కాంగ్రెస్‌కు ఓటేస్తే మరోసారి మోసపోయినట్లే.. | KTR at the Sircilla election campaign | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ఓటేస్తే మరోసారి మోసపోయినట్లే..

Feb 6 2026 5:51 AM | Updated on Feb 6 2026 5:51 AM

KTR at the Sircilla election campaign

రెండేళ్లలో ఒక్క హామీని కూడా రేవంత్‌ నెరవేర్చలేదు 

చిన్న జిల్లాలనుఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర 

సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌ 

సిరిసిల్ల: మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేస్తే మరోసారి మోసపోయినట్లేనని, ఆరు గ్యారంటీల పేరిట 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి రెండేళ్లలో ఒక్క హామీని నెరవేర్చలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల తర్వాత రైతుబంధు వేస్తానని సీఎం చెబుతున్నారని, కానీ ఇప్పటికి ఎన్ని పంట కాలాలు గడిచాయి? ఎన్నిసార్లు రైతుబంధు వేశారో చెప్పాలని అన్నారు. 

రైతుబంధు డబ్బులు వారి ఖాతాల్లో వేయడానికి మున్సిపల్‌ ఎన్నికలు ఎలా అడ్డు వస్తున్నాయని ప్రశ్నించారు. ఎన్నికలు అయిపోయేంత వరకుఆశ చూపించి, మరోసారి మోసం చేయడానికే రేవంత్‌రెడ్డి ఈ మాట చెబుతున్నారని ఆరోపించారు. గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వ హించిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు..  

కేసీఆర్‌ను తిట్టడం దేనికి? 
‘ముఖ్యమంత్రికి చేతిలో అధికారం, అవకాశం ఉన్న ప్పుడు చేతనైతే ప్రజలకు మంచి చేయాలి..ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కానీ గత సీఎం కేసీఆర్‌ను తిట్టవలసిన అవసరం ఏముంది? ప్రతి అంశంలో అడ్డగోలుగా మాట్లాడడం, అబద్ధాలు ఆడటం తప్పించి, ఈ రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయలేదు. కేసీఆర్‌ ఏర్పాటు చేసిన చిన్న జిల్లాలను తీసివేయాలని ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. 

ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఓటేయాలి. గత పదేళ్లపాటు ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇచి్చన పార్టీకి, రెండేళ్లలో ఉన్న సంక్షేమ పథకాలను ఎత్తివేసిన కాంగ్రెస్‌ పార్టీకి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి’అని కేటీఆర్‌ చెప్పారు.  

ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చారా? 
కాంగ్రెస్‌ పార్టీ కల్యాణలక్ష్మీ కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చింది. ఒక్కరికైనా రేవంత్‌రెడ్డి తులం బంగారం ఇచ్చారా? (బంగారం కొనలేదని, నా భార్య నన్ను తిడుతోందంటూ కేటీఆర్‌ నవ్వులు పూయించారు) నేతన్నల బతుకులను బజారున పడేశారు.

బతుకమ్మ చీరలతో ఉపాధి పొందిన కార్మికులు ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. 12 ఏళ్లలో ఏమీ చేయలేని బీజేపీ నేతలు గుడిముందు బిచ్చగాళ్లలాగా.. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటున్నారు’అని కేటీఆర్‌ అన్నారు. ప్రచారంలో భాగంగా సిరిసిల్లలోని పలు వార్డుల్లో ఆయన పర్యటించారు.  

చిన్నారిని బుజ్జగిస్తూ, ఆడిస్తూ.. 
సిరిసిల్లలో ఒకటో వార్డు జ్యోతినగర్‌లో నిర్వహించిన భేటీలో ఓ మహిళ వద్ద ఉన్న చిన్నారిని కేటీఆర్‌ తీసుకుని బుజ్జగించి, ఆడించారు.  

Advertisement
 
Advertisement
Advertisement