అంతర్జాతీయ ప్రయాణాలు చేసేటప్పుడు చాలామంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ జోన్‌కు రాగానే ఒక రకమైన ఆందోళనకు గురవుతుంటారు. కస్టమ్స్ అధికారులు కావాలనే కఠినంగా వ్యవహరిస్తారని లేదా కేవలం ఏదైనా వస్తువులు వ్యక్తిగత అవసరాల కోసం అని చెబితే సరిపోతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ, వాస్తవం దీనికి భిన్నంగా ఉంటుంది. కస్టమ్స్ చట్టాలు ప్రయాణికులను ఇబ్బంది పెట్టడానికి కాదనే విషయం గుర్తుంచుకోవాలి. అక్రమ రవాణాను అరికట్టడానికి, దేశ ఆర్థిక ఆదాయాన్ని కాపాడటానికి నిర్దేశించబడ్డాయి. లేటెస్ట్ అధికారిక సమాచారం ప్రకారం అంతర్జాతీయ ప్రయాణికులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు కింద ఉన్నాయి.
కస్టమ్స్ నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి?
ముందుగా ఒక ప్రాథమిక విషయాన్ని గమనించాలి. కస్టమ్స్ నిబంధనలు కేవలం అంతర్జాతీయ ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తాయి. మీరు భారతదేశం లోపల (డొమెస్టిక్) ప్రయాణిస్తుంటే కేవలం విమానయాన సంస్థల బ్యాగేజీ పరిమితులు మాత్రమే ఉంటాయి తప్ప కస్టమ్స్ డిక్లరేషన్ అవసరం ఉండదు.
విదేశీ నివాస కాలం కీలకం
మీరు విదేశాల్లో ఎంతకాలం గడిపారు అనే అంశంపైనే మీ బ్యాగేజీ మినహాయింపులు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా బంగారం వంటి వస్తువుల విషయంలో ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం విదేశాల్లో ఉన్నవారికి మాత్రమే ప్రత్యేక రాయితీలు వర్తిస్తాయి. స్వల్పకాలిక పర్యాటకులు, దీర్ఘకాలిక ఉద్యోగులు లేదా ఎన్ఆర్ఐ కేటగిరీని బట్టి అధికారులు నిబంధనలను పరిశీలిస్తారు.
బంగారం నిబంధనలు
భారతీయ విమానశ్రయాల్లో బంగారం అత్యంత సున్నితమైన అంశం. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. పురుషులు ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం విదేశాల్లో ఉంటే 20 గ్రాముల(గరిష్ట విలువ రూ.50,000) బంగారు ఆభరణాలను, మహిళలు ఏడాది కంటే ఎక్కువ కాలం విదేశాల్లో ఉంటే 40 గ్రాముల(గరిష్ట విలువ రూ.1,00,000) బంగారు ఆభరణాలను తీసుకురావచ్చు. ఇక్కడ బరువు, విలువ రెండూ పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో 20 గ్రాముల బంగారం విలువ రూ.50,000 దాటింది కాబట్టి ఆ పైన ఉన్న విలువకు ప్రయాణికులు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది.
గోల్డ్ బార్లు.. కాయిన్స్
ఆభరణాలకు ఇచ్చే మినహాయింపులు గోల్డ్ బార్లు లేదా నాణేలకు వర్తించవు. వీటిని వాణిజ్య పరమైనవిగా పరిగణిస్తారు కాబట్టి, వీటిపై పూర్తి స్థాయిలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వీటిని డిక్లేర్ చేయకుండా తీసుకురావడం చట్టరీత్యా నేరం.
మద్యం, నగదు పరిమితులు
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు గరిష్టంగా రెండు లీటర్ల మద్యం లేదా వైన్ మాత్రమే తీసుకురావడానికి అనుమతి ఉంది. ఈ పరిమితి దాటితే వాటిని జప్తు చేసే అవకాశం ఉంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, ప్రయాణికులు తమ వద్ద గరిష్టంగా రూ.25,000 వరకు నగదును ఉంచుకోవచ్చు. విదేశీ కరెన్సీని తీసుకురావడానికి గరిష్ట పరిమితి లేదు. కానీ
నగదు రూపంలో 5,000 అమెరికన్ డాలర్లు దాటినా, మొత్తం విదేశీ ఎక్స్ఛేంజ్ (నగదు + ట్రావెలర్స్ చెక్కులు) 10,000 డాలర్లు దాటినా కచ్చితంగా డిక్లేర్ చేయాలి.
‘పర్సనల్ యూజ్’ అంటే ఏమిటి?
కస్టమ్స్ క్లియరెన్స్‌లో ప్రయాణికులు తీసుకొస్తున్న వస్తువుల గురించి అధికారులు అడిగినప్పుడు సింపుల్‌గా పర్సనల్ యూజ్ అంటారు. కేవలం ప్రయాణికులు చెప్పిన మాటపై అధికారులు నమ్మకం ఉంచరు. వస్తువుల సంఖ్య, అవి కొత్తవా లేదా వాడినవా, ప్యాకింగ్ ఎలా ఉంది, మీరు తరచుగా ప్రయాణాలు చేస్తున్నారా అనే అంశాలను బట్టి అది వ్యక్తిగత అవసరమా లేక వాణిజ్య అవసరమా అని నిర్ణయిస్తారు. ఉదాహరణకు, ఒకటి రెండు వాడిన మొబైల్ ఫోన్లు వ్యక్తిగతమైనవిగా పరిగణిస్తారు. కానీ డజన్ల కొద్దీ సీల్ చేసిన కొత్త ఫోన్లు ఉంటే అది వాణిజ్య ఉద్దేశంగానే చూస్తారు.
సురక్షిత ప్రయాణం కోసం సూచనలు
కస్టమ్స్ నిబంధనలు ఉల్లంఘిస్తే 10% నుంచి 100% వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్నిసార్లు జైలు శిక్ష కూడా తప్పకపోవచ్చు. మీ వద్ద ఉన్న వస్తువులపై ఏమాత్రం సందేహం ఉన్నా ఎయిర్‌పోర్ట్‌లోని రెడ్ ఛానల్(కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన వస్తువులు ఉన్న ప్రయాణికుల కోసం ఉద్దేశించింది) వద్దకు వెళ్లి అధికారులను సంప్రదించాలి. నిజాయితీగా డిక్లేర్ చేయడం వల్ల మీరు అనవసరపు ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. గ్రీన్ ఛానల్(కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన వస్తువులు ఏవీ లేవని భావించే ప్రయాణికుల కోసం ఉద్దేశించింది) ద్వారా దొంగచాటుగా వెళ్లడం వల్ల కలిగే రిస్క్ చాలా ఎక్కువ.
-దవనం శ్రీకాంత్


