న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 17 శాతం జంప్‌చేసి రూ. 12,958 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 11,056 కోట్లు ఆర్జించింది.
ప్రీమియం ఆదాయం రూ. 1,06,891 కోట్ల నుంచి రూ. 1,25,613 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,01,994 కోట్ల నుంచి రూ. 2,33,984 కోట్లకు బలపడింది. నికర కమిషన్ చెల్లింపులు రూ. 5,966 కోట్ల నుంచి రూ. 6,011 కోట్లకు పెరిగాయి. తొలి ఏడాది ప్రీమియం(కొత్త బిజినెస్) రూ. 7,285 కోట్ల నుంచి రూ. 10,605 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో ఎల్‌ఐసీ షేరు బీఎస్‌ఈలో 0.7 శాతం బలపడి రూ. 840 వద్ద ముగిసింది.
ఈ త్రైమాసికంలో వ్యయ నియంత్రణ, పెట్టుబడి ఆదాయం మెరుగుపడటం, అలాగే కొత్త పాలసీల విక్రయాలు పెరగడం ఎల్‌ఐసీ పనితీరుకు ప్రధానంగా తోడయ్యాయి. పాలసీదారుల సంఖ్య పెరగడం, డిజిటల్ సేవల విస్తరణ, కస్టమర్ సర్వీస్ మెరుగుదల వంటి చర్యలు సంస్థకు దీర్ఘకాల వృద్ధికి బలమివ్వనున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాబోయే త్రైమాసికాల్లోనూ స్థిరమైన వృద్ధి కొనసాగుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.


