హైబ్రిడ్ వర్క్ మోడల్‌లో పనిచేస్తున్న తమ ఉద్యోగుల విద్యుత్ వినియోగాన్ని అంచనా వేసే ప్రయత్నాల్లో భాగంగా, ఇన్ఫోసిస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులను వారి ఇంటి విద్యుత్ వినియోగ వివరాలను పంచుకోవాలని కోరుతోంది. ఈ మేరకు ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘరాజ్కా నుంచి ఉద్యోగులకు ఒక అంతర్గత ఈమెయిల్ వెళ్లింది.
అందులో కొన్ని నిమిషాల్లో పూర్తయ్యే విద్యుత్ వినియోగ సర్వేను పరిచయం చేసినట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఈ సర్వే హైబ్రిడ్ విధానంలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని, ఇంటి నుంచి పని చేసేటప్పుడు ఉపయోగించే పరికరాల వల్ల కలిగే పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేసేందుకే ఈ ప్రయత్నమని ఆ ఈమెయిల్‌లో పేర్కొన్నారు.
“హైబ్రిడ్ పని విధానం మన కార్యకలాపాల్లో భాగమవడంతో, మన పర్యావరణ ప్రభావం ఇక కేవలం క్యాంపస్‌లకే పరిమితం కాదు. అది ఉద్యోగుల ఇళ్ల వరకూ విస్తరించింది. ఇంటి నుంచి పని చేసే సమయంలో వినియోగించే విద్యుత్తు కూడా ఇన్ఫోసిస్ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలకు కారణమవుతుంది. మన నివేదికలను మరింత ఖచ్చితంగా రూపొందించేందుకు, ప్రస్తుత వర్క్ ఫ్రమ్ హోమ్ విద్యుత్ వినియోగంపై సరైన డేటా అవసరం” అని సంఘరాజ్కా వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది ఉద్యోగులున్న ఇన్ఫోసిస్‌లో, ఎక్కువ మంది హైబ్రిడ్ మోడల్‌లో పనిచేస్తున్నారు. ఈ విధానం ప్రకారం, ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు కార్యాలయానికి హాజరుకావాలి. గత 15 సంవత్సరాలుగా సంస్థ తన స్థిరత్వ ఫ్రేమ్‌వర్క్‌ను నిర్మించుకుంటూ వస్తూ, పర్యావరణ లక్ష్యాలను సాధించడంపై దృష్టి సారిస్తోంది.
పరికరాల వివరాలూ ఇవ్వాలి
ఈ సర్వేలో ఉద్యోగులను కేవలం విద్యుత్ వినియోగ వివరాలే కాకుండా, ఇంటి నుంచి పని చేసేటప్పుడు ఉపయోగించే కంప్యూటర్లు, లైటింగ్, ఎయిర్ కండిషనర్లు వంటి పరికరాల వివరాలు కూడా ఇవ్వాలని కోరుతోంది. అలాగే లైట్ల వాటేజీ, ఇంట్లో సౌర విద్యుత్ వినియోగం ఉందా లేదా వంటి అంశాలపై కూడా సమాచారం అందించాలని సూచించింది. ఇన్ఫోసిస్ తన ఉద్యోగులు ఇళ్లలో శక్తి సమర్థవంతమైన చర్యలను అనుసరించాలని ప్రోత్సహిస్తోంది.


