సాక్షి,చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని హీరో, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తు ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ తన పాత వైభవాన్ని తిరిగి పొందాలని ఆకాంక్షించారు.
తమిళనాడు తిరువాయూర్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఎస్.ఏ. చంద్రశేఖర్ సిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపాయి. కాంగ్రెస్‌తో పొత్తు సాధ్యమని, విజయ్ ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించడం ద్వారా కొత్త చర్చలు మొదలయ్యాయి. టీవీకే పొత్తు ప్రతిపాదనను పరిశీలిస్తోందని, ఆ ప్రతిపాదనకు కాంగ్రెస్ కూడా అంగీకరించాలని ఆయన కోరారు.
కాంగ్రెస్‌కు ఒక చరిత్ర, వారసత్వం ఉంది. విజయ్ ఆ పార్టీకి మద్దతు ఇచ్చి వారి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కాంగ్రెస్ చేతిలోనే ఉంది. కాంగ్రెస్ రాజకీయ ప్రాబల్యం కోసం పోరాడుతోంది. వారి ప్రాభవం తగ్గుతుంటే రక్షించేందుకు విజయ్ సిద్ధంగా ఉన్నారు’ అని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై అటు టీవీకే అధికార ప్రతినిధులు కానీ.. ఇటు విజయ్ కానీ ధృవీకరించరించలేదు. ఖండించలేదు.
అయితే, చంద్రశేఖర్ ప్రతిపాదనను తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కె. సెల్వపెరుంతగై తోసిపుచ్చారు. ‘మా పార్టీ కార్యకర్తలకు విజయ్ నుండి ఎలాంటి ఉత్తేజం అవసరం లేదు. మా కార్యకర్తలను చూడండి, వాళ్లలోనే ఉత్తేజం కనబడుతోంది. మా నాయకుడు రాహుల్ గాంధీ మాకు అవసరమైన ‘బూస్ట్, హార్లిక్స్, బోర్న్‌విటా’ ఇస్తున్నారు’ అని ఆయన స్పష్టం చేశారు.


