అబుదాబి: యూఏఈలో విమానయాన రంగం కొత్త పుంతలు తొక్కనుంది. వచ్చే ఏడాది నాటికి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్స్ అందుబాటులోకి రానున్నాయి. తద్వారా 1.28 లక్షల కోట్ల దిర్హమ్‌ల పెట్టుబడులు ఆకర్షించగలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దుబాయ్ వరల్డ్ సెంట్రల్ నుండి షార్జా, రాస్ అల్ ఖైమా వరకు మరిన్ని రన్‌వేలు, టెర్మినల్స్, స్మార్ట్ మౌలిక సదుపాయాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
షార్జా:
2028 నాటికి షార్జా విమానాశ్రయం విస్తరణ పూర్తవుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రాస్ అల్ ఖైమా:
2031 నాటికి కొత్త టెర్మినల్ ప్రారంభం కానుంది. 11 కోట్ల ప్రయాణికుల సామర్థ్యంతో ఇది మధ్యప్రాచ్యంలో కీలక కేంద్రంగా మారనుంది.
2043 నాటికి యూఏఈ మొత్తం 53 కోట్ల ప్రయాణికులను ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యాన్ని సాధించాలన్నది ప్రధాన లక్ష్యం. ఈ విస్తరణ ప్రాజెక్టులు గల్ఫ్ ప్రాంతాన్ని ప్రపంచ విమానయాన రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టనున్నాయని అంచనా.

విమానాశ్రయాల విస్తరణతో పర్యాటక రంగం, వాణిజ్యం, ఉద్యోగావకాశాలు విస్తృతంగా పెరగనున్నాయి. ఏఐ ఆధారిత సిస్టమ్స్, సస్టైనబుల్ ఎనర్జీ వినియోగం ఈ ప్రాజెక్టుల ప్రత్యేకత. దోహా, ఒమాన్, బహ్రెయిన్ వంటి దేశాలతో యూఏఈ పోటీ పడనుంది. తద్వారా యూఏఈ విమానాశ్రయ విస్తరణ ప్రాజెక్టులు కేవలం గగనతల ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా, మధ్యప్రాచ్యాన్ని ప్రపంచ విమానయాన రంగంలో కీలక కేంద్రంగా నిలబెట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి.


