టెన్త్‌ పాసైన వారికి మమతా బెనర్జీ గుడ్‌ న్యూస్‌ | Unemployed Class 10 Passouts In Bengal To Get Rs 1500 Allowance | Sakshi
Sakshi News home page

టెన్త్‌ పాసైన వారికి మమతా బెనర్జీ గుడ్‌ న్యూస్‌

Mar 7 2026 4:34 PM | Updated on Mar 7 2026 5:07 PM

Unemployed Class 10 Passouts In Bengal To Get Rs 1500 Allowance

కోల్‌కాతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరుద్యోగ యువతకు తీపి కబురు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పదో తరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు నెలకు రూ.1500 ఇస్తామని ప్రకటించారు. నేటి నుంచే( మార్చి 7, శనివారం) ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు. ‘యువ సాథీ’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ కొత్త పథకం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని.. 21-40ఏళ్ల వారు ఈ పథకానికి అర్హులుగా మమతా బెనర్జీ తెలిపారు. కేవలం స్కాలర్‌షిప్‌లు తప్ప ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందని వారు మాత్రమే దీనికి అర్హులన్నారు.

వాస్తవానికి ఏప్రిల్ 1 నుండి ప్రారంభం ఈ పథకం ప్రారంభం కావాల్సిఉందని.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) కానుకగా ఒక రోజు ముందుగానే ఇవాళ నుంచి (మార్చి7) నుంచే అమలు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఓటరు జాబితా సర్‌(స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌)తో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగించడాన్ని నిరసిస్తూ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో మమతా బెనర్జీ ఈ ప్రకటన చేశారు.

కాగా, సీఎం తన ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక గణాంకాలను వెల్లడించారు. బెంగాల్‌లో నిరుద్యోగిత రేటు 40 శాతం తగ్గిందని ఆమె పేర్కొన్నారు. 'ఉత్కర్ష బంగ్లా' ద్వారా 40 లక్షల మందికి శిక్షణ ఇవ్వగా.. అందులో 10 లక్షల మందికి ఉపాధి లభించిందని మమతా తెలిపారు.

బెంగాల్ చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో (MSME) దేశంలోనే నంబర్ వన్‌గా ఉందని.. దాదాపు 1.5 కోట్ల మంది ఈ రంగంలో పని చేస్తున్నారని వివరించారు. బెంగళూరు కంటే బెంగాల్‌లోనే ఐటీ రంగంలో ఎక్కువ మందికి ఉపాధి లభిస్తోందంటూ ఆమె వ్యాఖ్యానించారు. రైతులకు నెలకు రూ.10,000 ఇస్తున్నామని, భూమి లేని రైతులకు కూడా రూ. నాలుగు వేలు సహాయం అందిస్తున్నామని తెలిపారు. బీర్భూమ్ జిల్లాలోని దేవుచా పచామి బొగ్గు గనుల ద్వారా లక్ష మందికి ఉపాధి లభిస్తుందని.. రాబోయే 100 ఏళ్ల వరకు రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని మమతా ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement