దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభంజనం కొనసాగుతోంది. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిపై తాజాగా ఇండియా టుడే-సీఓటర్ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తే ఎన్డీయేకు 352 సీట్లు వస్తాయని సర్వేలో పేర్కొంది. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 182 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలింది. దీంతో, రానున్న ఎన్నికల్లో కూడా కేంద్రంలో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో, కాషాయ పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్ నెలకొంది.
ఇండియా టుడే-సీఓటర్ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే ప్రకారం.. ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించే అవకాశం ఉందని తేలింది. దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీకి 41 శాతం(287 సీట్లు), కాంగ్రెస్ పార్టీకి 20 శాతం(80సీట్లు), మిగతా పార్టీలకు 39 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే భారత ప్రధానిగా మోదీనే బెస్ట్ అని 55 శాతం మంది భావించినట్లు సర్వే వెల్లడించింది. కాగా, ఆరు నెలల కిందటితో పోల్చితే మూడు శాతం ఓటింగ్ పెరిగినట్లు స్పష్టం చేసింది. ప్రధాని మోదీ పనితీరుపై 57 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే రాహుల్ గాంధీ 27 శాతం మంది మొగ్గు చూపినట్లు సమాచారం.
#MoodOfTheNation | BJP at 41% vote share, Congress at 20% if polls are held today
Projected seat share
BJP - 287
Congress - 80
BJP national spokesperson @Sanju_Verma_ decodes the findings of the #MOTN survey.@BJP4India | @SardesaiRajdeep @maryashakil pic.twitter.com/luJIoaCpER— IndiaToday (@IndiaToday) January 29, 2026
ఇక, ఆగస్టు 2025లో నిర్వహించిన ఇండియా టుడే సర్వేలో ఎన్డీయేకి 324 సీట్లు, ఇండియా బ్లాక్‌కు 208 సీట్లు వస్తాయని అంచనా వేశారు. తాజా సర్వేలో ఎన్డీయే సీట్ల సంఖ్య మరింత పెరిగినట్లు స్పష్టమవుతోంది. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 293 సీట్లు, ఇండియా బ్లాక్ 234 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. మరోవైపు.. తాజా సర్వే ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. అలాగే, ఇండియా బ్లాక్ ఈ సర్వేలను జాగ్రత్తగా తీసుకోవాలని, అసలు పోరు ఎన్నికల సమయంలోనే తేలుతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. మోదీ వేవ్‌లో భాగంగా 2025లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి.. ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 2026 కూడా మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో విజయాలతో శుభారంభం చేసింది. ప్రస్తుతానికి ఎన్డీయే కూటమి ఫోకస్ మొత్తం రానున్న బెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. ఆయా రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో మోదీ ముందుకు సాగుతున్నారు.


