టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), విప్రో అడుగుజాడల్లో నడుస్తూ మరో దేశీ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్.. తన వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) విధానాన్ని మరింత కఠినతరం చేసింది. అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులను కోరుకునే ఉద్యోగుల కోసం కొత్త షరతులను ప్రవేశపెట్టింది.
బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న ఇన్ఫోసిస్, ఇకపై ఒక్కో త్రైమాసికంలో గరిష్టంగా ఐదు అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు లేదా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ (WFO) మినహాయింపులకు మాత్రమే అనుమతి ఇస్తుంది. ఉద్యోగి లేదా అతనిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు సంబంధించిన క్లిష్టమైన వైద్య పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుంది. అలాంటి సందర్భాల్లో డాక్టర్ వెరిఫికేషన్‌తో పాటు అవసరమైన డాక్యుమెంట్లు తప్పనిసరిగా సమర్పించాలి.
ప్రస్తుతం జాబ్ లెవల్ 5, అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు కార్యాలయం నుంచి పని చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు, అదనంగా సహాయక వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు కోరే అభ్యర్థనలపై మరింత నియంత్రణకు ఉద్దేశించినవిగా కంపెనీ తెలిపింది.
ఉద్యోగులకు మేనేజర్లు పంపిన ఈమెయిల్స్ ప్రకారం.. అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆమోదం కోసం వచ్చే అభ్యర్థనల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అభ్యర్థన ఉంటే ఈమెయిల్ ద్వారా కాకుండా సిస్టమ్ ద్వారా ముందస్తు ఆమోదం పొందాలని స్పష్టం చేశారు. చివరి నిమిషంలో సమస్యలు తలెత్తకుండా ఉద్యోగులు ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. “పాలసీ ప్రకారం అభ్యర్థన ఆమోదించబడకపోతే, మేనేజర్లుగా తాము చేయగలిగేదేమీ లేదు” అని పేర్కొన్నారు.
ఇది చదివారా? ఉద్యోగుల కరెంటు బిల్లులు అడుగుతున్న ఇన్ఫోసిస్..
దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సంస్థగా ఉన్న ఇన్ఫోసిస్‌లో 3 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీ 2023 నవంబర్ 20న రిటర్న్-టు-ఆఫీస్ విధానాన్ని ప్రకటించినప్పటికీ, దాన్ని 2024 మార్చి 10 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయడం ప్రారంభించింది. ఈ విధానం ప్రకారం ఉద్యోగులు కార్యాలయంలో కనీసం మూడు గంటలు గడపాల్సి ఉంటుంది.


