సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలోని డిసెంబర్ త్రైమాసికం (Q3) కోసం సంస్థ సగటున 85 శాతం పనితీరు బోనస్ ప్రకటించింది. ఈ బోనస్ ఫిబ్రవరి జీతంతో పాటు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కంపెనీ ఈమెయిల్ ద్వారా తెలిపింది.
ఈసారి మెరుగైన చెల్లింపులు
ఈసారి బోనస్ చెల్లింపులు మంచి వ్యాపార ఫలితాలు, కొత్త ఒప్పందాల విజయాల నేపథ్యంలో పెరిగినట్లు సమాచారం. టెక్నాలజీ స్టాక్స్ మార్కెట్లో ఒత్తిడి ఉన్న సమయంలో ఈ ప్రకటన ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.
కొంతమంది ఉద్యోగులు చెప్పినదాని ప్రకారం.. గత త్రైమాసికంతో పోలిస్తే సుమారు 15% ఎక్కువ బోనస్ ఈసారి అందనుంది. కొందరికైతే 100% వరకు కూడా వేరియబుల్ పే లభిస్తోంది. వ్యక్తిగత పనితీరు ఆధారంగా 75% నుంచి 100% మధ్య బోనస్ జమ చేయనున్నట్లు తెలిసింది.
ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కాకుండా, గత ఆర్థిక సంవత్సరంలోని ఏ త్రైమాసికంతో పోల్చినా మెరుగైన చెల్లింపుగా ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ షాజీ మాథ్యూ గత నెల టౌన్‌హాల్ సమావేశంలో ఈసారి వేరియబుల్ పే మెరుగ్గా ఉండొచ్చని సంకేతాలు ఇచ్చారు.
ఇన్ఫోసిస్‌లో ప్రస్తుతం సుమారు 3,23,000 మంది ఉద్యోగులు ఉన్నారు. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో అర్హులైన ఉద్యోగులకు సగటున 75% వేరియబుల్ పే చెల్లించిన సంస్థ, ఈసారి మరింత ఎక్కువగా అందించడం గమనార్హం.


