ఆ రెండు పుస్తకాలు ఒక్కటి కావు | Announced and published book not same: Penguin fresh clarification amid Naravane memoir row | Sakshi
Sakshi News home page

ఆ రెండు పుస్తకాలు ఒక్కటి కావు

Feb 11 2026 3:58 AM | Updated on Feb 11 2026 3:58 AM

Announced and published book not same: Penguin fresh clarification amid Naravane memoir row

జనరల్‌ నరవణె రాసిన పుస్తకాన్ని ఇంకా ప్రచురించలేదు 

ప్రచురణ సంస్థ పెంగ్విన్‌ ర్యాండమ్‌ స్పష్టికరణ

న్యూఢిల్లీ: చైనా బలగాలతో భారత సైన్యం పోరాటానికి సంబంధించి పలు వివాదాస్పద అంశాలను ప్రస్తావిస్తూ భారత ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె రాసిన ‘ఫోర్‌ స్టార్స్‌ ఆఫ్‌ డెస్టినీ’పుస్తకం చర్చనీయాంశం కావడంతో దాని ప్రచురణసంస్థ ‘పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ఇండియా’మంగళవారం స్పష్టతనిచ్చింది. ఆ పుస్తకాన్ని ఇప్పటిదాకా ముద్రించలేదని, ఆన్‌లైన్‌ వేదికలపై ప్రత్యక్షమైనదంతా అనధికార కాపీ అని పెంగ్విన్‌ ర్యాండమ్‌ వెల్లడించింది. ఈ మేరకు సంస్థ మంగళవారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ప్రీ–ఆర్డర్‌ అని పేర్కొన్నంత మాత్రాన అది ఇప్పటికే ముద్రితమై అమ్మకానికి సిద్ధంగా ఉందని కాదు. త్వరలో ప్రచురితంకావొచ్చు అని అర్థం. అంతేగానీ పుస్తకం ముద్రించామని మేం ఎక్కడా పేర్కొనలేదు’’అంటూ పుస్తకాలకు సంబంధించి తాము అనుసరించే 4 విధానాలను పెంగ్విన్‌ ర్యాండమ్‌ వివరించింది. అవి.. 

1. కొత్త పుస్తకాన్ని ప్రకటించం: అంటే కొత్త రచన, నూతన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం జరిగిందని అర్థం. అంతేగానీ ఈ పుస్తకం ఇప్పటికే ముద్రితమైందని కాదు. అది ఇంకా ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకికూడా రాదు. 

2. ప్రీ–ఆర్డర్‌: ఇది ప్రచురణకు సంబంధించిన ప్రామాణిక అనుసరణీయ విధానం. నచి్చతే పాఠకులు లేదా రిటైల్‌ సంస్థలు త్వరలో ప్రచురితంకాబోయే ఈ పుస్తకం కోసం ఆర్డర్లు పెట్టుకోవచ్చు. ఈ దశలోనూ పుస్తకం ముద్రితంకాదు. అందుబాటులో ఉండదు. 

3. రాబోయే తేదీ ఖరారు: ఫలానా తేదీన పుస్తకాన్ని ఆవిష్కరించాలని నిర్ణయం జరిగిదంతే. అంతమాత్రాన ఆరోజుకల్లా పుస్తకం ముద్రితమైపోతుందని అర్థంకాదు. 

4.ముద్రిత పుస్తకం: విక్రయాల కోసం రిటైల్‌ దుకాణాల్లోకి వచ్చాకే ఆ పుస్తకం అధికారికంగా ముద్రితమైందని భావించాలి. 

పుస్తకాన్ని ఏరకంగానూ విడుదల చేయలేదు: పెంగ్విన్‌
‘‘నరవణె రాసిన ఈ పుస్తకాన్ని ప్రింట్‌ లేదా డిజిటల్‌ లేదా పీడీఎఫ్‌ ఇలా ఏ ఫార్మాట్‌లోనూ అందుబాటులోకి తేలేదు. ఒక్క పుస్తకాన్ని కూడా ముద్రించలేదు. ఎవరికీ విక్రయించలేదు. ఆన్‌లైన్‌ వేదికలపై ప్రత్యక్షమైనదంతా అనధికార వెర్షన్‌ మాత్రమే. దానితో మాకు సంబంధం లేదు. పుస్తకం ప్రచురణ హక్కులు మాకే ఉన్నాయి. పుస్తకాన్ని ఏ రూపంలోనూ మేం పంపిణీ చేయలేదు. బహిర్గతంచేయలేదు. ప్రస్తుతం ప్రింట్, డిజిటల్, పీడీఎఫ్‌ రూపాల్లో షేర్‌ అవుతుంటేగనక అది పూర్తిగా మా సంస్థ కాపీరైట్‌ హక్కులను ఉల్లంఘించినట్లే లెక్క. ఈ అంశంలో మేం చట్టపర చర్యలు తీసుకుంటున్నాం’’అని సంస్థ స్పష్టం చేసింది. 

మౌనం వీడిన నరవణె 
పుస్తకం వివాదం కావడంతో ఎట్టకేలకు నరవణె మౌనం వీడారు. ఈ పుస్తకం ఇంకా ప్రచురితంకాలేదని ఆయన స్పష్టంచేశారు. ఈ మేరకు సోమవారం పెంగ్విన్‌ ఇండియా సంస్థ వెల్లడించిన ఒక ప్రకటనను నరవణే మంగళవారం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్‌’ఖాతాలో పోస్ట్‌చేశారు. ‘‘పుస్తకం తాజా స్థితి ఇదే’’అని దానికి ఒక క్యాప్షన్‌ పెట్టారు.  

పుస్తకమొచ్చిందని రెండేళ్ల క్రితమే చెప్పారు: రాహుల్‌
పుస్తకం ప్రచురితంకాలేదన్న పెంగ్విన్‌ వాదనల్లో నిజంలేదంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. మంగళవారం పార్లమెంట్‌ ప్రాంగణంలో మీడియాతో రాహుల్‌ మాట్లాడారు. గతంలో నరవణే చేసిన ట్వీట్‌ను రాహుల్‌ అందరిఎదుట బయటకు చదివి వినిపించారు. ‘‘హలో ఫ్రెండ్స్‌. నేను రాసిన పుస్తకం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇక్కడున్న లింక్‌ను క్లిక్‌చేసి చదవండి. ఆనందంగా పఠనం పూర్తిచేయండి. జైహింద్‌ అని నరవణె రాసుకొచ్చారు. ఇది డిసెంబర్‌ 2023లో నరవణె ఆయన ‘ఎక్స్‌’ఖాతాలో పోస్ట్‌చేశారు. పుస్తకం అసలు ప్రచురితంకాలేదని పెంగ్విన్‌ చెబుతోంది. కానీ ఇప్పటికే ఈ పుస్తకం అమెజాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది’’అని రాహుల్‌ అన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement