జాబ్ స్ట్రెస్.. శత్రువే కాదు మిత్రుడు కూడా! | Udyoga Parvam Chapter 2: Psy Vishesh on Job Stress | Sakshi
Sakshi News home page

జాబ్ స్ట్రెస్.. శత్రువే కాదు మిత్రుడు కూడా!

Feb 1 2026 7:00 AM | Updated on Feb 1 2026 7:00 AM

Udyoga Parvam Chapter 2: Psy Vishesh on Job Stress

నేటి కార్పొరేట్ యుగంలో ’ఉద్యోగం’ అంటే కేవలం పని మాత్రమే కాదు, అదో నిరంతర యుద్ధం. ఉదయం అలారం మోగినప్పటి నుండి, ఆఫీసు డెడ్‌లైన్లు.. బాస్ నుంచి వచ్చే కాల్స్.. టార్గెట్లు.. పక్క సీటు సహోద్యోగితో పోటీ.. అర్ధరాత్రి బాస్ పంపే మెయిల్,,, అన్నీ కలిసి జాబ్ స్ట్రెస్. నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగిని ఉదయం నిద్ర లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు వెంటాడే భూతం ఇది.

అసలు ఈ ఒత్తిడి ఎందుకు వస్తుంది? ఇది ఎప్పుడూ మనకు శత్రువేనా? అంటే కాదనే అంటాను. అది మిత్రుడిలా మనల్ని ముందుకు నడిపించగలదు, శత్రువులా మనల్ని కుంగదీయగలదు. ఆ తేడాను గుర్తించడమే ’ఉద్యోగ పర్వం’లో మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం.

శాస్త్రీయంగా ఒత్తిడి రెండు రకాలు.. 

1.    యూస్ట్రెస్ (పాజిటివ్ ఒత్తిడి): ఒక ప్రజెంటేషన్ ఇచ్చే ముందు కలిగే చిన్నపాటి భయం, ఒక కొత్త బాధ్యత తీసుకున్నప్పుడు వచ్చే ఉత్సాహం. ఇది మనల్ని ఏకాగ్రతతో పనిచేసేలా చేస్తుంది. ఇది మనకు ’మిత్రుడు’.

2.    డిస్ట్రెస్ (నెగటివ్ ఒత్తిడి): పని భారం మితిమీరినప్పుడు, భవిష్యత్తుపై అభద్రతాభావం కలిగినప్పుడు వచ్చేది. ఇది మన ఆరోగ్యాన్ని, పనితీరును దెబ్బతీస్తుంది. ఇది మన ’శత్రువు’.

శత్రువుగా మారినప్పుడు సంకేతాలు..

ఒత్తిడి మీ నియంత్రణ తప్పుతోందని చెప్పడానికి మీ శరీరం కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది.

·    ఆఫీసు పేరు వింటేనే గుండెల్లో దడ మొదలవ్వడం.
·    ఆకలి మందగించడం లేదా ’స్ట్రెస్ ఈటింగ్’ (ఒత్తిడిలో ఎక్కువగా తినడం).
·    ఏకాగ్రత కుదరకపోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు.
·    చిన్న చిన్న విషయాలకే చిరాకు, కోపం రావడం
·    ఆఫీసు నుంచి ఇంటికి వచ్చినా పని గురించి ఆలోచిస్తూ కుటుంబానికి దూరం కావడం.
·    నిద్రలేమి, తలనొప్పి లేదా జీర్ణ సంబంధిత సమస్యలు
·    పని మీద ఆసక్తి తగ్గిపోవడం.

