పాక్‌ ఆర్మీ అరాచకం.. బలూచిస్తానీల ఊచకోత | Pakistan Army Sensational Statement On Balochistan | Sakshi
Sakshi News home page

పాక్‌ ఆర్మీ అరాచకం.. బలూచిస్తానీల ఊచకోత

Feb 6 2026 7:13 AM | Updated on Feb 6 2026 8:36 AM

Pakistan Army Sensational Statement On Balochistan

ఇస్లామాబాద్‌: కల్లోలిత బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఆపరేషన్‌లో కనీసం 216 మంది ఉగ్రవాదులు హతమయ్యారని పాకిస్తాన్‌ ఆర్మీ గురువారం తెలిపింది. మరో 22 మంది భద్రతా సిబ్బంది, మహిళలు, చిన్నారులు కలిపి 36 మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారంది.

రాద్‌ ఉల్‌ ఫిత్నా–1 పేరుతో జనవరి 26వ తేదీన చేపట్టిన ఈ ఆపరేషన్‌ విజయవంతంగా ముగిసిందని తెలిపింది. ఉగ్రవాద బృందాల నాయకత్వాన్ని, పోరాట పటిమను తీవ్రంగా దెబ్బకొట్టామని, కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థలను ధ్వంసం చేశామని పేర్కొంది. గత ఐదు రోజులుగా నిలిపివేసిన రైళ్ల రాకపోకలను గురువారం నుంచి తిరిగి అధికారులు మొదలుపెట్టారని వెల్లడించింది. ఇరాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌ సరిహద్దులను కలిపే ఈ ప్రావిన్స్‌లో బలూచ్‌ వేర్పాటువాద గ్రూపులు చురుగ్గా పనిచేస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. బలూచిస్థాన్‌ వేర్పాటువాదులు చేతుల్లో పాక్‌ సైన్యానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బలోచ్ లిబరేషన్ ఆర్మీ రెబల్స్‌కు పాక్ సైన్యం ఎదురు నిలబడి పోరాడలేని పరిస్థితి నెలకుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ స్వయంగా అంగీకరించడం గమనార్హం. బలూచిస్థాన్‌ ప్రావిన్సుల్లో రెబల్స్‌ను ఎదుర్కొనలేక తమ సైన్యం చేతులెత్తేసిందని ఆయన వ్యాఖ్యానించారు. 

ఇదే సమయంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీతో ఎటువంటి చర్చలు ఉండబోవని అసిఫ్ తేల్చిచెప్పారు. మహిళలు, చిన్నారులు సహా పౌరులను చంపుతోన్న ఉగ్రవాదులతో చర్చలు ప్రసక్తేలేదని పాక్ రక్షణ మంత్రి ఉద్ఘాటించారు. నేరస్థులకు, వేర్పాటువాద గ్రూపులకు మధ్య సంబంధం ఉందని, బీఎల్ఏ బ్యానర్ కింద నేర ముఠాలు పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. అఫ్గానిస్తాన్, ఇరాన్‌తో సరిహద్దులు పంచుకునే బలూచిస్థాన్ ప్రావిన్సుల్లో దశాబ్దాలుగా వేర్పాటువాద ఉద్యమం కొనసాగుతోంది. పాక్ పాలన కింద తాము ఉండబోమని, ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కోరుకుంటున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement