తప్పిన పెను ప్రమాదం | Air India Dreamliner Grounded After Fuel Switch Moves From Run To Cutoff Mode | Sakshi
Sakshi News home page

తప్పిన పెను ప్రమాదం

Feb 3 2026 5:01 AM | Updated on Feb 3 2026 5:01 AM

Air India Dreamliner Grounded After Fuel Switch Moves From Run To Cutoff Mode

లండన్‌–బెంగళూరు ఎయిరిండియా డ్రీమ్‌లైనర్‌లో ఆఫ్‌ అయిన ఇంధన స్విచ్‌

వరుసగా రెండుసార్లు విఫలమైన లాకింగ్‌ వ్యవస్థ

తనిఖీల సందర్భంగా బయటపడిన ఘోర వైఫల్యం

విమానంలో 200 మంది ప్రయాణికులు 

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని సెకన్లకే కుప్పకూలిన ఘోర ప్రమాదఘటనను మర్చిపోకముందే దాదాపు అలాంటి మరో ఘోర ప్రమాదం అదృష్టవశాత్తు తప్పిపోయింది. విమానంలోని ఇంధన నియంత్రణ స్విచ్‌ దానంతట అదే ఆన్‌ పొజిషన్‌ నుంచి కటాఫ్‌ పొజిషన్‌కు మారింది. ఇది విమానం ల్యాండయ్యాక జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అసలేం జరిగింది?
లండన్‌ హీత్రూ అంతర్జాతీయ విమా నాశ్రయం నుంచి ఆదివారం రాత్రి  ఎయిరిండియా డ్రీమ్‌ లైనర్‌ (బోయింగ్‌ 787–8) విమానం 200 మందికి పైగా ప్రయాణికులతో బెంగళూరు బయల్దేరింది. సోమ వారం ఉదయం 11.54 గంటలకు బెంగళూరు విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. ల్యాండయ్యాక సాధారణ తనిఖీల్లో భాగంగా విమానంలోని ఇంధన స్విచ్‌లను పైలట్లు సరి చూశారు. ఎడమవైపు స్విచ్‌ను ‘రన్‌’ పొజిషన్‌లోకి మార్చారు. ఫ్యూయల్‌ కంట్రోల్‌ లాకింగ్‌ సిస్టమ్‌ సరిగా ఉంటే స్విచ్‌ అలాగే ఉండాలి. కానీ అది హఠాత్తుగా పడిపోయి కటాఫ్‌ పొజిషన్‌లోకి మారింది. 

స్విచ్‌ను మళ్లీ ‘రన్‌’ పొజిషన్‌లోకి మార్చినా అది వెంటనే కటాఫ్‌లోకి పడిపోయింది. ఈ ఘోర వైఫల్యాన్ని పైలట్లు వెంటనే డీజీసీఏ దృష్టికి తీసుకెళ్లడం, వాళ్లు సాంకేతిక నిపుణులతో తనిఖీ చేయించడం చకచకా జరిగిపోయాయి. డ్రీమ్‌లైనర్‌ రకం విమానాలన్నింటినీ తనిఖీ చేశామని, ఎలాంటి స్విచ్‌ లోపాలూ కన్పించలేదని ఎయిరిండియా ఒక ప్రకటనలో పేర్కొంది. స్విచ్‌ లోపాలపై ఈ ఉపకరణాలను తయారుచేసిన ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మ్యాను ఫ్యాక్చరర్‌ (ఓఈఎం)కు సమాచారం ఇచ్చామని, వాళ్లు పైలట్ల నుంచి సమాచారం తీసుకున్నారని పేర్కొంది. ఘటనపై సమగ్రస్థాయిలో నివేదిక ఇవ్వాలని ఎయిరిండియాను డీజీసీఏ ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement