వారిది ఫెవికాల్‌ బంధం | Revanth Reddy visit to Choppadandi constituency in Karimnagar district on Thursday | Sakshi
Sakshi News home page

వారిది ఫెవికాల్‌ బంధం

Feb 6 2026 5:56 AM | Updated on Feb 6 2026 5:56 AM

Revanth Reddy visit to Choppadandi constituency in Karimnagar district on Thursday

బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య చీకటి ఒప్పందం – చొప్పదండి సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మామూళ్లు వసూలు చేసి గులాబీ నేతలను బీజేపీ కాపాడుతోంది

రూ.లక్షల కోట్లు దోచుకున్నా కేసులు నమోదు చేయడం లేదు

మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో 8 స్థానాల్లో బీజేపీని బీఆర్‌ఎస్‌ గెలిపించిందన్న సీఎం

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తా చూపిస్తామని స్పష్టీకరణ

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:  ‘బీజేపీ– బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్‌ బంధం. రెండింటి మధ్య చీకటి ఒప్పందం ఉంది. బీఆర్‌ఎస్‌ నేతల నుంచి ప్రొటెక్షన్‌ మనీ పేరిట మామూళ్లు వసూలు చేసి.. రూ.లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై బీజేపీ ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదు..’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. 

గురువారం కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్‌లో ‘ప్రజాపాలన– ప్రగతిబాట’బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తొలుత రామడుగు మండలంలో అడ్వాన్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (ఏటీసీ), గంగాధరలో డిగ్రీ కాలేజీ, రామడుగు దత్తోజీపేటలో సోలార్‌ ప్లాంట్‌ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో ప్రసంగించారు. 

అరెస్టు చేయరు..విచారణ సాగదు 
‘2014లో మోదీ పాలమూరుకు వచ్చినప్పుడు పాలమూరు– రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. కాళేశ్వరం, మెట్రో, మూసీ, రీజినల్‌ రింగ్‌రోడ్డు అనుమతులు వేటికీ మోక్షం లేదు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అవయవ దానం తరహాలో ఓట్లు దానం చేసి 8 స్థానాల్లో బీజేపీని గెలిపించింది. కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎం కార్డు అయిందన్న మోదీ, అమిత్‌షాలు ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేంద్రానికి నివేదిక పంపినా పట్టించుకోరు.. కేసీఆర్, హరీశ్‌లను అరెస్టు చేయరు.. సీబీఐ విచారణ ముందుకు సాగదు. 

ఫార్ములా ఈ రేసులో అక్రమాలపై కేటీఆర్‌ను అరెస్టు చేయరు. కేసీఆర్‌ అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుంటున్నాడు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్‌లు పిల్లి శాపనార్థాలు పెడుతూ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. సంతోష్ రావు మిడ్‌మానేరులో భూములు, ఇసుక, కంకర, గాలి, నీరు దేన్నీ వదలకుండా దోచుకున్నాడు..’అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు 

పాల పిట్టల్లా ఆడపడుచులు 
‘2004లో ఇదే కరీంనగర్‌ గడ్డ మీద సోనియాగాంధీ తెలంగాణ ఇస్తామని మాటిచ్చారు. ఏపీ, కేంద్రంలో అధికారం కోల్పోయినా ఇచ్చి న మాటకు కట్టుబడి 60 ఏళ్ల తెలంగాణ ప్రజాకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియాది. ప్రజలు కేసీఆర్‌కు పదేళ్లు అధికారమిస్తే.. ఆస్తులు, కాంట్రాక్టులు, టీవీలు, పేపర్లు, ఫామ్‌హౌస్‌లు కూడబెట్టారు. 2004 నుంచి 2014 వరకు మేము తెలంగాణలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తే.. 2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్‌ ఒక్క డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు కూడా ఇవ్వలేదు. 

రైతు కష్టాలు చూసి చలించి ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత వైఎస్‌ రాజశేఖరరెడ్డిదే. అసలు ఉచిత కరెంటు అంటేనే కాంగ్రెస్‌ పేటెంట్‌. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ లాంటి ప్రతిష్టాత్మక పథకాలు తెచ్చింది కాంగ్రెస్‌. ఇప్పుడు సన్న బియ్యం, రైతు రుణమాఫీ, రైతుబీమా, రైతు భరోసా, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం తదితర పథకాలు అమలు చేస్తోంది. గతంలో బతుకమ్మ చీరల్లో కుంభకోణాలకు పాల్పడ్డారు. వాటిని ఎవరూ కట్టుకోలేదు. మేం ఇచ్చిన ఇందిరమ్మచీరలు కట్టుకుని నా ఆడపడుచులుపాల పిట్టల్లా కనిపిస్తున్నారు..’అని సీఎం వ్యాఖ్యానించారు.  

అన్నిచోట్లా కాంగ్రెస్‌ జెండా ఎగరాలి 
‘రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు రూ.17,442 కోట్లు ఇస్తే.. అందులో పాత కరీంనగర్‌ జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.2,778 కోట్లు ఇచ్చాం. మరిన్ని పనులు సజావుగా జరగాలంటే మీ కౌన్సిలర్, కార్పొరేటర్‌ కాంగ్రెస్‌ వాళ్లే అయి ఉండాలి. అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి. 8 ఏండ్లు మేమే అధికారంలో ఉంటాం. గతంలో వేములవాడకు వెళితే పదవులు పోతాయన్న అపవాదును మేం అధిగమించాం. 

అక్కడే సభ పెట్టి రూ.150 కోట్ల పనులకు శ్రీకారం చుట్టాం. కొండగట్టు, ధర్మపురి ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా బాసర నుంచి భద్రాచలం వరకు ప్రతి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.5 వేల కోట్లు వెచ్చిస్తా. కరీంనగర్‌ ఔటర్‌ రింగు రోడ్డు, వరంగల్‌ ఔటర్‌ రింగు రోడ్డులకు మధ్యలో డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేస్తాం. 

బండి, గుండులను మోదీ గుర్తుపట్టడు 
బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు తప్ప ఏమీ ఇవ్వలేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఢిల్లీ నుంచి నిధులు తేవడం చేతకాదు. అసలు బండి, గుండులను మోదీ గుర్తే పట్టడు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ను చేజిక్కించుకునేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ చేతులు కలిపేందుకు సిద్ధమయ్యాయి. 

కానీ ఢిల్లీ నుంచి మోదీ, అమిత్‌షాలు వచ్చినా ఆ పార్టీ ఒక్క మున్సిపాలిటీ కూడా గెలవకుండా కాంగ్రెస్‌ సత్తా చూపిస్తాం..’అని సీఎం అన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, విప్‌ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, రాజ్‌ఠాకూర్, విజయరమణా రావు, కవ్వంపల్లి సత్యనారాయణ సభలో పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement