పోలీసులు ‘గీత’ దాటొద్దు | Supreme Court to TG Govt On Cases over social media posts | Sakshi
Sakshi News home page

పోలీసులు ‘గీత’ దాటొద్దు

Feb 3 2026 3:23 AM | Updated on Feb 3 2026 3:23 AM

Supreme Court to TG Govt On Cases over social media posts

సోషల్‌ మీడియాలో పోస్టులపై కేసుల నమోదులో పోలీసులు హైకోర్టు మార్గదర్శకాలు పాటించాల్సిందే

రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు

రాజకీయ విమర్శలపై ఇష్టారాజ్యంగా కేసులు పెట్టలేరు 

ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముందే పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సలహా తప్పనిసరి 

హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌లో మెరిట్స్‌ లేవంటూ కొట్టివేత

సాక్షి, న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా పోస్టులు, రాజకీయ విమర్శలకు సంబంధించి ఎడాపెడా కేసులు నమోదు చేస్తున్న పోలీసుల తీరుకు అడ్డుకట్ట వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సోషల్‌ మీడియా పోస్టులపై కేసులు నమోదు చేసే సమయంలో పోలీసులు పాటించాల్సిన విధివిధానాలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రాథమిక హక్కుల రక్షణ కోసమే హైకోర్టు ఆ నిబంధనలు పెట్టిందని.. వాటిని పోలీసులు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు జస్టిస్‌ జె.బి. పార్దీవాలా, జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. 

అసలేం జరిగింది? 
సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల పోస్టుల ఆధారంగా యాంత్రికంగా క్రిమినల్‌ కేసులు నమోదు చేయడాన్ని తప్పుబడుతూ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా వ్యవహరించరాదని సూచించింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముందు పాటించాల్సిన మార్గదర్శకాలను తీర్పులో పొందుపరిచింది. అయితే ఈ మార్గదర్శకాలు దర్యాప్తు సంస్థల విధులకు ఆటంకం కలిగిస్తున్నాయంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సోమవారం సుప్రీం ధర్మాసనం ముందు వాడీవేడిగా వాదనలు జరిగాయి. 

పోలీసుల దర్యాప్తు స్వేచ్ఛకు మార్గదర్శకాలు అడ్డంకిగా ఉన్నాయి: లూథ్రా 
విచారణ ప్రారంభం కాగానే తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. కేసు మెరిట్స్‌పై తాము వాదించడం లేదని.. కానీ హైకోర్టు విధించిన కొన్ని షరతులు ఇబ్బందికరంగా ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ‘హైకోర్టు తీర్పులోని పేరా 29లో ఇచ్చిన మార్గదర్శకాలపై మాకు అభ్యంతరం ఉంది. ముఖ్యంగా గైడ్‌లైన్‌ నంబర్‌ 7, 8 పోలీసుల దర్యాప్తు స్వేచ్ఛను దెబ్బతీసేలా ఉన్నాయి. రాజకీయ ప్రసంగాలు లేదా సోషల్‌ మీడియా పోస్టుల విషయంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ముందే పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నుంచి న్యాయ సలహా తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. ఇది ప్రాసిక్యూషన్‌ వ్యవస్థ స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుంది. ప్రాసిక్యూషన్‌ వేరు, దర్యాప్తు వేరు కదా?. కానీ గైడ్‌లైన్‌ నంబర్‌ 4, 7 పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఫిర్యాదులు నిరాధారమని తేలితే కేసు క్లోజ్‌ చేయాలని చెబుతున్నారు. 

అది కేవలం సాక్ష్యాధారాల లేమి వల్లే కాదు.. ఇతర కారణాల వల్ల కూడా క్లోజ్‌ చేయొచ్చు కదా?’అని అన్నారు. దీనిపై జస్టిస్‌ పార్దివాలా జోక్యం చేసుకుంటూ ‘అసలు హైకోర్టు గైడ్‌లైన్స్‌ ఇవ్వడంలో తప్పేముంది? పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి, యాంత్రికంగా కేసులు పెట్టకుండా ఉండటానికి ఆ మాత్రం జాగ్రత్తలు అవసరం లేదా? ఒక హైకోర్టు జ్యుడీíÙయల్‌ ఆర్డర్‌ ద్వారా కొన్ని మార్గదర్శకాలు ఇస్తే సంబంధిత అధికారులు వాటిని పాటించాల్సిందే. మార్గదర్శకాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం మాకు కనిపించడం లేదు. చాలా కోర్టులు ఇలాంటి మార్గదర్శకాల కోసమే ఎదురుచూస్తున్నాయి కూడా. హైకోర్టు కేవలం విస్తృతమైన మార్గదర్శకాలనే జారీ చేసింది. వాటిని పాటించండి’అని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ ప్రభుత్వ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. 

పోలీసులకు హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు ఇవీ.. 
ముందస్తు పరిశీలన: సోషల్‌ మీడియా పోస్టులపై ఫిర్యాదు రాగానే వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకూడదు. ముందుగా ప్రాథమిక విచారణ జరపాలి. 
⇒ న్యాయ సలహా: రాజకీయ విమర్శలు, సున్నితమైన అంశాలకు సంబంధించిన పోస్టుల విషయంలో కేసు నమోదు చేసే ముందు తప్పనిసరిగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నుంచి న్యాయ సలహా తీసుకోవాలి. 
⇒ నిరాధారమైతే రద్దు: విచారణలో ఫిర్యాదు నిరాధారమైనదిగా లేదా దురుద్దేశపూర్వకమైనదిగా తేలితే వెంటనే కేసు మూసేయాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement