26 నెలల్లో ఫోన్‌ట్యాపింగ్‌పై ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలి | Kishan Reddy at Save Telangana Support BJP program | Sakshi
Sakshi News home page

26 నెలల్లో ఫోన్‌ట్యాపింగ్‌పై ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలి

Feb 6 2026 4:45 AM | Updated on Feb 6 2026 4:45 AM

Kishan Reddy at Save Telangana Support BJP program

‘సేవ్‌ తెలంగాణ–సపోర్ట్‌ బీజేపీ’కార్యక్రమంలో కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ పాలనలో సీఎం కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై దర్యాప్తు చేస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ గత 26 నెలల పాలనలో ఏం చేసిందో చెప్పాలని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఇప్పటికే 26 నెలలు పాలన పూర్తయినా ఫోన్‌ ట్యాపింగ్‌ వంటి తీవ్రమైన అంశంలో నిజమైన బాధ్యులపై ఎలాంటి కఠిన చర్యలు లేవన్నారు. దీనికి కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ మధ్య ఉన్న రాజకీయ అవగాహన ఒప్పందమే కారణమని చెప్పారు. 

ఢిల్లీ స్థాయిలో రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే– కేసీఆర్‌ మధ్య ఒప్పందం, అవగాహన కుదిరింది కాబట్టే తెలంగాణలో ఎన్ని అవినీతి, అక్రమాలకు పాల్పడ్డా ఎవరి మీదా చర్యలు తీసుకునే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 26 నెలల్లో మున్సిపాలిటీలకు ఎన్ని నిధులు విడుదల చేశారో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 

బీజేపీ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఓ ఫంక్షన్‌ హాల్‌లో ‘సేవ్‌ తెలంగాణ–సపోర్ట్‌ బీజేపీ’ కార్యక్రమంలో భాగంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా ఎంఐఎం కనుసన్నల్లో నడుస్తున్న బానిస ప్రభుత్వాల పాలన తెలంగాణలో కొనసాగుతోందని ఆరోపించారు. ముస్లిం ఓట్లు, ఎంఐఎం మద్దతుకోసం దారుసలాం, ఒవైసీ బ్రదర్స్‌కు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారన్నారు. కాంగ్రెస్‌ది కూడా ప్రజా ప్రభుత్వం కాదని మజ్లిస్‌ కనుసన్నల్లో మెదిలే బానిస ప్రభుత్వమని మండిపడ్డారు. 

మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చడంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పోటీపడు తున్నా యన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రెండేళ్లుగా హడావుడి చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, చివరకు తీసుకున్న ఏకైక చర్య ఏమిటంటే ఓ డీఎస్పీ స్థాయి అధికారిని సీఐగా డిమోట్‌ చేయడమేనన్నారు. ఈ 26 నెలల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్లు, దర్యాప్తుల పేరుతో సీరియల్స్‌ కొనసాగి ంచినప్పటికీ, సాధించిన ‘గొప్ప విజయం’ఇదొక్కటేనని ఎద్దేవా చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement