం బట్టర్ (ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ అందిస్తుంది), ఓట్స్ (ఫైబర్, శక్తినిస్తుంది), కాకా పొడి (unsweetened cocoa) యాంటీఆక్సిడెంట్లు, చియా సీడ్స్ / ఫ్లాక్స్ సీడ్స్ (ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు), బెర్రీలు (స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ) (విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు), తేనె / ఖర్జూరం (సహజమైన తీపి) అందిస్తాయి.
అలాగే.. అరటితో కలపకూడనివి కొన్ని ఉన్నాయి. సిట్రస్ ఫలాలు (కమలపండు, మొసంబి, నిమ్మ) వీటివల్ల ఆమ్లత్వం(యాసిడిటీ) పెరిగి అరటిలోని పోషకాలు శోషణ తగ్గుతుంది. అధిక చక్కెర / ఐస్‌క్రీమ్ వల్ల ఫైబర్ దక్కకపోగా.. విటమిన్ ప్రయోజనం తగ్గిపోతుంది.
ప్రాసెస్‌డ్ ప్రోటీన్ పౌడర్ల వల్ల కొన్ని సందర్భాల్లో జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. చాక్లెట్ సిరప్ (అధిక చక్కెర) సహజంగానే పోషకాలను తగ్గిస్తుంది. కాఫీ / టీ పొడి చేరిస్తే.. ఐరన్, కాల్షియం శోషణకు ఆటంకం కలుగుతుంది.
➡️చక్కెరల కంటే కృత్రిమ చక్కెరలతో కూడిన పానీయాలు మధుమేహం వచ్చే అవకాశాలను ఎక్కువ చేస్తాయి. కాబట్టి ఆ రకమైన పానీయాలు తీసుకోకపోవడం మేలు.
పునరుత్తేజానికి వ్యాయామం..
సరైన నిద్ర + సరైన వ్యాయామం= ఆరోగ్యం. అయితే హై-ఇంపాక్ట్ వ్యాయామాలు (జంపింగ్, రన్నింగ్) కీళ్ల సమస్యలు పెంచే అవకాశం ఉంది. కాబట్టి నడక, సైక్లింగ్, ఈత వంటివి మేలు. సుఖ నిద్రతో మన వ్యాయామ అలవాట్లు మెరుగవుతాయి. అయితే.. సాయంత్రాలు వ్యాయామం చేయడం అంత మంచిదేం కాదు. హృదయ స్పందన, శరీర ఉష్ణోగ్రత పెరిగి నిద్రకు భంగం కలగొచ్చు. నిద్రను నిర్లక్ష్యం చేస్తే వ్యాయామం ప్రయోజనం తగ్గిపోతుంది. కాబట్టి.. నిద్రకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. ఒకవేళ సాయంత్రమే చేసే వీలుంటే గనుక.. తేలికపాటి వ్యాయాయాలు (నడక, యోగా, స్ట్రెచింగ్) చేసుకోవచ్చు. ఇవి నిద్రకు ఆటంకం కలిగించవు.
మానసిక సంతోషానికి..
జీవనశైలిలోని చిన్న చిన్న అలవాట్లు మన మానసిక ఆరోగ్యంపై, పనితీరుపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. తాజా పరిశోధనలు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చాయి.
క్రియాటిన్ సాధారణంగా కండరాల శక్తి పెంపు కోసం ఉపయోగించే పోషక పదార్థం. కానీ, ఇది మెదడు శక్తి వినియోగాన్ని మెరుగుపరచడంతో పాటు డిప్రెషన్ (మనోవ్యాకులత) చికిత్సలో సహాయక పాత్ర పోషిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అదెలాగంటే.. క్రియాటిన్ తీసుకోవడం వల్ల మెదడు కణాలు శక్తిని సమర్థవంతంగా వినియోగించుకుంటాయి, ఫలితంగా మూడ్ స్థిరంగా ఉండేలా చేసి చికిత్సలో మెరుగైన ఫలితాన్ని చూపిస్తుంది.
తిట్టుకోవడం.. పనితీరు పెంపు
తిట్టుకోవడం అనేది.. ప్రతికూలంగా భావించే అంశమే. కానీ.. శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏమిటంటే తీవ్ర ఒత్తిడి లేదంటే కష్టమైన పనిలో మనల్ని మనం కాస్త ఘాటు పదాలతో తిట్టుకోవడం వల్ల శరీరం ఎక్కువ శక్తి ఇస్తుంది. ఇది నొప్పి తట్టుకునే సామర్థ్యాన్ని పెంచి.. పనితీరు మెరుగుపరుస్తుంది. క్రీడల్లో, కఠినమైన వ్యాయామాల్లో ఇది సహజ రీతిలో కనిపించే అంశమే.
ఉదయాన్నే కాఫీ.. మూడ్ మెరుగుదల
కాఫీలోని కెఫిన్ మెదడులో డోపమైన్, సెరోటోనిన్ వంటి రసాయనాల స్థాయిని పెంచుతుంది. ఫలితంగా, రోజంతా ఉత్సాహం, ఏకాగ్రత, మూడ్ మెరుగుపడతాయి. ఉదయం ఒక కప్పు కాఫీ తాగడం వల్ల పనితీరు పెరిగి, జీవనశైలి ఉల్లాసంగా ఉంటుంది. ఇది మేం చెబుతున్నమాట కాదు.. పరిశోధనల్లో తేలిన అంశమే.


