ఐటీ జీతాల కంటే అర్బన్‌ కంపెనీలో అధిక‍ సంపాదన! | Urban Company Workers Earnings Beat Entry Level IT Salaries | Sakshi
Sakshi News home page

ఐటీ జీతాల కంటే అర్బన్‌ కంపెనీలో అధిక‍ సంపాదన!

Feb 6 2026 9:18 AM | Updated on Feb 6 2026 9:35 AM

Urban Company Workers Earnings Beat Entry Level IT Salaries

ఐటీ రంగంలో ఆరంభ స్థాయి ఉద్యోగుల వేతనాలకు సమానమైన, కొన్ని సందర్భాల్లో అంతకంటే అధిక ఆదాయాన్ని తమ ప్లాట్‌ఫామ్‌పై గిగ్‌వర్కర్లు (తాత్కాలిక కార్మికులు, నిపుణులు) పొందుతున్నారని అర్బన్‌ కంపెనీ తెలిపింది. అర్బన్‌ కంపెనీతో భాగస్వాములైన నిపుణులు సగటున ప్రతినెలా రూ.28,322 చొప్పున ఆర్జిస్తున్నారని పేర్కొంది.

బహిరంగంగా అందుబాటులో ఉన్న పరిశ్రమ డేటా, గ్లాస్‌డోర్‌ అంచనాల ఆధారంగా ఈ విషయాలు వెల్లడిస్తున్నట్టు పేర్కొంది. ఈ డేటా ఆధారంగా ఐటీ, ఐటీఈఎస్‌ రంగంలో ఆరంభ స్థాయి వార్షిక వేతనం రూ.4లక్షలుగా ఉన్నట్టు తెలిపింది. ఈ పోలికలు సూచనాత్మకమేనని, సందర్భానుసారం పేర్కొంటున్నట్టు స్పష్టం చేసింది.

తమ ప్లాట్‌ఫామ్‌లపై కొందరు అత్యధికంగా రూ.51,673 వరకు నెలవారీ ఆర్జిస్తున్నట్టు, ఐటీ రంగం ఆరంభ స్థాయి వేతనం కంటే 60 శాతం అధికమని అర్బన్‌ కంపెనీ తెలిపింది. తన ప్లాట్‌ఫామ్‌పై టాప్‌–20 సేవల నిపుణులు నెలవారీ సగటున రూ.42,418 చొప్పున.. టాప్‌–10 శాతం మంది రూ.47,471 చొప్పున, టాప్‌–5 శాతం మంది రూ.51,673 చొప్పున ఆదాయం పొందుతున్నట్టు వెల్లడించింది.

ఒక్కో భాగస్వామి ప్రతి నెలా 91 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నట్టు పేర్కొంది. ఈ ప్రకారం ప్రతి గంటకు రూ.313 వరకు ఆదాయం లభిస్తోందంటూ.. చట్టపరంగా కనీస వేతనం కంటే ఎక్కువని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement