గోనెసంచిలో కాకులు | Local residents caught two young men who were transporting crows on a motorcycle | Sakshi
Sakshi News home page

గోనెసంచిలో కాకులు

Feb 6 2026 4:32 AM | Updated on Feb 6 2026 4:32 AM

Local residents caught two young men who were transporting crows on a motorcycle

అనుమానంతో అడ్డుకున్న గ్రామస్తులు 

పిల్లలకు దిష్టి తీయడానికి తీసుకెళ్తున్నామన్న యువకులు

యాలాల: కాకులను పట్టుకొని ద్విచక్రవాహనంపై తరలిస్తున్న ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకున్నారు. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా యాలల మండలం ముద్దాయిపేటలో గురువా రం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ముర్గీచౌక్, ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన రహమత్, అమీర్‌ బాగాయిపల్లి సమీపంలో పట్టుకున్న సుమారు యాభై కాకులను గోనెసంచిలో వేసుకుని స్కూటీపై ముద్దాయి పేటకు వచ్చారు. ఇది గమనించిన గ్రామస్తులు వీరిని అడ్డగించి, వివరాలు అడిగారు. 

తాము హైదరాబాద్‌కు చెందినవారమని, గత మూడు నెలలుగా పరిగి, కొడంగల్, మహబూబ్‌నగర్, కమాల్‌పూర్, బాగాయిపల్లి తదితర ప్రాంతాల్లో కాకులు పట్టుకుని తీసుకెళ్తున్నామని చెప్పారు. వీరి మాటలకు ఆశ్చర్యపోయిన స్థానికులు అనుమానంతో యాలాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి యువకులను పీఎస్‌కు తరలించారు. 

ఈ విషయమై ఎస్‌ఐ విఠల్‌రెడ్డిని వివరణ కోరగా.. కాకులను పట్టుకెళ్తున్న యువకులు వీటిని నగరంలో విక్రయిస్తున్నారని, చిన్నపిల్లలకు దిష్టి తగిలితే కుటుంబ సభ్యులు కాకిని కొనుక్కెళ్లి వారిపైనుంచి తిప్పి వదిలేస్తారని విచారణలో చెప్పారన్నారు. యువకులు పట్టుకున్న కాకులను అటవీ శాఖ అధికారుల సమక్షంలో వదిలిపెట్టినట్లు తెలిపారు. 

అనంతరం ఇద్దరినీ స్థానిక తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేసి పంపించామన్నారు. కాకులను తీసుకెళ్లి దిష్టి తీసేందుకే వినియోగిస్తున్నారా? మరో కోణం ఏదైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement