కార్యక్షేత్రంలోకి కాంగ్రెస్‌ | TPCC has appointed observers for each municipality and corporation | Sakshi
Sakshi News home page

కార్యక్షేత్రంలోకి కాంగ్రెస్‌

Feb 6 2026 4:49 AM | Updated on Feb 6 2026 4:49 AM

TPCC has appointed observers for each municipality and corporation

మున్సిపాలిటీలు,కార్పొరేషన్ల వారీగా పరిశీలకులను నియమించిన టీపీసీసీ

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల బరిలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది. ఇప్పటికే రాష్ట్ర మంత్రులకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పజెప్పిన కాంగ్రెస్‌ పార్టీ ఆ తర్వాత స్క్రీనింగ్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తుల బుజ్జగింపు, రెబల్స్‌ ఉపసంహరణ లాంటి కార్యక్రమాలను స్క్రీనింగ్‌ కమిటీల సాయంతో పూర్తిచేసిన అధికార పార్టీ ఇప్పుడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా పరిశీలకులను నియమించింది. 

స్థానిక పరిస్థితులు, అవసరాలను బట్టి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ఒకరి నుంచి నలుగురిని పరిశీలకులుగా నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా 140మందితో కూడిన పరిశీలకుల జాబితాను విడుదల చేశారు. ఈ పరిశీలకుల జాబితాలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, రాష్ట్ర పార్టీ నాయకులు ఉన్నారు. 

ముఖ్యంగా నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అక్కడ ఏకంగా నలుగురు పరిశీలకులను నియమించింది. ఇందులో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి కూడా స్థానం లభించడం విశేషం. గాం«దీతో పాటు సీనియర్‌ నేత జీవన్‌రెడ్డిని కూడా నిజామాబాద్‌కు పంపాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. 

అదేవిధంగా కొత్తగూడెంకు ముగ్గురు పరిశీలకులను నియమించగా, నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిశీలకుడిగా పార్టీ సీనియర్‌ నేత ఎం.ఆర్‌.జీ వినోద్‌రెడ్డిని నియమించింది. వీరంతా వెంటనే కార్య క్షేత్రంలోకి వెళ్తారని, వార్డుల వారీగా ఎన్నికల ప్రచారం గెలుపు వ్యూహాలపై అభ్యర్థులు, స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుంటారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. 

కాగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిశీలకులతో శుక్రవారం ఉదయం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌లు జూమ్‌ సమావేశం నిర్వహించనున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి వారితో చర్చిస్తారని, 90 శాతం స్థానాల్లో గెలుపే ధ్యేయంగా రూపొందించాల్సిన కార్యాచరణ గురించి ఈ సమావేశంలో మార్గదర్శనం చేస్తారని పీసీసీ వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement