భారతదేశంలో నిపా వైరస్ ఉనికి కలకలం రేపుతోంది. పశ్చిమ బెంగాల్‌లో ఐదు నిపా కేసులు నిర్ధారించారు. దాదాపు 100 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. తాజా వ్యాప్తితో ఆసియాలోని కొన్ని ప్రాంతాల విమానాశ్రయాల్లో నిబంధనలను కట్టుదిట్టం చేశారు. కోవిడ్ తరహా ఆరోగ్య తనిఖీలను ముమ్మరం చేశాయి.
పశ్చిమ బెంగాల్‌లో ఒక ఆసుపత్రిలో వైరస్ గుర్తించారు. అదే జిల్లాకు చెందిన ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో రెండు కేసులు నమోదైనాయి. నర్సు, మరొ ఆసుపత్రి ఉద్యోగికి కూడా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. మొత్తం 5 కేసులను నిర్ధారించారు. దాదాపు 100 మంది హోమ్ క్వారంటైన్‌లో ఉంచారు. ఈ రోగులు కోల్‌కతా,చుట్టుపక్కల ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఒక రోగి పరిస్థితి విషమంగా ఉంది.
పశ్చిమ బెంగాల్‌లో ఒక వ్యక్తి తెలియని వ్యాధితో మరణించడం, మరో ఐదుగురు ఈ వైరస్ బారిన పడటంతో ఇది వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ,ఈ వైరస్ బారిన పడ్డ మరో 100- 200 మందిని పరిశీలిస్తున్నామని ఎయిమ్స్ బిలాస్‌పూర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్ర కుమార్ అరోరా మీడియాకు తెలిపారు.
ఈ నేపథ్యంలో అనేక ఆసియా దేశాల విమానాశ్రయాలు ఆరోగ్య పరీక్షలను కఠినతరం చేశాయి. థాయిలాండ్, నేపాల్, తైవాన్‌తో సహా అనేక ఆసియా దేశాలు పశ్చిమ బెంగాల్ నుండి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లలో ఆరోగ్య స్క్రీనింగ్‌లను ముమ్మరం చేశాయి. మరోవైపు చైనీస్ న్యూఇయర్ సీజన్‌కు ముందు నిపా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన పుట్టిస్తోంది.
నిపా వైరస్
ఈ వైరస్ గబ్బిలాలు (ప్టెరోపస్ జాతి),పందులు వంటి జంతువుల నుండి మానవులకు వ్యాపిస్తుంది. కొన్ని సందర్భాల్లో, ప్రజల నుంచి ప్రజలకు సామాజికసంబంధాల ద్వారా వ్యాపిస్తుంది.
నిపా వైరస్ (NiV) అత్యంత అంటువ్యాధి. ప్రాణాంతకం కూడా. ఈ వైరస్ కేసు మరణాల రేటు 40–75శాతం ఉంటుంది. జ్వరం, తలనొప్పి, శ్వాసకోశ సమస్యలు, తీవ్రమైన సందర్భాల్లో మెదడు వాపు, మూర్ఛలు , కోమా వంటి లక్షణాలు ఉంటాయి. ప్రారంభ సంకేతాలు నిర్దిష్టంగా ఉండవు, గుర్తించడం కష్టమే.
జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు నొప్పి శ్వాసకోశ ఇబ్బంది లేదా విలక్షణమైన న్యుమోనియా లాంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి.
ఇదీ చదవండి: ఏడాదికి రూ. 39 కోట్లు : ఈ బిజినెస్ గురించి తెలుసా?
ఇంక్యుబేషన్ వ్యవధి 4 నుండి 14 రోజుల వరకు ఉంటుంది.కొన్ని సందర్భాల్లో, 45 రోజుల వరకు ఉంటుంది. ప్రాణాలతో బయటపడినవారు మూర్ఛ లేదా వ్యక్తిత్వ మార్పులు వంటి దీర్ఘకాలిక నాడీ సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు.
నివారణ ఎలా
క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, పరిశుభ్రత పాటించడం. సెల్స్ ఐసోలేషన్, మాస్క్ ధరించడం ద్వారా మానవుని నుండి మానవునికి వ్యాప్తిని తగ్గించగలగాలి.
పండ్ల గబ్బిలాలు, అనారోగ్య పందులు లేదా కలుషితమైన ఆహారానికి దూరంగా ఉండాలి.
ఖర్జూర రసాన్ని మరిగించి పండ్లను పూర్తిగా కడగాలి; దెబ్బతిన్న పండ్లను పారవేయాలి.
జంతువులు, వ్యాధిసోకిన వ్యక్తులకు దూరంగా ఉండాలి
అనుమానిత లక్షణాల కనిపిస్తే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ, తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి.
భారతదేశంలో పశ్చిమ బెంగాల్, కేరళలో రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా నమోదైంది. ప్రతి సంవత్సరం మే నుండి సెప్టెంబర్ వరకు ఉండే పండ్ల గబ్బిలాల సంతానోత్పత్తి కాలంలోనే ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందని భావిస్తున్నారు. గబ్బిలాల మేటింగ్ పీరియడ్ కారణంగా జూనోటిక్ ఇన్ఫెక్షన్ వ్యాప్తికి కేరళ ఆరోగ్య శాఖ కోజికోడ్, మలప్పురం, కన్నూర్, వయనాడ్, ఎర్నాకులం అనే ఐదు జిల్లాల్లో అవగాహన కల్పిస్తోంది.
ఇదీ చదవండి: యాక్సిడెంట్ కాదు.. డాష్‌బోర్డ్ కెమెరా షాకింగ్ విజువల్స్