రాజేష్ ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో టీమ్ లీడర్. అద్భుతమైన పనితీరు ఉన్నప్పటికీ, గత ఆరు నెలలుగా అతను తీవ్రమైన మెడనొప్పి, నిద్రలేమితో బాధపడుతున్నాడు. ఆఫీసులో చిన్న విషయాలకే చిరాకు పడటం, ఇంటికి వెళ్ళాక పిల్లలతో సరిగ్గా గడపలేకపోవడం అతన్ని మానసిక వేదనకు గురిచేసింది. రాజేష్ తన టీమ్ చేసే ప్రతి చిన్న పనిని తానే పర్యవేక్షించాలనుకోవడం (Micromanagement ). ‘నేను లేకపోతే ప్రాజెక్ట్ ఆగిపోతుంది‘ అనే అపోహే అతని ఒత్తిడికి ప్రధాన కారణం. కౌన్సెలింగ్‌లో అతనికి ’డెలిగేషన్’ (పనిని ఇతరులకు అప్పగించడం), ’మైండ్‌ఫుల్‌నెస్’ టెక్నిక్స్ నేర్పించాం. మూడు నెలల తర్వాత, రాజేష్ ఇప్పుడు ప్రశాంతంగా ఉండటమే కాకుండా, అతని టీమ్ ఉత్పాదకత కూడా 30శాతం పెరిగింది.

ఒత్తిడిని మిత్రుడిగా మార్చుకోవడానికి 5 సూత్రాలు..

1. Circle of Control : మీరు మార్చగలిగే పనుల మీద (మీ పనితీరు, టైమ్ మేనేజ్‌మెంట్) దృష్టి పెట్టండి. మీరు మార్చలేని విషయాల గురించి (ఆర్థిక మాంద్యం, బాస్ మూడ్) చింతించడం మానేయండి.

2.  2 మినిట్ బ్రీతింగ్: ఒత్తిడి పెరిగినప్పుడు 2 నిమిషాల పాటు దీర్ఘ శ్వాస తీసుకోండి. ఇది మెదడులోని ’అమిగ్డాలా’ను శాంతపరిచి, తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

3.    డిజిటల్ డెటాక్స్: ఆఫీస్ సమయం ముగిశాక, కనీసం ఒక గంట పాటు ఫోన్‌ను పక్కన పెట్టండి. నోటిఫికేషన్ల మోత మీ మెదడును నిరంతరం అప్రమత్తంగా (Alert mode) ఉంచి ఒత్తిడిని పెంచుతుంది.

4.    శారీరక శ్రమ: కనీసం 20 నిమిషాల నడక మీ మెదడులో ’ఎండార్ఫిన్’లను విడుదల చేస్తుంది, ఇవి ఒత్తిడిని తగ్గించే సహజ సిద్ధమైన మందులు.

5.   Perfectionism వద్దు: అన్ని పనులూ 100శాతం పర్ఫెక్ట్‌గా ఉండాలనే పట్టుదల ఒత్తిడిని పెంచుతుంది. ’ఎక్సలెన్స్’ మీద దృష్టి పెట్టండి, పర్ఫెక్షన్ మీద కాదు.

మీ కోసం చిన్న పరీక్ష.. ఈ క్రింది ప్రశ్నలకు ’అవును’ లేదా ’కాదు’ అని సమాధానం చెప్పుకోండి:

·    ఆదివారం సాయంత్రం నుంచే మీకు ఆఫీసు గురించి ఆందోళన మొదలవుతోందా?
·    పని ఒత్తిడి వల్ల మీ వ్యక్తిగత సంబంధాలు లేదా ఆరోగ్యం దెబ్బతింటున్నాయా?
·    విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా మీరు అపరాధ భావన (Guilt) కి గురవుతున్నారా?

పై ప్రశ్నల్లో రెండింటికి ’అవును’ అనే సమాధానం వస్తే, మీరు మీ ఒత్తిడిని శత్రువుగా మార్చుకున్నారని అర్థం. ఒత్తిడిని జయించడం అంటే పనిని వదిలేయడం కాదు, పని చేసే విధానాన్ని మార్చుకోవడం. గుర్తుంచుకోండి. మీ కెరీర్ కంటే మీ ఆరోగ్యం.. మీ చిరునవ్వు చాలా విలువైంది.

సైకాలజిస్ట్ విశేష్
కెరీర్ – మైండ్‌సెట్ కోచ్
8019 000067
www.psyvisesh.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement