ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల పోటీ మళ్లీ పెరగనుందా?. అమెరికా-రష్యా మధ్య న్యూస్టార్ట్ ఒప్పందం ముగియడం ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే అదనుగా.. ఇటు పాక్-చైనాలు పరస్పర అణు సహకారంతో భారత్‌కు సవాల్ విసిరే అవకాశం లేకపోలేదు. అయితే.. ఇదంతా ఇండియా మంచికే అంటున్నారు నిపుణులు.
అమెరికా–రష్యా మధ్య ఉన్న New START అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం గడువు 2026 ఫిబ్రవరి 5వ తేదీతో ముగిసింది. ఒప్పందం పునరుద్ధరణ ప్రస్తావనే లేకపోవడంతో.. ఈ రెండు దేశాల మధ్య అణు ఆయుధాలపై ఎలాంటి అధికారిక పరిమితులు లేకుండా పోయాయి. ఇప్పుడు అమెరికా, రష్యా తమ అణు శక్తిని ఇష్టానుసారం పెంచుకునే అవకాశం పొందాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆందోళనలకు దారితీస్తోంది. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న అణు శక్తి దేశాలపై దీని ప్రభావం గణనీయంగా ఉండనుంది.
అమెరికా–రష్యా పరిమితులు తొలగిపోవడంతో కొత్త ఆయుధ పోటీ మొదలయ్యే అవకాశం ఉంది. పెద్ద శక్తులే ఆయుధాలను పెంచుకుంటే.. మనం ఎందుకు నియంత్రించుకోవాలి? అని ఇతర దేశాలు భావించొచ్చు. ఇదే అదనుగా.. తమ అణ్వాయుధ సంపత్తిని పెంచుకునే దిశగా అడుగులు వేయవచ్చు. అదే గనుక జరిగితే.. అణ్వాయుధాల వ్యాప్తిని నియంత్రించడానికి 1970లో అమల్లోకి వచ్చిన అంతర్జాతీయ ఒప్పందం ఎన్‌పీటీ (Non-Proliferation Treaty) కనుమరుగయ్యే అవకాశం ఉంది.
ఎన్‌పీటీ అంటే..
• కొత్త దేశాలు అణు ఆయుధాలు తయారు చేయకుండా నిరోధించడం.
• ఇప్పటికే అణు శక్తి కలిగిన దేశాలు (అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్) ఆయుధాలను తగ్గించడం.
• అణు శక్తిని శాంతి ప్రయోజనాల కోసం (ఉదా: విద్యుత్ ఉత్పత్తి) ఉపయోగించడానికి సహకారం అందించడం.
భారత్‌పై ప్రత్యక్ష ప్రభావం
భారత్ ఇప్పటిదాకా క్రెడిబుల్ మినిమమ్ డిటర్రెన్స్ అనే అణు వ్యూహాన్ని పాటిస్తోంది. దీని ప్రకారం.. శత్రువు దాడి చేయకుండా నిరోధించడానికి, భారత్ వద్ద ఉన్న అణు శక్తి నమ్మదగినది (credible)గా ఉండాలి. అది శత్రువుకు నమ్మదగిన నిరోధక శక్తిగా (deterrent) పనిచేయాలి. అవసరానికి మించి పెద్ద అణు నిల్వలు కాకుండా.. తన భద్రతకు అవసరమైన కనీస అణు ఆయుధ శక్తిని మాత్రమే కలిగి ఉంటే చాలూ(Minimum). అలాగే.. భారత్ అణు ఆయుధాలను మొదటగా వాడకూడదు(No First Use-NFU). కానీ దాడి జరిగితే తప్పనిసరిగా ప్రతిదాడి చేయొచ్చు. శత్రువు మొదట దాడి చేసినా, భారత్ వద్ద ప్రతిదాడి చేసే సామర్థ్యం ఉండాలి( Second Strike Capability). 1999లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ‘‘డ్రాఫ్ట్ న్యూక్లియర్ డాక్ట్రైన్’’లో సీడీఎం అనే సూత్రాన్ని ప్రకటించింది. ఆపై 2003లో న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఏర్పాటుతో ఎన్‌ఎఫ్‌యూలో కొన్ని మార్పులు చేశారు. ఆ మార్పుల ప్రకారం.. బయోలాజికల్ లేదంటే కెమికల్ దాడి జరిగినా అణు ప్రతిదాడి చేసే అవకాశం కల్పించారు. మొత్తంగా భారత అణువిధానం.. అణ్వాయుధాలను రక్షణ కోసం మాత్రమే దాడి కోసం కాదు అని పాటిస్తూ వస్తోంది. అయితే..
భారమే అయినా..
న్యూస్టార్ట్స్ గడువు ముగిసింది. అణ్వాయుధ పోటీలో భాగంగా చైనా తన అణు శక్తిని పెంచే అవకాశం లేకపోలేదు. అలాగే పాకిస్తాన్‌తో అణు సహకారం పెంచుకోవచ్చు కూడా. అణ్వాయుధ పోటీ వల్ల ఈ రెండు దేశాలు మరింత శక్తివంతమైన వ్యూహాలను అవలంబించే అవకాశం ఉంది. అదే జరిగితే.. భారత్ కూడా తన నిరోధక శక్తిని పునఃపరిశీలించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా.. భారత్ తన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, సబ్‌మేరిన్ ఆధారిత అణు నిరోధక శక్తిను బలోపేతం చేయాల్సి ఉంటుంది. అణు ఆయుధాల అభివృద్ధి, నిర్వహణ ఖర్చులు భారత్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచొచ్చు. అలాగే.. రక్షణ బడ్జెట్‌లో మరింత పెంపు అవసరం పడుతుంది. అంటే ఆర్థిక, భద్రతా, రాజనీతిక సవాళ్లు పెరుగుతాయన్నమాట. మరోవైపు..
అమెరికా–రష్యా పోటీ వల్ల కొత్త మల్టిలేటరల్ చర్చలు అవసరం అవుతాయి. జీ20, బ్రిక్స్ సదస్సులతో పాటు ఐక్యరాజ్య సమితి లాంటివి అందుకు వేదికలు అవుతాయి. ఇందులో భారత్‌కు కచ్చితంగా ప్రాధాన్యత లభించవచ్చు. ఎన్‌పీటీలో సభ్యత్వం లేని భారత్ ఇదే అదనుగా అంతర్జాతీయ వేదికలపై పారదర్శకత, నియంత్రణ చర్యలు కోరవచ్చు. ఇది భారత్‌కు గ్లోబల్ లీడర్‌షిప్ అవకాశాన్ని కలిగిస్తుంది. నో ఫస్ట్ యూజ్ విధానం కొనసాగిస్తున్న భారత్.. తన నైతిక స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు.
ఏంటీ న్యూస్టార్ట్?
న్యూస్టార్ట్ (New Strategic Arms Reduction Treaty) అనేది.. అమెరికా–రష్యా మధ్య 2010లో కుదిరిన అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం. పూర్తి పేరు: Treaty between the United States of America and the Russian Federation on Measures for the Further Reduction and Limitation of Strategic Offensive Arms. దీని ప్రధాన ఉద్దేశ్యం రెండు దేశాల వద్ద ఉన్న వ్యూహాత్మక అణు ఆయుధాలను పరిమితం చేసి, ప్రపంచ భద్రతను బలోపేతం చేయడం.
కోల్డ్ వార్ తర్వాత అమెరికా, రష్యా వద్ద ప్రపంచంలోనే అత్యధికంగా అణ్వాయుధ నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధ ఆందోళనకు గురి చేసింది. ఈ తరుణంలో 2010 ఏప్రిల్ 8న, ప్రాగ్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ సంతకం చేశారు. 2011 ఫిబ్రవరి 5 నుంచి అమల్లోకి వచ్చింది. తరువాత 2021లో 5 సంవత్సరాలు పొడిగించబడింది. ఇందులో భాగంగా.. అణు ఆయుధాల విషయంలో ప్రపంచంలో శక్తివంతమైన దేశాలైన అమెరికా, రష్యాలు పరిమితంగా ఉండాలి. ఒకదానికొకటి లెక్కలు చెప్పుకోవాలి. అలాగే అణు ఆయుధాల నియంత్రణ ద్వారా ఇతర దేశాలకు కూడా భద్రతా హామీ ఇవ్వాలి. కానీ, 2026 ఫిబ్రవరి 5న గడువు ముగిసింది. ఇప్పుడు అమెరికా–రష్యా మధ్య అణు ఆయుధాలపై ఎలాంటి అధికారిక పరిమితులు లేవు.
:::వెబ్‌డెస్క్ ప్రత్యేకం


