breaking news
Davanam Srikanth
-
విదేశాలకు వెళుతున్నారా.. ఈ జాగ్రత్తలు మీకోసమే
అంతర్జాతీయ ప్రయాణాలు చేసేటప్పుడు చాలామంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ జోన్‌కు రాగానే ఒక రకమైన ఆందోళనకు గురవుతుంటారు. కస్టమ్స్ అధికారులు కావాలనే కఠినంగా వ్యవహరిస్తారని లేదా కేవలం ఏదైనా వస్తువులు వ్యక్తిగత అవసరాల కోసం అని చెబితే సరిపోతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ, వాస్తవం దీనికి భిన్నంగా ఉంటుంది. కస్టమ్స్ చట్టాలు ప్రయాణికులను ఇబ్బంది పెట్టడానికి కాదనే విషయం గుర్తుంచుకోవాలి. అక్రమ రవాణాను అరికట్టడానికి, దేశ ఆర్థిక ఆదాయాన్ని కాపాడటానికి నిర్దేశించబడ్డాయి. లేటెస్ట్ అధికారిక సమాచారం ప్రకారం అంతర్జాతీయ ప్రయాణికులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు కింద ఉన్నాయి.కస్టమ్స్ నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి?ముందుగా ఒక ప్రాథమిక విషయాన్ని గమనించాలి. కస్టమ్స్ నిబంధనలు కేవలం అంతర్జాతీయ ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తాయి. మీరు భారతదేశం లోపల (డొమెస్టిక్) ప్రయాణిస్తుంటే కేవలం విమానయాన సంస్థల బ్యాగేజీ పరిమితులు మాత్రమే ఉంటాయి తప్ప కస్టమ్స్ డిక్లరేషన్ అవసరం ఉండదు.విదేశీ నివాస కాలం కీలకంమీరు విదేశాల్లో ఎంతకాలం గడిపారు అనే అంశంపైనే మీ బ్యాగేజీ మినహాయింపులు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా బంగారం వంటి వస్తువుల విషయంలో ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం విదేశాల్లో ఉన్నవారికి మాత్రమే ప్రత్యేక రాయితీలు వర్తిస్తాయి. స్వల్పకాలిక పర్యాటకులు, దీర్ఘకాలిక ఉద్యోగులు లేదా ఎన్ఆర్ఐ కేటగిరీని బట్టి అధికారులు నిబంధనలను పరిశీలిస్తారు.బంగారం నిబంధనలుభారతీయ విమానశ్రయాల్లో బంగారం అత్యంత సున్నితమైన అంశం. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. పురుషులు ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం విదేశాల్లో ఉంటే 20 గ్రాముల(గరిష్ట విలువ రూ.50,000) బంగారు ఆభరణాలను, మహిళలు ఏడాది కంటే ఎక్కువ కాలం విదేశాల్లో ఉంటే 40 గ్రాముల(గరిష్ట విలువ రూ.1,00,000) బంగారు ఆభరణాలను తీసుకురావచ్చు. ఇక్కడ బరువు, విలువ రెండూ పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో 20 గ్రాముల బంగారం విలువ రూ.50,000 దాటింది కాబట్టి ఆ పైన ఉన్న విలువకు ప్రయాణికులు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది.గోల్డ్ బార్లు.. కాయిన్స్ఆభరణాలకు ఇచ్చే మినహాయింపులు గోల్డ్ బార్లు లేదా నాణేలకు వర్తించవు. వీటిని వాణిజ్య పరమైనవిగా పరిగణిస్తారు కాబట్టి, వీటిపై పూర్తి స్థాయిలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వీటిని డిక్లేర్ చేయకుండా తీసుకురావడం చట్టరీత్యా నేరం.మద్యం, నగదు పరిమితులువిదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు గరిష్టంగా రెండు లీటర్ల మద్యం లేదా వైన్ మాత్రమే తీసుకురావడానికి అనుమతి ఉంది. ఈ పరిమితి దాటితే వాటిని జప్తు చేసే అవకాశం ఉంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం, ప్రయాణికులు తమ వద్ద గరిష్టంగా రూ.25,000 వరకు నగదును ఉంచుకోవచ్చు. విదేశీ కరెన్సీని తీసుకురావడానికి గరిష్ట పరిమితి లేదు. కానీనగదు రూపంలో 5,000 అమెరికన్ డాలర్లు దాటినా, మొత్తం విదేశీ ఎక్స్ఛేంజ్ (నగదు + ట్రావెలర్స్ చెక్కులు) 10,000 డాలర్లు దాటినా కచ్చితంగా డిక్లేర్ చేయాలి.‘పర్సనల్ యూజ్’ అంటే ఏమిటి?కస్టమ్స్ క్లియరెన్స్‌లో ప్రయాణికులు తీసుకొస్తున్న వస్తువుల గురించి అధికారులు అడిగినప్పుడు సింపుల్‌గా పర్సనల్ యూజ్ అంటారు. కేవలం ప్రయాణికులు చెప్పిన మాటపై అధికారులు నమ్మకం ఉంచరు. వస్తువుల సంఖ్య, అవి కొత్తవా లేదా వాడినవా, ప్యాకింగ్ ఎలా ఉంది, మీరు తరచుగా ప్రయాణాలు చేస్తున్నారా అనే అంశాలను బట్టి అది వ్యక్తిగత అవసరమా లేక వాణిజ్య అవసరమా అని నిర్ణయిస్తారు. ఉదాహరణకు, ఒకటి రెండు వాడిన మొబైల్ ఫోన్లు వ్యక్తిగతమైనవిగా పరిగణిస్తారు. కానీ డజన్ల కొద్దీ సీల్ చేసిన కొత్త ఫోన్లు ఉంటే అది వాణిజ్య ఉద్దేశంగానే చూస్తారు.సురక్షిత ప్రయాణం కోసం సూచనలుకస్టమ్స్ నిబంధనలు ఉల్లంఘిస్తే 10% నుంచి 100% వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్నిసార్లు జైలు శిక్ష కూడా తప్పకపోవచ్చు. మీ వద్ద ఉన్న వస్తువులపై ఏమాత్రం సందేహం ఉన్నా ఎయిర్‌పోర్ట్‌లోని రెడ్ ఛానల్(కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన వస్తువులు ఉన్న ప్రయాణికుల కోసం ఉద్దేశించింది) వద్దకు వెళ్లి అధికారులను సంప్రదించాలి. నిజాయితీగా డిక్లేర్ చేయడం వల్ల మీరు అనవసరపు ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. గ్రీన్ ఛానల్(కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన వస్తువులు ఏవీ లేవని భావించే ప్రయాణికుల కోసం ఉద్దేశించింది) ద్వారా దొంగచాటుగా వెళ్లడం వల్ల కలిగే రిస్క్ చాలా ఎక్కువ.-దవనం శ్రీకాంత్ -
జీఎస్టీ అంటే భయమేలా?
దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి వచ్చి ఏడేళ్లు దాటినా సామాన్య పన్ను చెల్లింపుదారులు, చిరు వ్యాపారుల్లో దీనిపై నెలకొన్న ఆందోళనలు తగ్గడం లేదు. జీఎస్టీ అంటే కేవలం పన్ను విధానం మాత్రమే కాదు, అది ఒక క్లిష్టమైన సవాల్ అనే భావన బలంగా నాటుకుపోయింది. నిజాయితీగా వ్యాపారం చేసే వారు కూడా నోటీసులు వస్తాయేమోనని భయపడే పరిస్థితి ఎందుకు ఉంది? ప్రభుత్వం నుంచి అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం అసలు వాస్తవాలేంటో ఇక్కడ చూద్దాం.జీఎస్టీ ఎందుకు భారంగా అనిపిస్తోంది?చాలా మంది వ్యాపారులు జీఎస్టీ వ్యవస్థను తమకు సహకరించే వ్యవస్థగా కాకుండా కేవలం పన్ను వసూలు చేసే యంత్రాంగంగా మాత్రమే చూస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు..ఆదాయపన్ను రిటర్న్ దాఖలులో చిన్న పొరపాటు జరిగినా లేదా ఆలస్యమైనా ఏటా 18% వడ్డీ భారం పడుతుంది. ఇది చిన్న వ్యాపారుల లాభాలను దెబ్బతీస్తోంది.కొనుగోలుదారు, విక్రేత ఇచ్చే లెక్కల్లో స్వల్ప తేడాలున్నా (జీఎస్టీఆర్-2బీ vs 3బీ) సిస్టమ్ వెంటనే అప్రమత్తం చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతోంది.క్షేత్రస్థాయిలో తప్పులు జరిగినప్పుడు సరిదిద్దే మార్గాల కంటే శిక్షించే నిబంధనలే ఎక్కువగా ప్రచారంలో ఉండటం భయానికి కారణం.నోటీసు అంటే భయపడాలా?వ్యాపారులకు జీఎస్టీ నోటీసు అందగానే అదొక క్రిమినల్ కేసులా భావిస్తుంటారు. అధిక శాతం నోటీసులు అధికారులు స్వయంగా పంపేవి కావు. సాఫ్ట్వేర్ ద్వారా డేటాలో తేడాలను గుర్తించి జారీ అయ్యే స్క్రూటినీ నోటీసులు ఎక్కువగా ఉంటాయి. నోటీసు అంటే కేవలం వివరణ కోరడం మాత్రమే. సరైన ఆధారాలు చూపిస్తే చాలా వరకు సమస్యలు అక్కడితోనే ముగుస్తాయి. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల ప్రకారం.. జీఎస్టీ ప్రారంభ దశలో (2017-19) జరిగిన చిన్న పొరపాట్లకు వడ్డీ, జరిమానాల నుంచి మినహాయింపులు కూడా ఇచ్చారు.జీఎస్టీ చట్టం కింద విధించే జరిమానాల విషయంలో పన్ను చెల్లింపుదారులు అనవసర ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే చట్టం పొరపాట్లకు, మోసాలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపిస్తుంది. సాధారణంగా ఉద్దేశపూర్వకంగా కాకుండా అవగాహన లోపం వల్ల జరిగే సాధారణ తప్పుల విషయంలో శిక్షలు తక్కువగా ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో పన్ను మొత్తంలో 10 శాతం లేదా రూ.10,000.. వీటిలో ఏది ఎక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని జరిమానాగా విధిస్తారు. ఇది కేవలం పన్ను చెల్లింపుదారుడిని క్రమశిక్షణలో ఉంచడానికి ఉద్దేశించిన చర్య మాత్రమే.అయితే, పన్నును ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టాలని చూసినా లేదా తప్పుడు లెక్కలతో వ్యవస్థను మోసం చేయాలని ప్రయత్నించినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అటువంటి సందర్భాల్లో పన్ను మొత్తంలో 100 శాతం వరకు, అంటే పన్నుకు సమానమైన మొత్తాన్ని జరిమానాగా విధించే అధికారం ఉంటుంది. దీనివల్ల నిజాయితీగా ఉండే వ్యాపారులకు రక్షణ కలుగుతుండగా, అక్రమాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరిక అందుతుంది.చాలా మందిలో ఉన్న మరొక ప్రధాన అపోహ ఏమిటంటే.. అధికారులు విధించిన జరిమానాపై అప్పీల్‌కు వెళ్తే అది మరింత పెరుగుతుందని భయపడుతుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. పన్ను చెల్లింపుదారుడి వద్ద సరైన ఆధారాలు ఉండి, చట్టబద్ధంగా వారి వాదన బలంగా ఉంటే అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ద్వారా ఉపశమనం పొందే హక్కు వారికి ఉంటుంది. కాబట్టి చట్టంపై సరైన అవగాహన కలిగి ఉండటం వల్ల ఇటువంటి అపోహల నుంచి బయటపడవచ్చు.తెర వెనుక ఏం జరుగుతుంది?జీఎస్టీ వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా డేటా అనలిటిక్స్ ఆధారంగా నడుస్తోంది. ఒక వ్యాపారి నిరంతరం తప్పుడు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్ చేస్తున్నా లేదా పదే పదే రిటర్న్‌లు ఎగ్గొడుతున్నా వారిని మాత్రమే వ్యవస్థ హై రిస్క్ కేటగిరీలో ఉంచుతుంది. అధికారుల జోక్యం తగ్గించేందుకు ‘ఫేస్‌లెస్ అసెస్మెంట్’(పన్ను చెల్లింపుదారుడు, పన్ను అధికారి ప్రత్యక్షంగా ముఖాముఖి కలవాల్సిన అవసరం లేకుండానే పన్ను మదింపు ప్రక్రియను పూర్తి చేసే ఒక ఆధునిక విధానం) వంటి విధానాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.అవగాహనే రక్షణజీఎస్టీ అనేది చట్టం కంటే దానిపై సమాచార లోపం వల్లే ఎక్కువగా క్లిష్టంగా కనిపిస్తోంది. సకాలంలో రిటర్న్‌లు దాఖలు చేయడం, నోటీసులకు వెంటనే స్పందించడం, నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా చాలా సమస్యలను నివారించవచ్చు. వ్యవస్థ వృద్ధి చెందుతున్న కొద్దీ నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.- దవనం శ్రీకాంత్


