సభలో ‘చైనా’ రగడ! | Rahul Gandhi cites ex-army chief memoir on 2020 India-China conflict | Sakshi
Sakshi News home page

సభలో ‘చైనా’ రగడ!

Feb 3 2026 4:45 AM | Updated on Feb 3 2026 4:45 AM

Rahul Gandhi cites ex-army chief memoir on 2020 India-China conflict

మంత్రులు వర్సెస్‌ రాహుల్‌ 

ఆర్మీ మాజీ చీఫ్‌ నరవణె పుస్తకంపై వివాదం

దాని గురించి ప్రస్తావించిన రాహుల్‌ అనుమతించబోనన్న స్పీకర్‌ బిర్లా

రాహుల్‌కు విపక్ష సభ్యుల మద్దతు

అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ అభ్యంతరం

గందరగోళం, సభ నేటికి వాయిదా

న్యూఢిల్లీ: ‘చైనా రగడ’ సోమవారం లోక్‌సభను కుదిపేసింది. 2020 నాటి భారత్, చైనా ఘర్షణలకు సంబంధించి విపక్ష నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. వాటికి సంబంధించి ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె పుస్తకంలోని పలు అంశాలను రాహుల్‌ సభలో ప్రస్తావించడం కలకలం రేపింది. విపక్ష నేత వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు బీజేపీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. 

ప్రచురణ కాని పుస్తకంలోని అంశాలను ఉటంకించడాన్ని ఆక్షేపించారు.సభను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారంటూ దుయ్యబట్టారు. నరవణె పుస్తకం గురించిన ఉటంకింపులను అనుమతించబోనని స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించినా రాహుల్‌ పట్టించుకోలేదు. పలువురు విపక్ష నేతలు ఆయనకు మద్దతుగా నిలవడంతో గందరగోళం నెలకొంది. అధికార, విపక్ష సభ్యులు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. దాంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు.

ఒక్క వాక్యానికే భయమెందుకు?
సోమవారం లోక్‌సభ సమావేశమై రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టింది. బీజేపీ సభ్యుడు తేజస్వి సూర్య మాట్లాడుతూ కాంగ్రెస్‌ దేశభక్తిపై పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. అనంతరం ప్రసంగించిన రాహుల్‌ వాటిపై మండిపడ్డారు. ‘‘నెహ్రూ–చైనా అంశంపై మాట్లాడాలని నేను అనుకోలేదు. కానీ కనుక సూర్య చేసిన విమర్శలకు బదులుగా దానిపై మాట్లాడక తప్పడం లేదు. నెహ్రూ కేవలం తాను రాజనీతిజ్ఞుడినని చెప్పుకునేందుకు వేలాది ఎకరాల భూభాగాన్ని చైనాకు సరెండర్‌ చేశారని నిరాధారణ ఆరోపణలకు దిగుతున్నారు’’ అన్నారు. 

ఆ క్రమంలో 2020 భారత్, చైనా గాల్వాన్‌ ఘర్షణల గురించి జనరల్‌ నరవణె తన పుస్తకంలో రాసిన అంశాలను ఉటంకించారు. అందుకు అమిత్‌ షా తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ పుస్తకం ప్రచురణ అయిందో లేదో ముందుగా రాహుల్‌ స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. దాంతో మొదలైన రగడ 50 నిమిషాలకు పైగా కొనసాగింది. ఈ అంశానికి సంబంధించి ఎలాంటి పుస్తకం, వార్తా పత్రిక క్లిప్పింగ్‌ తాలూకు అంశాలనూ సభలో ప్రస్తావించడానికి అనుమతి లేదని ఓం బిర్లా స్పష్టం చేశారు. వాటి ప్రస్తావనకు అడ్డంకులేమీ లేవని రాహుల్‌ వాదించారు. నరవణె పుస్తకం ప్రచురితం కాలేదని రాజ్‌నాథ్‌ అభ్యంతరం తెలిపారు. 

దానిపై ఒక మేగజైన్లో వచ్చిన వ్యాసంలోని అంశాలనే ఉటంకిస్తున్నానని రాహుల్‌ బదులిచ్చారు. ‘‘ఉగ్రవాదంపై రాజీలేని పోరు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటారు. నేను ఒక్క వాక్యం చదివితే ఎందుకంతగా బెంబేలెత్తిపోతున్నారు?’’ అంటూ ఎద్దేవా చేశారు. ఆ పుస్తక ప్రస్తావనను అనుమతించడం లేదని ఓం బిర్లా పునరుద్ఘాటించారు. ‘అయితే నేనేం మాట్లాడాలో మీరే చెప్పండి’ అని రాహుల్‌ అనడంతో, ‘నేనేమీ మీ సలహాదారును కాదు’ అంటూ స్పీకర్‌ ఆగ్రహించారు. స్పీకర్‌ రూలింగ్‌కు కట్టుబ డకుంటే ఏం చర్యలు తీసుకోవాలో సభ నిర్ణయించాల్సి వస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజు హెచ్చరించారు.

 అయినా రాహుల్‌ వెనక్కు తగ్గకపోవడంతో పుస్తక ప్రస్తావన తగదంటూ ఆయన్ను బిర్లా పదేపదే వారించారు. పుస్తకాన్ని ప్రచురించొద్దంటూ నరవణెను కేంద్రం బెదిరించిందంటూ రాహుల్‌ తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారని, సభను తప్పుదోవ పట్టిస్తున్నారని రాజ్‌నాథ్‌ మండిపడ్డారు. అదే నిజమైతే దానిపై నరవణె కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. రాహుల్‌కు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ మద్దతుగా నిలిచారు. 

ఆయనను మాట్లాడేందుకు అనుమతించాలని డిమాండ్‌ చేశారు. వెంటనే అధికార, విపక్ష సభ్యులు పోటాపోటీ నినాదాలకు దిగారు. గందరగోళం నడుమ సభను మధ్యాహ్నం మూడింటిదాకా స్పీకర్‌ వాయిదా వేశారు. అనంతరం కూడా ఇండో–చైనా సరిహద్దు అంశాన్ని లేవనెత్తేందుకు రాహుల్‌ తిరిగి ప్రయత్నించారు. అందుకు అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సైన్యాన్ని న్యూనతపరిచే వ్యాఖ్యలకు దిగొద్దని రాహుల్‌కు రిజిజు సూచించారు. ప్రతిష్టంభన నడుమ సభ సాయంత్రం నాలుగింటిదాకా వాయిదా పడింది.
 

మోదీకి, మంత్రులకు నచ్చదు!
సభ మళ్లీ సమావేశమయ్యాక రాహుల్‌ తన ప్రసంగం కొనసాగించారు. తాను లేవనెత్తుతున్నది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని చెప్పారు. ‘‘సహజంగానే ప్రధాని మోదీకి, రక్షణ మంత్రికి ఇది నచ్చదు. అందుకే నన్ను మాట్లాడనివ్వడం లేదు’’ అంటూ దుయ్యబట్టారు. మహువా మొయిత్రా, కల్యాణ్‌ బెనర్జీ (టీఎంసీ), మనోజ్‌ ఝా (ఆర్జేడీ) తదితర విపక్ష సభ్యులు రాహుల్‌కు బాసటగా నిలిచారు.

మోదీ, రాజ్‌నాథ్‌ దోషులుగా తేలతారనే...
సభలో నన్ను అడ్డుకున్నారు: రాహుల్‌
‘‘2020లో చైనాతో ఘర్షణ సందర్భంగా మన సైనిక బలగాల నమ్మకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వమ్ము చేశారు. ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె పుస్తకంలోని అంశాలు వెలుగులోకి వస్తే ఆ ఉదంతంలో వారిద్దరూ దోషులుగా రుజువవుతారు. ఆ భయంతోనే నేను సదరు అంశాలను ప్రస్తావించకుండా బీజేపీ సభ్యులు లోక్‌సభలో పదేపదే అడ్డుకున్నారు’’ అని విపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. సోమవారం సభ వాయిదా పడ్డాక పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మోదీ, రాజ్‌నాథ్‌ గురించి ఆ పుస్తకంలో నరవణె రాశారు. చైనాతో ఘర్షణకు సంబంధించి వారిద్దరూ తనకు ఏం చెప్పిందీ, ఎలాంటి ఆదేశాలిచ్చిందీ స్పష్టంగా పేర్కొన్నారు. దాన్నే నేను సభలో ప్రస్తావించా. 

ఆ రెండు మూడు వాక్యాల్లో విషయమంతా స్పష్టంగా బయటపడిపోయేది. పైగా వాటిని రాసింది నాటి ఆర్మీ చీఫ్‌! కానీ ఆ మాత్రానికే మోదీ సర్కారు బెంబేలెత్తిపోతోంది. ఎందుకంటే అది వెలుగులోకి వస్తే వారిద్దరి బండారం బయటపడుతుంది’’ అన్నారు. 2020లో చైనా చొచ్చుకొస్తున్నప్పుడు మోదీ 56 అంగుళాల ఛాతీ ఏమైపోయిందంటూ ఎద్దేవా చేశారు. ‘‘అలాంటి పరిస్థితుల్లో దేశాన్ని నడిపే నాయకుడు స్పష్టంగా దిశానిర్దేశం చేయాలి. అంతే తప్ప నిర్ణయాలను ఇతరుల భుజస్కంధాలపై నెట్టి బాధ్యతల నుంచి తప్పించుకోవద్దు. కానీ మోదీ చేసింది సరిగ్గా అదే! ఆర్మీ మాజీ చీఫ్‌ రాసిన పుస్తకాన్ని ప్రచురణ కూడా కానివ్వడం లేదు’’ అని రాహుల్‌ ఆరోపించారు.

నిబంధనల దుర్వినియోగం: కాంగ్రెస్‌
సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీని మోదీ సర్కారు అవహేళన చేసిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. పైగా ఆయన గొంతు నొక్కేందుకు నిబంధనలను కూడా దుర్వినియోగం చేస్తోందంటూ మండిపడింది. నరవణె పుస్తకంలోని నిజాలు వెలుగులోకి వస్తాయన్న భయంతోనే చౌకబారు చేష్టలకు దిగారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.సి.వేణుగోపాల్‌ ఆరోపించారు. ఇది నయా ఫాసిజానికి తిరుగులేని తార్కాణమంటూ ధ్వజమెత్తారు.

పార్లమెంటును కించపరిచారు
విపక్ష నేత రాహుల్‌గాంధీ తన ప్రవర్తనతో పార్లమెంటు గౌరవానికే భంగం కలిగించారని బీజేపీ దుయ్యబట్టింది. అంతేగాక భారత్‌–చైనా సరిహద్దు అంశంపై నిరాధారణ ఆరోపణలు, బాధ్యతారహిత వ్యాఖ్యలతో సైనికుల ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బ తీశారంటూ ఆక్షేపించింది. రాహుల్‌ పూర్తిగా భారత వ్యతిరేక శక్తుల భాష మాట్లాడుతున్నారని మంత్రులు, బీజేపీ నేతలు మండిపడ్డారు. సభలో రాహుల్‌ ప్రవర్తన భారత్‌ పరువును మంటగలిపేందుకు పక్కా పథకం ప్రకారం పన్నిన కుట్రలో భాగమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజు ఆరోపించారు. 

పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. విలువైన సభా సమయాన్ని రాహుల్‌ వ్యర్థపరిచారని మండిపడ్డారు. ‘‘జాతీయ భద్రతతో ఆటలాడొద్దు. దాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకోవద్దు’’ అంటూ హెచ్చరించారు. కాంగ్రెస్‌ హయాంలో భారత భూభాగాన్ని చైనాకు కోల్పోయినందుకు రాహుల్‌ తక్షణం దేశానికి క్షమాపణ క్షమాపణ చెప్పాలని రిజిజు డిమాండ్‌ చేశారు. రాహుల్‌ ఏకంగా నిండు సభలోనే మన దేశ శత్రువుల భాష మాట్లాడుతున్నారంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌ మండిపడ్డారు.

ఆ పుస్తకంలో ఏముంది?
లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ, మంత్రుల నడు మ రగడకు కేంద్ర బిందువుగా మారిన ఆర్మీ మాజీ చీఫ్‌ ఎంఎం నరవణె పుస్తకంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన తన సైనిక జీవితం తాలూకు జ్ఞాపకాలకు ‘ఫోర్‌ స్టార్స్‌ ఆఫ్‌ డెస్టినీ’ పేరిట పుస్తక రూపమిచ్చారు. పెంగ్విన్‌ పబ్లిషింగ్‌ హౌజ్‌ దాన్ని ప్రచురించాల్సి ఉంది. అందుకు రక్షణ శాఖ అనుమతి కోసం ఏడాదికి పైగా ఎదురు చూస్తున్నట్టు నరవణె గత అక్టోబర్‌లో పేర్కొన్నారు! ఈ నేపథ్యంలో ఆ పుస్తకంపై ద కారవాన్‌ మేగజైన్‌ గత నెలలో కవర్‌ పేజీ వ్యాసం ప్రచురించింది. రాహుల్‌ సోమవారం సభలో ఉటంకించింది ఆ వ్యాసంలోని అంశాలనే! తద్వారా, గాల్వాన్‌ ఘర్షణ వంటి అతి కీలక ఉదంతంపై సరైన నిర్ణయం తీసుకోవడంలో మోదీ సర్కారు తాత్సారం చేసిందని చెప్పేందుకు ఆయన ప్రయత్నించారు.

నిర్ణయాన్ని నాకే వదిలారు: నరవణె
2020 జూన్‌15 రాత్రి తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయలో భారత, చైనా సైనిక దళాల మధ్య భారీ ఘర్షణ జరిగింది. వాటిలో కల్నల్‌ సంతోష్‌కుమార్‌తో సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనావైపు కూడా భారీగా ప్రాణనష్టం జరిగి నా డ్రాగన్‌ దేశం ఆ వివరాలను బయ టికి రానివ్వ లేదు. ఆ ఘర్షణల సమయంలో నరవణె ఆర్మీ చీఫ్‌గా ఉన్నారు. ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న వేళ 2020 ఆగస్టు 31న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో తన భేటీ గురించి పుస్తకంలో నరవణె రాశారు. ‘‘(గాల్వాన్‌ ఉద్రిక్తతలపై) ప్రధాని మోదీతో మాట్లాడానని రాజ్‌నాథ్‌ నాకు చెప్పారు. ‘అది పూర్తిగా సైనిక నిర్ణయం. 

మీకు ఏది సరైందనిపిస్తే అలా చేయండి’ అన్నారు. దాంతో బాధ్యతంతా పూర్తి గా నాపైనే పడింది. ‘చైనా దూకుడును అడ్డుకు నేందుకు) నేనే సరైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఏం చేయాలా అని కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపో యాను’’ అని అందులో నరవణె రాసుకొచ్చి నట్టు కారవాన్‌ వ్యాసం పేర్కొంది. ‘‘పుస్తకం బ్యాక్‌ కవర్‌పై 1999 కార్గిల్‌ యుద్ధ సమయంలో ఆర్మీ చీఫ్‌గా చేసిన జనరల్‌ వి.పి.మాలిక్‌ రాసిన అభిప్రాయం కూడా ఆసక్తికరంగా ఉంది. ‘గాల్వన్‌ లోయ ఘర్షణ, దానికి ముందు, తర్వాత జరిగిన పలు ఉదంతాల గురించి పుస్తకంలో రాసిన అంశాలు చదువుతుంటే పాఠకులంతా భావోద్వేగాలతో ఊగిపోవడం ఖాయం’ అని మాలిక్‌ రాసుకొ చ్చారు’’ అంటూ వ్యాసం ముక్తా్తయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement