పాక్‌కు బంగారం దొరికింది.. భూమిలో నుంచి బయటపడేది అప్పుడే.. | gold mine found in indus river in pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌కు బంగారం దొరికింది.. భూమిలో నుంచి బయటపడేది అప్పుడే..

Feb 5 2026 4:41 PM | Updated on Feb 5 2026 6:48 PM

gold mine found in indus river in pakistan

పొరుగు దేశం పాకిస్థాన్ గత కొన్నేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కనీసం ఆ దేశ ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితుల్లో ఉంది .అయితే, ఇప్పుడు సింధు నదిలో బంగారు నిల్వలు కనుగొనడంతో ఆ దేశానికి గడ్డు రోజులు పోతున్నట్లు కనిపిస్తోంది. మాజీ మైనింగ్ మంత్రి ఇబ్రహీం హసన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్‌ దేశంలో భారీ బంగారు నిల్వలను కనుగొన్నట్లు పేర్కొన్నారు. 

పంజాబ్ ప్రావిన్స్‌లో ఇంత పెద్ద మొత్తంలో బంగారం నిల్వలు కనుగొనబడ్డాయి. కానీ నదుల్లో బంగారు నిల్వలను కనుగొనడం వల్ల ఆఫ్రికన్ దేశాల్లో జరుగుతున్నట్లుగా కొత్త సమస్యలు వస్తాయన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. కానీ కథ ఇక్కడితో ముగియదు. 

గతంలో ఆఫ్రికా దేశాలు కూడా ఇలాగే బంగారు నిల్వలు కనుగొన్నారు.. బుర్కినా ఫాసో, మాలి, నైజర్ లాంటి దేశాల్లో బంగారం బయటపడింది. అయితే ఆ దేశాలు అభివృద్ధి దిశగా వెళ్లక పోగా  అక్కడ బంగారం మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తీవ్రవాద గ్రూపులు తమ కార్యకలాపాలకు ఉపయోగించుకున్నాయి. గత 15ఏళ్ల  కాలంలో అనేక ఆఫ్రికన్ దేశాల్లో బంగారం, విలువైన లోహాల నిల్వలు ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. తీవ్రవాద గ్రూపులు మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉగ్రవాదం, నెట్‌వర్కింగ్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాయి. బంగారం ద్వారా తమ జీవితాలను మెరుగుపరుచుకోవాలని కలలు కంటున్న స్థానిక ప్రజలను బంగారం తవ్వకం పనిలోకి దింపారు. జీతాలు స్థానికులే చెల్లిస్తున్నారు. ఆ డబ్బు మాత్రం ఉగ్రవాదులకు వెళ్తోంది. అన్ని వనరులను ఆక్రమించుకున్న ఉగ్రవాదులు ఇప్పుడు అక్కడి యువతను కూడా తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు.

ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… మన పొరుగుదేశం చైనా కూడా ఇటీవలే భారీ బంగారు నిల్వలను కనుగొంది. అక్కడి పాలకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్థాన్ కూడా అదే ఆశతో ఉంది. కానీ బంగారం దొరకడం ఒక్కటే కాదు… వాటిని పారదర్శకంగా, ప్రజల ప్రయోజనానికి ఉపయోగించడం చాలా ముఖ్యం. కాబట్టి చివరికి ప్రశ్న ఒక్కటే—ఈ బంగారం పాకిస్థాన్‌కు వరమా? లేక భవిష్యత్తులో కొత్త జియోపాలిటికల్ ఆటకు వేదిక అవుతుందా? దేశాన్ని ఆర్థికంగా నిలబెడుతుందా? లేక అంతర్గత సమస్యలను మరింత పెంచుతుందా? దీనికి సమాధానం రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది.

సింధు నదిలో దొరుకుతున్న బంగారం హిమలయ పర్వతాల నుంచి వచ్చిందని చెప్పవచ్చు. అక్కడ టెక్టోనిక్ కార్యకలాపాల కారణంగా మిలియన్ల ఏళ్ల క్రితం నదిలో ఖనిజాలు ఏర్పడ్డాయి. పాకిస్థాన్ మీదుగా ఆ నది ప్రవహించినప్పుడు బంగారు కణాలు దానిలో వెళ్లిపోతాయి. అనంతరం ఒడ్డున ప్లేసర్ డిపాజిట్లుగా ఏర్పడతాయి. అంటే బంగారు నిల్వలుగా రూపాంతరం చెందుతాయి. నీటి మట్టాలు తక్కువగా ఉండే శీతాకాలంలో అవి బయటపడతాయి. 

Advertisement
 
Advertisement
Advertisement