17, 18 తేదీల్లో బయో ఏషియా సదస్సు | BioAsia Conference on 17th and 18th | Sakshi
Sakshi News home page

17, 18 తేదీల్లో బయో ఏషియా సదస్సు

Feb 6 2026 4:34 AM | Updated on Feb 6 2026 4:34 AM

BioAsia Conference on 17th and 18th

హెచ్‌ఐసీసీలో నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

సదస్సును ప్రారంభించనున్న సీఎం రేవంత్, హాజరుకానున్న కేంద్రమంత్రులు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బయో ఏషియా సదస్సు–2026కు హైదరాబాద్‌ ముస్తాబవుతోంది. ఈ నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్లోబల్‌ లైఫ్‌ సైన్సెస్, హెల్త్‌కేర్‌ సదస్సుగా దీనికి గుర్తింపు ఉంది. ఈ సదస్సును సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు. 

‘టెక్‌బయో అన్‌లీష్డ్‌ ఏఐ, ఆటోమేషన్‌– బయాలజీ రివల్యూషన్‌’’అనే థీమ్‌తో ఈ సదస్సు జరగనుంది. గ్లోబల్‌ లైఫ్‌సైన్సెస్, హెల్త్‌కేర్‌ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, ఆలోచనలకు ఈ సదస్సు వేదిక కానుంది. ప్రపంచవ్యాప్తంగా బయోటెక్నాలజీ, ఔషధాలు, హెల్త్‌ రంగాలకు చెందిన నిపుణులు, 50 దేశాలకు చెందిన 3 వేల మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన సంస్థల అధిపతులు, సీఈఓలు, ప్రతినిధులు, సంబంధిత రంగాల్లో నిపుణులు, ఆవిష్కర్తలు ఈ వేదికపై జరిగే చర్చలు, సమావేశాల్లో పాలుపంచుకుంటారు. 

ఈ సదస్సులో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాకు చెందిన కేన్సర్‌ జీన్‌ థెరపీ నిపుణులు ప్రొఫెసర్‌ బ్రూస్‌ ఎల్‌. లెవిన్, అమ్జెన్‌ సంస్థ సీఎస్‌ఓ డా.హోవర్డ్‌ వై.చాంగ్, జర్మనీకి చెందిన మిల్టెనీ బయోటెక్‌ వ్యవస్థాపకులు డా.స్టెఫాన్‌ మిల్టెనీ, సానోఫీ సంస్థ ఈవీపీ మాడలీన్‌ రోచ్‌ వంటి ప్రముఖులు మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్, అశ్విని వైష్ణవ్‌ కూడా హాజరుకాను న్నట్టు అధికారులు చెబుతున్నారు. 

భారత ప్రభుత్వ ప్రధాన సలహాదారు(సైన్స్‌) ప్రొఫెసర్‌ అజయ్‌కుమార్‌ సూద్, డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా డా.రాజీవ్‌సింగ్‌ రఘువంశీ ఈ బయో ఏషియాలో ప్రసంగించనున్నారు. ‘ఫార్మా–బయోటెక్‌ భవిష్యత్‌’అంశంపై ఒక ప్రత్యేక కాన్‌క్లేవ్‌ నిర్వహించనుండగా, అందులో డాక్టర్‌ రెడ్డీస్, జైడస్, బయోకాన్, సిప్లా వంటి భారతీయ ప్రముఖ సంస్థల సీఈఓలు పాల్గొంటారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement