breaking news
Manoj Mukund Naravane
-
ఆ రెండు పుస్తకాలు ఒక్కటి కావు
న్యూఢిల్లీ: చైనా బలగాలతో భారత సైన్యం పోరాటానికి సంబంధించి పలు వివాదాస్పద అంశాలను ప్రస్తావిస్తూ భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పుస్తకం చర్చనీయాంశం కావడంతో దాని ప్రచురణసంస్థ ‘పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా’మంగళవారం స్పష్టతనిచ్చింది. ఆ పుస్తకాన్ని ఇప్పటిదాకా ముద్రించలేదని, ఆన్లైన్ వేదికలపై ప్రత్యక్షమైనదంతా అనధికార కాపీ అని పెంగ్విన్ ర్యాండమ్ వెల్లడించింది. ఈ మేరకు సంస్థ మంగళవారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ప్రీ–ఆర్డర్ అని పేర్కొన్నంత మాత్రాన అది ఇప్పటికే ముద్రితమై అమ్మకానికి సిద్ధంగా ఉందని కాదు. త్వరలో ప్రచురితంకావొచ్చు అని అర్థం. అంతేగానీ పుస్తకం ముద్రించామని మేం ఎక్కడా పేర్కొనలేదు’’అంటూ పుస్తకాలకు సంబంధించి తాము అనుసరించే 4 విధానాలను పెంగ్విన్ ర్యాండమ్ వివరించింది. అవి.. 1. కొత్త పుస్తకాన్ని ప్రకటించం: అంటే కొత్త రచన, నూతన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం జరిగిందని అర్థం. అంతేగానీ ఈ పుస్తకం ఇప్పటికే ముద్రితమైందని కాదు. అది ఇంకా ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకికూడా రాదు. 2. ప్రీ–ఆర్డర్: ఇది ప్రచురణకు సంబంధించిన ప్రామాణిక అనుసరణీయ విధానం. నచి్చతే పాఠకులు లేదా రిటైల్ సంస్థలు త్వరలో ప్రచురితంకాబోయే ఈ పుస్తకం కోసం ఆర్డర్లు పెట్టుకోవచ్చు. ఈ దశలోనూ పుస్తకం ముద్రితంకాదు. అందుబాటులో ఉండదు. 3. రాబోయే తేదీ ఖరారు: ఫలానా తేదీన పుస్తకాన్ని ఆవిష్కరించాలని నిర్ణయం జరిగిదంతే. అంతమాత్రాన ఆరోజుకల్లా పుస్తకం ముద్రితమైపోతుందని అర్థంకాదు. 4.ముద్రిత పుస్తకం: విక్రయాల కోసం రిటైల్ దుకాణాల్లోకి వచ్చాకే ఆ పుస్తకం అధికారికంగా ముద్రితమైందని భావించాలి. పుస్తకాన్ని ఏరకంగానూ విడుదల చేయలేదు: పెంగ్విన్‘‘నరవణె రాసిన ఈ పుస్తకాన్ని ప్రింట్ లేదా డిజిటల్ లేదా పీడీఎఫ్ ఇలా ఏ ఫార్మాట్లోనూ అందుబాటులోకి తేలేదు. ఒక్క పుస్తకాన్ని కూడా ముద్రించలేదు. ఎవరికీ విక్రయించలేదు. ఆన్లైన్ వేదికలపై ప్రత్యక్షమైనదంతా అనధికార వెర్షన్ మాత్రమే. దానితో మాకు సంబంధం లేదు. పుస్తకం ప్రచురణ హక్కులు మాకే ఉన్నాయి. పుస్తకాన్ని ఏ రూపంలోనూ మేం పంపిణీ చేయలేదు. బహిర్గతంచేయలేదు. ప్రస్తుతం ప్రింట్, డిజిటల్, పీడీఎఫ్ రూపాల్లో షేర్ అవుతుంటేగనక అది పూర్తిగా మా సంస్థ కాపీరైట్ హక్కులను ఉల్లంఘించినట్లే లెక్క. ఈ అంశంలో మేం చట్టపర చర్యలు తీసుకుంటున్నాం’’అని సంస్థ స్పష్టం చేసింది. మౌనం వీడిన నరవణె పుస్తకం వివాదం కావడంతో ఎట్టకేలకు నరవణె మౌనం వీడారు. ఈ పుస్తకం ఇంకా ప్రచురితంకాలేదని ఆయన స్పష్టంచేశారు. ఈ మేరకు సోమవారం పెంగ్విన్ ఇండియా సంస్థ వెల్లడించిన ఒక ప్రకటనను నరవణే మంగళవారం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్‌చేశారు. ‘‘పుస్తకం తాజా స్థితి ఇదే’’అని దానికి ఒక క్యాప్షన్ పెట్టారు. పుస్తకమొచ్చిందని రెండేళ్ల క్రితమే చెప్పారు: రాహుల్పుస్తకం ప్రచురితంకాలేదన్న పెంగ్విన్ వాదనల్లో నిజంలేదంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో రాహుల్ మాట్లాడారు. గతంలో నరవణే చేసిన ట్వీట్‌ను రాహుల్ అందరిఎదుట బయటకు చదివి వినిపించారు. ‘‘హలో ఫ్రెండ్స్. నేను రాసిన పుస్తకం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇక్కడున్న లింక్‌ను క్లిక్‌చేసి చదవండి. ఆనందంగా పఠనం పూర్తిచేయండి. జైహింద్ అని నరవణె రాసుకొచ్చారు. ఇది డిసెంబర్ 2023లో నరవణె ఆయన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్‌చేశారు. పుస్తకం అసలు ప్రచురితంకాలేదని పెంగ్విన్ చెబుతోంది. కానీ ఇప్పటికే ఈ పుస్తకం అమెజాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది’’అని రాహుల్ అన్నారు. -
బాధ్యత దులిపేసుకున్న మోదీ
న్యూఢిల్లీ: భారత్–చైనా మధ్య 2020లో జరిగిన ఘర్షణ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ముఖ్యమైన బాధ్యతను అప్పటి ఆర్మీ చీఫ్‌పైకి నెట్టేసి, చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. దేశ భద్రతకు సంబంధించిన అత్యంత సంక్షోభ సమయంలో మోదీ అలా తప్పించుకోవడం ఏమిటని నిలదీశారు. ప్రజలు ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోతోందని విమర్శించారు. రాహుల్ బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవణే రచించి, ఇంకా అధికారికంగా విడుదల చేయని జ్ఞాపకాల పుస్తకాన్ని ప్రదర్శించారు. అందులోని కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ పుస్తకం నిజంగా ఉందన్న సంగతిని యువత తెలుసుకోవాలని కోరారు. అసలు ఇలాంటి పుస్తకమే లేదని ప్రభుత్వం నమ్మబలుకుతోందని, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ అదేమాట చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తూర్పు లద్ధాఖ్‌లో గల్వాన్ ఘర్షణ సమయంలో ఏం జరిగిందో నరవణే సవివరంగా రాశారని తెలిపారు. మోదీ వస్తే పుస్తకం అందజేస్తా.. ‘‘చైనా యుద్ధ ట్యాంకులు కైలాస పర్వతం దాకా దూసుకొచ్చాయి.. ఇప్పుడేం చేయాలని ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తోపాటు రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను అడిగారు. అందుకు వారు సమాధానం చెప్పలేదు. దాంతో రాజ్‌నాథ్ సింగ్‌ను మళ్లీ అడిగారు. ఉన్నత స్థాయి వాళ్లను(ప్రధానమంత్రి) అడిగి చెప్తానని రాజ్‌నాథ్ బదులిచ్చారు. రాజ్‌నాథ్ వెళ్లి ప్రధానమంత్రిని అడిగితే.. మీకు ఏది సముచితం అనిపిస్తే అదే చేయండి అంటూ మోదీ బాధ్యత దులిపేసుకున్నారు. చైనా యుద్ధ ట్యాంకులు మన భూభాగంలోకి ప్రవేశించినా తనకు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడారు. దాంతో ఈ అంశంలో పూర్తిగా ఒంటరిగా మారిపోయినట్లు భావించానని నరవణే తన పుస్తకంలో రాశారు. ఇదే విషయం నేను పార్లమెంట్లో చెప్తానని ప్రభుత్వం భయపడుతోంది. అందుకే నన్ను సభలో మాట్లాడనివ్వడం లేదు. లోక్‌సభకు వచ్చేంత ధైర్యం ప్రధాని మోదీకి ఉందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ ఆయన వస్తే ఈ పుస్తకం అందజేస్తా’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అనంతరం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఈ పుస్తకం ప్రతిపక్ష నేత గానీ, విదేశీ రచయిత గానీ రాయలేదని వెల్లడించారు. మాజీ ఆర్మీ చీఫ్ రాశారని పేర్కొన్నారు. అయినా ఇలాంటి పుస్తకం లేనేలేదని అంటున్నారని తప్పుబట్టారు. పార్లమెంట్‌కు వచి్చ, నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం మోదీకి లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం భయపడుతోంది: ప్రియాంక చైనాతో ఘర్షణ జరిగినప్పుడు మోదీ ప్రభుత్వ నిర్వాకం ఏమిటో జనరల్ నరవణే బయటపెట్టారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా పేర్కొన్నారు. నిజాలు ప్రజలకు తెలుస్తాయని మోదీ సర్కార్ భయపడుతోందని, అందుకే లోక్‌సభలో మాట్లాడేందుకు రాహుల్ గాంధీకి అనుమతి ఇవ్వడం లేదని బుధవారం విమర్శించారు. బీజేపీ ఎంపీలు కూడా గతంలో పుస్తకాలు, మేగజైన్లు, రిపోర్టులను ప్రస్తావిస్తూ పార్లమెంట్లో మాట్లాడారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ కూడా సంజయ్‌బారు పుస్తకం గురించి మాట్లాడారని తెలిపారు. నరవణే పుస్తకంపై రాహుల్ మాట్లాడితే తప్పేమిటని ప్రశ్నించారు. అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఎంపీలకు ఉందన్నారు. -
సభలో రచ్చరచ్చ
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందం, మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవణే పుస్తకంపై లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు బుధవారం సైతం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలకు నిజాలు బహిర్గతం చేయాలని పట్టుబట్టారు. సభలో బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించాల్సి ఉండగా, ఆయన సభకు హాజరు కాలేదు. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు ప్రారంభించారు. శాంతించాలంటూ స్పీకర్ విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోలేదు. దాంతో స్పీకర్ సభను ఉదయం 11 గంటల దాకా వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యుల ఆందోళన ఆగలేదు. ప్రభుత్వం సమాధానం చెప్పేదాకా విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. విపక్ష ఎంపీలు తొలుత వెల్‌లో బైఠాయించారు. అనంతరం బ్యానర్లు ప్రదర్శిస్తూ అధికార పక్ష సభ్యులవైపు దూసుకొచ్చారు. నరవణే పుస్తకంపై సభలో రాహుల్ గాం«దీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వారి తీరును కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, అమిత్ షా తప్పుపట్టారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ మధ్యాహ్నం 12 గంటల దాకా, తర్వాత 2 గంటల దాకా వాయిదా వేశారు. మరో వాయిదా తర్వాత 5 గంటలకు సభ మళ్లీ ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ సమయంలోనే ప్రధాని ప్రసంగించాల్సి ఉంది. కాంగ్రెస్ మహిళా ఎంపీ వర్షా గైక్వాడ్ సహా మరికొందరు మహిళా సభ్యులు ప్రధాని కూర్చొనే స్థానం వద్దకొచ్చి ఘోరావ్ చేశారు. అప్పుడు మోదీ సభలో లేరు. వెనక్కి రావాలంటూ కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కోరినా విపక్ష సభ్యులు పట్టించుకోలేదు. పరిస్థితి సద్దుమణగకపోవడంతో స్పీకర్ స్థానంలో ఉన్న సంధ్యా రాయ్ సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. పరిస్థితి అదుపులో లేకపోవడం వల్లనే మోదీ సభకు రాలేదని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ చెప్పారు. రాహుల్‌కు పోటీగా దూబే పుస్తక ప్రదర్శన..మధ్యాహ్నం 2 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ‘ఎడ్వినా అండ్ నెహ్రూ’, ‘మిత్రోఖిన్ ఆర్కైవ్’ అనే పుస్తకాలను సభలో ప్రదర్శిస్తూ వాటి గురించి ప్రస్తావించడంతో వివాదం మొదలైంది. దివంగత ప్రధానమంత్రులు నెహ్రూ, ఇందిరా గాం«దీ, రాజీవ్ గాంధీపై ఆయన విమర్శలు చేశారు. వారు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అయితే, సభలో పుస్తకాల గురించి ప్రస్తావించడానికి వీల్లేదని సభాపతి స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెన్నేటి స్పష్టంచేశారు. నిషికాంత్ దూబ్ తీరుపై మండిపడుతూ కాంగ్రెస్ సహా ఇతర విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో సభాపతి లోక్‌సభను సాయంత్రం 5 గంటల దాకా వాయిదా వేశారు. తర్వాత కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. నిషికాంత్ దూబేపై సస్పెన్షన్ వేటు వేయాలని డిమాండ్ చేశారు. -
సభలో ‘చైనా’ రగడ!
న్యూఢిల్లీ: ‘చైనా రగడ’ సోమవారం లోక్‌సభను కుదిపేసింది. 2020 నాటి భారత్, చైనా ఘర్షణలకు సంబంధించి విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. వాటికి సంబంధించి ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె పుస్తకంలోని పలు అంశాలను రాహుల్ సభలో ప్రస్తావించడం కలకలం రేపింది. విపక్ష నేత వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు బీజేపీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ప్రచురణ కాని పుస్తకంలోని అంశాలను ఉటంకించడాన్ని ఆక్షేపించారు.సభను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారంటూ దుయ్యబట్టారు. నరవణె పుస్తకం గురించిన ఉటంకింపులను అనుమతించబోనని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించినా రాహుల్ పట్టించుకోలేదు. పలువురు విపక్ష నేతలు ఆయనకు మద్దతుగా నిలవడంతో గందరగోళం నెలకొంది. అధికార, విపక్ష సభ్యులు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. దాంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.ఒక్క వాక్యానికే భయమెందుకు?సోమవారం లోక్‌సభ సమావేశమై రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టింది. బీజేపీ సభ్యుడు తేజస్వి సూర్య మాట్లాడుతూ కాంగ్రెస్ దేశభక్తిపై పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. అనంతరం ప్రసంగించిన రాహుల్ వాటిపై మండిపడ్డారు. ‘‘నెహ్రూ–చైనా అంశంపై మాట్లాడాలని నేను అనుకోలేదు. కానీ కనుక సూర్య చేసిన విమర్శలకు బదులుగా దానిపై మాట్లాడక తప్పడం లేదు. నెహ్రూ కేవలం తాను రాజనీతిజ్ఞుడినని చెప్పుకునేందుకు వేలాది ఎకరాల భూభాగాన్ని చైనాకు సరెండర్ చేశారని నిరాధారణ ఆరోపణలకు దిగుతున్నారు’’ అన్నారు. ఆ క్రమంలో 2020 భారత్, చైనా గాల్వాన్ ఘర్షణల గురించి జనరల్ నరవణె తన పుస్తకంలో రాసిన అంశాలను ఉటంకించారు. అందుకు అమిత్ షా తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ పుస్తకం ప్రచురణ అయిందో లేదో ముందుగా రాహుల్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దాంతో మొదలైన రగడ 50 నిమిషాలకు పైగా కొనసాగింది. ఈ అంశానికి సంబంధించి ఎలాంటి పుస్తకం, వార్తా పత్రిక క్లిప్పింగ్ తాలూకు అంశాలనూ సభలో ప్రస్తావించడానికి అనుమతి లేదని ఓం బిర్లా స్పష్టం చేశారు. వాటి ప్రస్తావనకు అడ్డంకులేమీ లేవని రాహుల్ వాదించారు. నరవణె పుస్తకం ప్రచురితం కాలేదని రాజ్‌నాథ్ అభ్యంతరం తెలిపారు. దానిపై ఒక మేగజైన్లో వచ్చిన వ్యాసంలోని అంశాలనే ఉటంకిస్తున్నానని రాహుల్ బదులిచ్చారు. ‘‘ఉగ్రవాదంపై రాజీలేని పోరు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటారు. నేను ఒక్క వాక్యం చదివితే ఎందుకంతగా బెంబేలెత్తిపోతున్నారు?’’ అంటూ ఎద్దేవా చేశారు. ఆ పుస్తక ప్రస్తావనను అనుమతించడం లేదని ఓం బిర్లా పునరుద్ఘాటించారు. ‘అయితే నేనేం మాట్లాడాలో మీరే చెప్పండి’ అని రాహుల్ అనడంతో, ‘నేనేమీ మీ సలహాదారును కాదు’ అంటూ స్పీకర్ ఆగ్రహించారు. స్పీకర్ రూలింగ్‌కు కట్టుబ డకుంటే ఏం చర్యలు తీసుకోవాలో సభ నిర్ణయించాల్సి వస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు హెచ్చరించారు. అయినా రాహుల్ వెనక్కు తగ్గకపోవడంతో పుస్తక ప్రస్తావన తగదంటూ ఆయన్ను బిర్లా పదేపదే వారించారు. పుస్తకాన్ని ప్రచురించొద్దంటూ నరవణెను కేంద్రం బెదిరించిందంటూ రాహుల్ తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారని, సభను తప్పుదోవ పట్టిస్తున్నారని రాజ్‌నాథ్ మండిపడ్డారు. అదే నిజమైతే దానిపై నరవణె కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. రాహుల్‌కు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మద్దతుగా నిలిచారు. ఆయనను మాట్లాడేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. వెంటనే అధికార, విపక్ష సభ్యులు పోటాపోటీ నినాదాలకు దిగారు. గందరగోళం నడుమ సభను మధ్యాహ్నం మూడింటిదాకా స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం కూడా ఇండో–చైనా సరిహద్దు అంశాన్ని లేవనెత్తేందుకు రాహుల్ తిరిగి ప్రయత్నించారు. అందుకు అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సైన్యాన్ని న్యూనతపరిచే వ్యాఖ్యలకు దిగొద్దని రాహుల్‌కు రిజిజు సూచించారు. ప్రతిష్టంభన నడుమ సభ సాయంత్రం నాలుగింటిదాకా వాయిదా పడింది. మోదీకి, మంత్రులకు నచ్చదు!సభ మళ్లీ సమావేశమయ్యాక రాహుల్ తన ప్రసంగం కొనసాగించారు. తాను లేవనెత్తుతున్నది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని చెప్పారు. ‘‘సహజంగానే ప్రధాని మోదీకి, రక్షణ మంత్రికి ఇది నచ్చదు. అందుకే నన్ను మాట్లాడనివ్వడం లేదు’’ అంటూ దుయ్యబట్టారు. మహువా మొయిత్రా, కల్యాణ్ బెనర్జీ (టీఎంసీ), మనోజ్ ఝా (ఆర్జేడీ) తదితర విపక్ష సభ్యులు రాహుల్‌కు బాసటగా నిలిచారు.మోదీ, రాజ్‌నాథ్ దోషులుగా తేలతారనే...సభలో నన్ను అడ్డుకున్నారు: రాహుల్‘‘2020లో చైనాతో ఘర్షణ సందర్భంగా మన సైనిక బలగాల నమ్మకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వమ్ము చేశారు. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె పుస్తకంలోని అంశాలు వెలుగులోకి వస్తే ఆ ఉదంతంలో వారిద్దరూ దోషులుగా రుజువవుతారు. ఆ భయంతోనే నేను సదరు అంశాలను ప్రస్తావించకుండా బీజేపీ సభ్యులు లోక్‌సభలో పదేపదే అడ్డుకున్నారు’’ అని విపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. సోమవారం సభ వాయిదా పడ్డాక పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మోదీ, రాజ్‌నాథ్ గురించి ఆ పుస్తకంలో నరవణె రాశారు. చైనాతో ఘర్షణకు సంబంధించి వారిద్దరూ తనకు ఏం చెప్పిందీ, ఎలాంటి ఆదేశాలిచ్చిందీ స్పష్టంగా పేర్కొన్నారు. దాన్నే నేను సభలో ప్రస్తావించా. ఆ రెండు మూడు వాక్యాల్లో విషయమంతా స్పష్టంగా బయటపడిపోయేది. పైగా వాటిని రాసింది నాటి ఆర్మీ చీఫ్! కానీ ఆ మాత్రానికే మోదీ సర్కారు బెంబేలెత్తిపోతోంది. ఎందుకంటే అది వెలుగులోకి వస్తే వారిద్దరి బండారం బయటపడుతుంది’’ అన్నారు. 2020లో చైనా చొచ్చుకొస్తున్నప్పుడు మోదీ 56 అంగుళాల ఛాతీ ఏమైపోయిందంటూ ఎద్దేవా చేశారు. ‘‘అలాంటి పరిస్థితుల్లో దేశాన్ని నడిపే నాయకుడు స్పష్టంగా దిశానిర్దేశం చేయాలి. అంతే తప్ప నిర్ణయాలను ఇతరుల భుజస్కంధాలపై నెట్టి బాధ్యతల నుంచి తప్పించుకోవద్దు. కానీ మోదీ చేసింది సరిగ్గా అదే! ఆర్మీ మాజీ చీఫ్ రాసిన పుస్తకాన్ని ప్రచురణ కూడా కానివ్వడం లేదు’’ అని రాహుల్ ఆరోపించారు.నిబంధనల దుర్వినియోగం: కాంగ్రెస్సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీని మోదీ సర్కారు అవహేళన చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. పైగా ఆయన గొంతు నొక్కేందుకు నిబంధనలను కూడా దుర్వినియోగం చేస్తోందంటూ మండిపడింది. నరవణె పుస్తకంలోని నిజాలు వెలుగులోకి వస్తాయన్న భయంతోనే చౌకబారు చేష్టలకు దిగారని కాంగ్రెస్ సీనియర్ నేత కె.సి.వేణుగోపాల్ ఆరోపించారు. ఇది నయా ఫాసిజానికి తిరుగులేని తార్కాణమంటూ ధ్వజమెత్తారు.పార్లమెంటును కించపరిచారువిపక్ష నేత రాహుల్‌గాంధీ తన ప్రవర్తనతో పార్లమెంటు గౌరవానికే భంగం కలిగించారని బీజేపీ దుయ్యబట్టింది. అంతేగాక భారత్–చైనా సరిహద్దు అంశంపై నిరాధారణ ఆరోపణలు, బాధ్యతారహిత వ్యాఖ్యలతో సైనికుల ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బ తీశారంటూ ఆక్షేపించింది. రాహుల్ పూర్తిగా భారత వ్యతిరేక శక్తుల భాష మాట్లాడుతున్నారని మంత్రులు, బీజేపీ నేతలు మండిపడ్డారు. సభలో రాహుల్ ప్రవర్తన భారత్ పరువును మంటగలిపేందుకు పక్కా పథకం ప్రకారం పన్నిన కుట్రలో భాగమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఆరోపించారు. పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. విలువైన సభా సమయాన్ని రాహుల్ వ్యర్థపరిచారని మండిపడ్డారు. ‘‘జాతీయ భద్రతతో ఆటలాడొద్దు. దాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకోవద్దు’’ అంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో భారత భూభాగాన్ని చైనాకు కోల్పోయినందుకు రాహుల్ తక్షణం దేశానికి క్షమాపణ క్షమాపణ చెప్పాలని రిజిజు డిమాండ్ చేశారు. రాహుల్ ఏకంగా నిండు సభలోనే మన దేశ శత్రువుల భాష మాట్లాడుతున్నారంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ మండిపడ్డారు.ఆ పుస్తకంలో ఏముంది?లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ, మంత్రుల నడు మ రగడకు కేంద్ర బిందువుగా మారిన ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణె పుస్తకంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన తన సైనిక జీవితం తాలూకు జ్ఞాపకాలకు ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పేరిట పుస్తక రూపమిచ్చారు. పెంగ్విన్ పబ్లిషింగ్ హౌజ్ దాన్ని ప్రచురించాల్సి ఉంది. అందుకు రక్షణ శాఖ అనుమతి కోసం ఏడాదికి పైగా ఎదురు చూస్తున్నట్టు నరవణె గత అక్టోబర్‌లో పేర్కొన్నారు! ఈ నేపథ్యంలో ఆ పుస్తకంపై ద కారవాన్ మేగజైన్ గత నెలలో కవర్ పేజీ వ్యాసం ప్రచురించింది. రాహుల్ సోమవారం సభలో ఉటంకించింది ఆ వ్యాసంలోని అంశాలనే! తద్వారా, గాల్వాన్ ఘర్షణ వంటి అతి కీలక ఉదంతంపై సరైన నిర్ణయం తీసుకోవడంలో మోదీ సర్కారు తాత్సారం చేసిందని చెప్పేందుకు ఆయన ప్రయత్నించారు.నిర్ణయాన్ని నాకే వదిలారు: నరవణె2020 జూన్15 రాత్రి తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత, చైనా సైనిక దళాల మధ్య భారీ ఘర్షణ జరిగింది. వాటిలో కల్నల్ సంతోష్‌కుమార్‌తో సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనావైపు కూడా భారీగా ప్రాణనష్టం జరిగి నా డ్రాగన్ దేశం ఆ వివరాలను బయ టికి రానివ్వ లేదు. ఆ ఘర్షణల సమయంలో నరవణె ఆర్మీ చీఫ్‌గా ఉన్నారు. ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న వేళ 2020 ఆగస్టు 31న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో తన భేటీ గురించి పుస్తకంలో నరవణె రాశారు. ‘‘(గాల్వాన్ ఉద్రిక్తతలపై) ప్రధాని మోదీతో మాట్లాడానని రాజ్‌నాథ్ నాకు చెప్పారు. ‘అది పూర్తిగా సైనిక నిర్ణయం. మీకు ఏది సరైందనిపిస్తే అలా చేయండి’ అన్నారు. దాంతో బాధ్యతంతా పూర్తి గా నాపైనే పడింది. ‘చైనా దూకుడును అడ్డుకు నేందుకు) నేనే సరైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఏం చేయాలా అని కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపో యాను’’ అని అందులో నరవణె రాసుకొచ్చి నట్టు కారవాన్ వ్యాసం పేర్కొంది. ‘‘పుస్తకం బ్యాక్ కవర్‌పై 1999 కార్గిల్ యుద్ధ సమయంలో ఆర్మీ చీఫ్‌గా చేసిన జనరల్ వి.పి.మాలిక్ రాసిన అభిప్రాయం కూడా ఆసక్తికరంగా ఉంది. ‘గాల్వన్ లోయ ఘర్షణ, దానికి ముందు, తర్వాత జరిగిన పలు ఉదంతాల గురించి పుస్తకంలో రాసిన అంశాలు చదువుతుంటే పాఠకులంతా భావోద్వేగాలతో ఊగిపోవడం ఖాయం’ అని మాలిక్ రాసుకొ చ్చారు’’ అంటూ వ్యాసం ముక్తా్తయించింది. -
యుద్ధమంటే బాలీవుడ్ సినిమా కాదు
పుణె: యుద్ధం, పర్యవసానాలపై భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణె కీలక వ్యాఖ్యలు చేశారు. ‘యుద్ధమంటే సరదా కాదు, బాలీవుడ్ సినిమా అంతకంటే కాదు’అని పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధం నిలిచిపోవడంపై కొందరు చేస్తున్న విమర్శలకు ఆయనీ మేరకు బదులిచ్చారు. ఆదివారం పుణెలో జరిగిన ఒక కార్యక్రమంలో నరవణె మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌తోపాటు పీవోకేలోని ఉగ్ర శిబిరాలు, సైనిక మౌలిక వనరులపై భారత ఆర్మీ దాడులు, ఆ తర్వాత నాలుగు రోజులపాటు వైమానిక దాడులు, సరిహద్దుల్లో కాల్పులతో వారం పాటు దేశంలో ఉద్రిక్త పరిస్థితులు సాగాయని ఆయన తెలిపారు. ‘అనంతరం సైనిక దాడులకు పుల్‌స్టాప్ పెడుతున్నట్లు రెండు దేశాలు ప్రకటనలు చేశాయి. ఇది మిలిటరీ ఆపరేషన్‌కు విరామమే తప్ప, కాల్పుల విరమణ వంటిది మాత్రం కాదని మరోసారి నేను చెప్పాలనుకుంటున్నా. వచ్చే మరికొన్ని రోజుల్లో పరిణామాలు ఎలా మలుపులు తిరుగాయో మీరే చూడండి’అని ఆయన పేర్కొన్నారు. సైనిక దాడులను నిలిపివేయడం మంచిది కాదంటూ కొందరు చేస్తున్న వాదనపై మాట్లాడుతూ ‘యుద్ధంతో కలిగే వ్యయం అంకెలు, గణాంకాలను పరిశీలించండి. ఈ నష్టం మరీ ఎక్కువ కాకముందే, పూడ్చలేనంతగా మారడానికి ముందే యుద్ధాన్ని ఆపేయాలని తెలివైన వారెవరైనా అనుకుంటారు’అని చెప్పారు. దాడుల ద్వారా పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను మాత్రమే కాదు, వైమానిక స్థావరాల్లోని మౌలిక సౌకర్యాలకు సైతం తీవ్రంగా నష్టం కలిగించాం. వైఖరి మారకుంటే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని పాక్ గ్రహించేలా చేయగలిగామని భావిస్తున్నాను. అందుకే పాక్ ఆర్మీ చేసేదిలేక కాల్పుల విరమణ కోసం మన ఆర్మీతో సంప్రదింపుల బేరానికి వచి్చంది’అని ఆర్మీ మాజీ చీఫ్ వివరించారు. రక్షణ వ్యయం కూడా పెట్టుబడే ‘అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి దేశాలు రక్షణ కోసం ఎంత ఖర్చు చేయగలవు? రోజూ టీవీల్లో చూసే సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయాలా? విద్య, ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రత, పారిశుధ్యం, ఇంకా ఇతర చాలా ముఖ్యమైన అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలా?అని ఆయన ప్రశ్నించారు. ‘మన బడ్జెట్లో రక్షణ రంగం వాటా 15 శాతం వరకు ఉంటోంది. ఇదీ ఒక రకమైన పెట్టుబడే. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇలాంటి బ్యాకప్ ప్లాన్ అవసరం. గతవారం ఆపరేషన్ సిందూర్‌తో అటువంటి ప్రణాళిక మనకు ఉందనే విషయం స్పష్టమైంది. రక్షణ బలగాలు సర్వ సన్నద్ధంగా, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటే మనపై దాడి చేయాలనుకునే వాళ్లు ఒకట్రెండు సార్లు ఆలోచిస్తారు’అని ఆర్మీ మాజీ చీఫ్ నరవణె వివరించారు.యుద్ధం చివరి అస్త్రం ఆదేశాలొస్తే వెంటనే కదనరంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నానన్న నరవణె..ఈ విషయంలో తన మొట్ట మొదటి ప్రాధాన్యం దౌత్యానికే ఉంటుందన్నారు. ‘ఇతర దేశాలతో సమస్యలకు చర్చల ద్వారానే పరిష్కారం కనుగొనాలే తప్ప, యుద్ధానికి వెళ్లరాదు, హింస పరిష్కారం కాదు’అని కుండబద్దలు కొట్టారు. ‘యుద్ధం ఆషామాషీ కాదు. మన బాలీవుడ్ సినిమా కాదు. చాలా సీరియస్ వ్యవహారం. చిట్టచివరి అవకాశం లేక అస్త్రంగా మాత్రమే యుద్ధానికి దిగాల్సి ఉంటుంది. ఇది యుద్ధాల శకం కాదని మన ప్రధాని మోదీ చెప్పింది ఇందుకే. కొందరు మూర్ఖులు యుద్ధాన్ని మనపై రుద్దారు. యుద్ధంపై మనం ఉత్సాహం చూపరాదు’అని ఆయన అన్నారు.సామాజిక కోణం మరువరాదు యుద్ధంతో వాటిల్లే నష్టాల్లో సామాజికపరమైన కోణం కూడా ఉందన్న జనరల్ నరవణే..‘ఇతరత్రా నష్టాలతోపాటు యుద్ధంతో ప్రాణ నష్టం సైతం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులను కోల్పోయే చిన్నారులుంటారు. ఇటువంటి నష్టాన్ని ఎవరూ పట్టించుకోరు. సన్నిహితులను కోల్పోయిన వారిని ఆ ఆవేదన జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. యుద్ధ దృశ్యాలను దగ్గర్నుంచి చూసేవారు పీటీఎస్డీ అనే మానసిక రుగ్మత బారినపడతారు. దీన్నుంచి బయటపడేందుకు కనీసం 20 ఏళ్లపాటు వీరికి చికిత్స కొనసాగించాల్సి ఉంటుంది’అని వివరించారు.


