సాక్షి, సంగారెడ్డి: పరిహారం విషయంలో రేవంత్ సర్కార్ మాట తప్పిందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన సిగాచి పరిశ్రమ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిగాచి ప్రమాదంలో 54 మంది చనిపోతే ఎవరూ పట్టించుకోలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దివాళా కోరు ప్రభుత్వం నడుస్తుందంటూ దుయ్యబట్టారు.
‘‘ఎన్నికల్లో ఇచ్చిన హమీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదు. పింఛన్లు సక్రమంగా ఇవ్వడం లేదు. కేసీఆర్ హయాలో తాగునీరు, విద్యుత్‌కు కొరతే లేదు. రేవంత్ రెడ్డి హయాంలో కరెంట్ కష్టాలు, నీటి యుద్ధాలు తప్పటం లేదు. కేసీఆర్ కంటే మంచిగా పనిచేసి పేరుతెచ్చుకుంటే.. రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లు నరకమే. కరోనా వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చినా ప్రజలను కాపాడుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉన్న సంక్షేమ పథకాలు బంద్ పెట్టడం తప్ప చేసిందేమిలేదు.’’ అని హరీష్‌రావు మండిపడ్డారు.
‘‘సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన 54 మంది కార్మికులకు ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తానన్న రేవంత్.. కార్మికులను మోసం చేశాడు. ప్రజలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, బీజేపీలను నమ్మొద్దు’’ అంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.


