సభలో రచ్చరచ్చ | US trade deal sparks war of words in Loksabha | Sakshi
Sakshi News home page

సభలో రచ్చరచ్చ

Feb 5 2026 4:23 AM | Updated on Feb 5 2026 4:23 AM

US trade deal sparks war of words in Loksabha

ఆగని విపక్షాల ఆందోళన 

అమెరికాతో ఒప్పందం, నరవణే పుస్తకంపై సమాధానం చెప్పాలని డిమాండ్‌  

ప్రధాని మోదీ స్థానాన్ని చుట్టుముట్టిన ప్రతిపక్ష సభ్యులు 

పరిస్థితి అదుపులో లేకపోవడంతో సభకు గైర్హాజరైన మోదీ  

న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందం, మాజీ ఆర్మీ చీఫ్‌ ఎం.ఎం.నరవణే పుస్తకంపై లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు బుధవారం సైతం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశ ప్రజలకు నిజాలు బహిర్గతం చేయాలని పట్టుబట్టారు. సభలో బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించాల్సి ఉండగా, ఆయన సభకు హాజరు కాలేదు. 

ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు ప్రారంభించారు. శాంతించాలంటూ స్పీకర్‌ విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోలేదు. దాంతో స్పీకర్‌ సభను ఉదయం 11 గంటల దాకా వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యుల ఆందోళన ఆగలేదు. ప్రభుత్వం సమాధానం చెప్పేదాకా విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. విపక్ష ఎంపీలు తొలుత వెల్‌లో బైఠాయించారు. 

అనంతరం బ్యానర్లు ప్రదర్శిస్తూ అధికార పక్ష సభ్యులవైపు దూసుకొచ్చారు. నరవణే పుస్తకంపై సభలో రాహుల్‌ గాం«దీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వారి తీరును కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌, అమిత్‌ షా తప్పుపట్టారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ మధ్యాహ్నం 12 గంటల దాకా, తర్వాత 2 గంటల దాకా వాయిదా వేశారు. మరో వాయిదా తర్వాత 5 గంటలకు సభ మళ్లీ ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాలేదు.

 ఈ సమయంలోనే ప్రధాని ప్రసంగించాల్సి ఉంది. కాంగ్రెస్‌ మహిళా ఎంపీ వర్షా గైక్వాడ్‌ సహా మరికొందరు మహిళా సభ్యులు ప్రధాని కూర్చొనే స్థానం వద్దకొచ్చి ఘోరావ్‌ చేశారు. అప్పుడు మోదీ సభలో లేరు. వెనక్కి రావాలంటూ కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కోరినా విపక్ష సభ్యులు పట్టించుకోలేదు. పరిస్థితి సద్దుమణగకపోవడంతో స్పీకర్‌ స్థానంలో ఉన్న సంధ్యా రాయ్‌ సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు.  పరిస్థితి అదుపులో లేకపోవడం వల్లనే మోదీ సభకు రాలేదని బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ చెప్పారు.  

రాహుల్‌కు పోటీగా దూబే పుస్తక ప్రదర్శన..
మధ్యాహ్నం 2 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే ‘ఎడ్వినా అండ్‌ నెహ్రూ’, ‘మిత్రోఖిన్‌ ఆర్కైవ్‌’ అనే పుస్తకాలను సభలో ప్రదర్శిస్తూ వాటి గురించి ప్రస్తావించడంతో వివాదం మొదలైంది. దివంగత ప్రధానమంత్రులు నెహ్రూ, ఇందిరా గాం«దీ, రాజీవ్‌ గాంధీపై ఆయన విమర్శలు చేశారు. వారు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అయితే, సభలో పుస్తకాల గురించి ప్రస్తావించడానికి వీల్లేదని సభాపతి స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్‌ తెన్నేటి స్పష్టంచేశారు. నిషికాంత్‌ దూబ్‌ తీరుపై మండిపడుతూ కాంగ్రెస్‌ సహా ఇతర విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో సభాపతి లోక్‌సభను సాయంత్రం 5 గంటల దాకా వాయిదా వేశారు. తర్వాత కాంగ్రెస్‌ ఎంపీలు స్పీకర్‌ ఓం బిర్లాను కలిశారు. నిషికాంత్‌ దూబేపై సస్పెన్షన్‌ వేటు వేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement