ఇక ఫ్రెషర్లకూ భారీ జీతాలు.. | HCLTech hikes fresher salaries | Sakshi
Sakshi News home page

ఇక ఫ్రెషర్లకూ భారీ జీతాలు..

Jan 13 2026 4:57 AM | Updated on Jan 13 2026 5:07 AM

HCLTech hikes fresher salaries

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పాటు అనుబంధ ఆధునిక సాంకేతికతలలో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ఫ్రెషర్లకు హెచ్‌సీఎల్ టెక్ (HCLTech) భారీ ఎంట్రీ లెవల్ జీతాలు ఆఫర్ చేస్తోంది. డేటా & ఏఐ, డిజిటల్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్ స్కిల్స్ వంటి విభాగాల్లో నైపుణ్యం ఉన్న ఈ ఫ్రెషర్లను కంపెనీ అంతర్గతంగా ‘ఎలైట్ కేడర్’గా పిలుస్తోంది.

జనవరి 12న జరిగిన డిసెంబర్ త్రైమాసిక ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్‌లో హెచ్‌సీఎల్ టెక్  చీఫ్ పీపుల్ ఆఫీసర్ రామ్ సుందరరాజన్ మాట్లాడుతూ.. ‘రెండు త్రైమాసికాల క్రితమే ఎలైట్ ఇంజనీర్లపై మా దృష్టిని స్పష్టంగా వెల్లడించాం. రెగ్యులర్ ఫ్రెషర్ నియామకాలతో పోలిస్తే, ఎలైట్ కేడర్‌కు 3 నుంచి 4 రెట్లు ఎక్కువ జీతాలు అందిస్తున్నాం. ఇది సంవత్సరానికి రూ.18 లక్షల నుంచి రూ.22 లక్షల వరకు ఉంటుంది’ అని తెలిపారు.

ఎలైట్ కేడర్‌కు అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించాలంటే పోటీ జీతాలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. 2025 జూలైలో సుందరరాజన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం ఫ్రెషర్ నియామకాలలో ఎలైట్ కేడర్ వాటా సుమారు 15–20 శాతం ఉంటుంది. కంపెనీ ఇకపై పరిమాణం కంటే నాణ్యత, ప్రత్యేక నైపుణ్యాలపై ఎక్కువగా దృష్టి పెట్టనుంది. హెచ్‌సీఎల్ టెక్ మాత్రమే కాదు.. ప్రత్యర్థి సంస్థ ఇన్ఫోసిస్ కూడా ఇటీవల ఫ్రెషర్ల జీతాలను గణనీయంగా పెంచడం గమనార్హం.

క్యూ3 ముగింపు నాటికి హెచ్‌సీఎల్ టెక్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,26,379లకు చేరింది. ఈ త్రైమాసికంలో కంపెనీ హెడ్‌కౌంట్ స్పల్పంగా 261 తగ్గింది. డిసెంబర్ త్రైమాసికంలో 2,852 మంది ఫ్రెషర్లను జోడించినప్పటికీ, అట్రిషన్, సెలెక్టివ్ రేషనలైజేషన్ కారణంగా మొత్తం వర్క్‌ఫోర్స్‌లో స్వల్ప తగ్గుదల కనిపించింది. 2026 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటివరకు చేర్చుకున్న మొత్తం ఫ్రెషర్ల సంఖ్య 10,032 గా ఉంది.

హెచ్‌సీఎల్ టెక్ క్యూ3 ఫలితాలు
నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న హెచ్‌సీఎల్ టెక్ నికర లాభం డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో 11% తగ్గి రూ.4,076 కోట్లకు పరిమితమైంది.  ఏకీకృత ఆదాయం 13.3% పెరిగి రూ.33,872 కోట్లు నమోదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement