అమెరికా పవర్‌ఫుల్‌ కంట్రీ.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు | Donald Trump On His First Term And Army Status | Sakshi
Sakshi News home page

అమెరికా పవర్‌ఫుల్‌ కంట్రీ.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

Feb 6 2026 7:46 AM | Updated on Feb 6 2026 8:43 AM

Donald Trump On His First Term And Army Status

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా అంటూ ట్రంప్‌ చెప్పుకొచ్చారు. అమెరికా రక్షణ రంగాన్ని ఎప్పుడూ లేని స్థాయిలో బలోపేతం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో న్యూ స్టార్ట్ అణు ఆయుధ నియంత్రణ ఒప్పందంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా సోషల్‌ మీడియా ట్రుత్‌ వేదికగా స్పందిస్తూ..‘అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం. నా ఫస్ట్ టర్మ్‌లోనే మిలిటరీని పూర్తిగా అత్యున్నతంగా తీర్చి దిద్దాను. కొత్త అణ్వాయుధాలు అభివృద్ధి చేశాం. పాత వాటిని రీఫర్బిష్ చేశాం. దేశ రక్షణ రంగాన్ని ఎప్పుడూ లేని స్థాయిలో బలోపేతం చేస్తున్నామన్నారు. అమెరికా సైనిక శక్తి, అణ్వాయుధ సామర్థ్యం గొప్పది. అమెరికా స్పేస్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం మా ప్రభుత్వ పెద్ద నిర్ణయం. అంతరిక్ష భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ చర్య అమెరికా రక్షణ వ్యవస్థను మరింత బలపరిచింది. భవిష్యత్ యుద్ధాలు భూమి మీదే కాకుండా అంతరిక్షంలోనూ జరుగుతాయని, అందుకే స్పేస్ ఫోర్స్ కీలకం’ అని పేర్కొన్నారు.

యూఎస్‌ నౌకా దళంపై..
నౌకాదళ విభాగంపై కూడా ట్రంప్ ప్రత్యేకంగా మాట్లాడారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సేవలందించిన ఐవా, మిస్సోరీ, అలబామా వంటి యుద్ధనౌకల కంటే 100 రెట్లు శక్తిమంతమైన ఆధునిక బ్యాటిల్‌షిప్‌లను నిర్మిస్తున్నామని తెలిపారు. సముద్ర రక్షణను మరింత పటిష్టం చేయడమే తమ లక్ష్యమన్నారు.

భారత్‌, పాక్‌పై పాత పాటే.. 
ఇక అణు యుద్ధాల అంశంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి రేకెత్తించాయి. భారత్-పాకిస్తాన్, ఇరాన్ ఇజ్రాయెల్, రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యే సమయంలో అణు ఘర్షణలు తలెత్తకుండా తానే జోక్యం చేసుకుని ఆపానని తెలిపారు. అయితే యుద్ధాలకు సంబంధించి స్పష్టమైన వివరాలు మాత్రం ఇవ్వలేదు. అదేవిధంగా దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కూడా ట్రంప్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో అమెరికా మధ్యవర్తిత్వం చేసిందని చెప్పారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు గత ఏడాది నుంచి కృషి చేస్తున్నానని, అర్మేనియా- అజర్‌బైజాన్ మధ్య దీర్ఘకాల ఘర్షణను కూడా పరిష్కరించానని పేర్కొన్నారు.

అణు నియంత్రణపై.. 
ఇక న్యూ స్టార్ట్ అణు ఆయుధ నియంత్రణ ఒప్పందంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం సరైన విధంగా చర్చించకుండా కుదిరిందని, అమెరికాకు అనుకూలంగా లేదని విమర్శించారు. అంతేకాకుండా ఇది ఉల్లంఘనలకు గురవుతోందని ఆరోపించారు. దీనిని పొడిగించడానికి బదులుగా కొత్త, మెరుగైన, ఆధునిక ఒప్పందాన్ని రూపొందించాలని సూచించారు. ఈ నేపథ్యంలో అమెరికా అణు నిపుణులు కలిసి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త ఒప్పందం రూపొందించాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక భద్రతను కల్పించే విధంగా సమగ్ర అణు నియంత్రణ వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement