ఎమ్మెల్యేల కేసు.. స్పీకర్‌పై సుప్రీంకోర్టు సీరియస్‌ | Supreme Court Serious Comments On Speaker Over Disqualified BRS MLAs, Gives 3 Week Deadline | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేల కేసు.. స్పీకర్‌పై సుప్రీంకోర్టు సీరియస్‌

Feb 6 2026 1:58 PM | Updated on Feb 6 2026 2:27 PM

Supreme Court Serious On BRS MLAs Defection Case

సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు చివరిగా మరో అవకాశం ఇచ్చింది.

బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేల విచారణకు సమయం పొడిగించాలని స్పీకర్‌ తరఫున సంఘ్వీ కోర్టును కోరారు. ఒక ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ విచారణ జరిగిందని, ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ జరుగుతుందని అభిషేక్ సింఘ్వీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. మరో మూడు వారాల సమయం ఇచ్చింది. మూడు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. అయితే, గత విచారణ సందర్భంగా.. అనర్హత అంశాన్ని తేల్చాలని ఇప్పటికే స్పీకర్‌కు చాలా సమయం ఇచ్చామని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తిచేసి కోర్టుకు నివేదిక సమర్పించాలని స్పీకర్‌ను ఆదేశించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement