ఏఐతో ఐటీకి ఇబ్బందే... | IT industry in for a painful transformation: HCLTech CEO Vijayakumar | Sakshi
Sakshi News home page

ఏఐతో ఐటీకి ఇబ్బందే...

Feb 25 2026 2:42 AM | Updated on Feb 25 2026 9:24 AM

IT industry in for a painful transformation: HCLTech CEO Vijayakumar

మార్పు ప్రక్రియ బాధాకరమే 

కానీ కంపెనీలు రూపాంతరం చెందక తప్పదు 

హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఈవో విజయకుమార్‌

ముంబై: పెద్ద సంఖ్యలో ఉద్యోగులతో ముడిపడి ఉన్నందున కృత్రిమ మేధకు (ఏఐ) మారడం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పరిశ్రమకు బాధాకరమైన ప్రక్రియగానే ఉంటుందని హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఈవో విజయకుమార్‌ చెప్పారు. అయితే, గతంలో వై2కే సవాళ్లు వచ్చినప్పుడు దీటుగా ఎదుర్కొన్నట్లుగానే, పరిశ్రమ తిరిగి తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇందుకు కావాల్సిన సామర్థ్యాలు పరిశ్రమకు ఉన్నాయని పేర్కొన్నారు. ఐటీ షేర్ల విషయంలో ఇన్వెస్టర్లు మరీ ఎక్కువగా ఆందోళన చెందుతున్నారన్నారు.

ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ నిర్వహించిన టెక్నాలజీ అండ్‌ లీడర్‌షిప్‌ ఫోరం సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ఏఐ మోడల్స్‌ రాకతో భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా పలు టెక్‌ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో కుమార్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం దేశీ ఐటీ రంగం కీలక దశలో ఉందని, వచ్చే 5–10 ఏళ్లలో పరిశ్రమ సరికొత్తగా రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కోడింగ్‌ విషయంలో ఆంథ్రోపిక్‌ క్లాడ్‌ అత్యద్భుతంగా పని చేసినప్పటికీ, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌లో కోడింగ్‌ వాటా 30 శాతమే ఉంటుంది కాబట్టి పరిశ్రమలో అవకాశాలు మెరుగ్గానే ఉండొచ్చన్నారు.  

ప్రత్యేక నైపుణ్యాలకు డిమాండ్‌ 
రాబోయే రోజుల్లో ప్రత్యేక నైపుణ్యాలకు డిమాండ్‌ పెరుగుతుందని, దానికి తగ్గట్లుగా ఉద్యోగులు, ఉద్యోగార్థులు సామర్థ్యాలను పెంచుకోవాల్సి ఉంటుందని కుమార్‌ చెప్పారు.  క్లయింట్లకు భారీగా బిల్లింగ్‌ వేస్తూ, గణనీయంగా వృద్ధి చెందిన సాస్‌ (సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఎ సర్వీస్‌) కంపెనీలకు, ఇకపై అదే స్థాయిలో చార్జీలు విధించడం సాధ్యపడదు కాబట్టి అవి సవాళ్లు ఎదుర్కొనాల్సి రావొచ్చని పేర్కొన్నారు. పెట్టుబడులకు తగ్గ స్థాయిలో ఆదాయాలు వచ్చే అవకాశాలు లేనందున విస్తృత స్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంపై భారీగా ఇన్వెస్ట్‌ చేసిన సంస్థలకు సమస్యలు ఎదురుకావొచ్చన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement