ఏఐ, డీప్‌ఫేక్‌ కంటెంట్‌పై కేంద్రం ఆంక్షల కొరడా | Government Notifies 3-Hour Takedown Rule for Deepfakes and AI Content | Sakshi
Sakshi News home page

ఏఐ, డీప్‌ఫేక్‌ కంటెంట్‌పై కేంద్రం ఆంక్షల కొరడా

Feb 11 2026 3:48 AM | Updated on Feb 11 2026 3:48 AM

Government Notifies 3-Hour Takedown Rule for Deepfakes and AI Content

కోర్టులు ఆదేశిస్తే తప్పుడు కంటెంట్‌ను 3 గంటల్లోగా తొలగించాలి

ప్రతి ఏఐ కంటెంట్‌పై లేబుల్‌ ఉండాలి

సామాజిక మాధ్యమ వేదికలకు కేంద్రం సూచన

న్యూఢిల్లీ: యూట్యూబ్, ఎక్స్‌ వంటి సామాజిక మాధ్యమ వేదికల్లో తామరతుంపరలా పుట్టుకొస్తూ విస్తృతంగా షేర్‌ అవుతున్న ఏఐ కంటెంట్, డీప్‌ఫేక్‌ అంశాల ఉరవడికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షల కొరడా ఝుళిపించింది. కృత్రిమమేథ(ఏఐ) సృష్టించిన సమాచారం(కంటెంట్‌)తోపాటు అసలును భ్రమింపజేసేలా ఉండే డీప్‌ఫేక్‌ కంటెంట్‌ విస్తృతిని అరికట్టేందుకు మోదీ సర్కార్‌ నిబంధనలను కఠినతరం చేసింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఇంటర్మీడియేటరీ గైడ్‌లైన్స్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా ఎథిక్స్‌ కోడ్‌) రూల్స్,2021లో సవరణలు చేస్తూ కేంద్ర  ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదలచేసింది.

దీని ప్రకారం ఇకపై ప్రభుత్వం లేదా న్యాయస్థానాలు ఫలానా అభ్యంతర, అసభ్య, తప్పుడు ఏఐ/డీప్‌ఫేక్‌ కంటెంట్‌ను ఆన్‌లైన్‌ నుంచి తొలగించాలని ఆదేశిస్తే సోషల్‌మీడియా వేదికలు కేవలం మూడు గంటల్లోపే వాటిని తొలగించాలి. గతంలో 36 గంటల గడువు ఉండేది. ఇతర కంటెంట్‌లకు సంబంధించి గడువులను కొన్నింటికి 15 రోజుల నుంచి ఏడు రోజులకు తగ్గించగా మరికొన్నింటికి 24 గంటల నుంచి 12 గంటలకు గడువు తగ్గించారు. పూర్తి/పాక్షిక నగ్నత్వం లేదా శృంగార సంబంధ, ప్రైవేట్‌భాగాలను చూపించే కంటెంట్‌ను కేవలం 2 గంటల్లోపే తొలగించాలి ప్రభుత్వం నిబంధనను తీసుకొచ్చింది. ఏఐ టూల్స్‌ సాయంతో సృష్టించిన ఎలాంటి కంటెంట్‌కైనా దానిపై ‘ఏఐ జనరేడెడ్‌’అనే లేబుల్‌ను ముద్రించాలి. ఆ సమాచారాన్ని తాము సృష్టించారో లేదా ఏఐ సాయంతో మార్పులు చేశారో స్పష్టంగా పేర్కొనాలి. 

వెరిఫికేషన్‌ మెకానిజం తేవాలి.. 
హానికర, చట్టవ్యతిరేక కంటెంట్‌ను మూడుగంటల్లోపే ఆన్‌లైన్‌ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలి. ఏదైనా కంటెంట్‌ను ఎవరైనా అప్‌లోడ్‌ చేస్తే అది వాళ్లు తయారుచేసిందా? లేదా మరొకరి నుంచి కాపీ కొట్టారా? అనేది రూఢీచేసుకునేందుకు వీలుకలి్పంచే టూల్స్, వెరిఫికేషన్‌ మెకానిజంను సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి తేవాలి. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టడంతోపాటు డీప్‌ఫేక్‌కు చెక్‌పెట్టేందుకే ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. వీటిని ఫిబ్రవరి 20వ తేదీ నుంచి అమల్లోకి తెస్తారు. ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు’అదే తేదీన ముగుస్తుండటం విశేషం.

ఏఐ కంటెంట్‌ లేదా ఏఐతో మార్పులుచేసిన ఆడియో, వీడియో, ఆడియో–వీడియో కంటెంట్‌ను సింథటికల్లీ జనరేటెడ్‌ ఇన్ఫర్మేషన్‌(ఎస్‌జీఐ)గా పరిగణిస్తారు. ఈ కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో చూసిన యూజర్లు ఇది నిజమైనదా? కల్పనా? అనేది తెల్సుకునేందుకు ఆ కంటెంట్‌పై ఖచి్చతంగా ఏఐ లేబుల్‌ను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇంటర్మీడియేటరీ సంస్థలు ఈ లేబుల్‌ను తొలగించడానికి వీల్లేకుండా మెటాడేటా/టెక్నికల్‌ ప్రూవెన్స్‌ మార్కర్‌లను శాశ్వతంగా ముద్రించాలని పేర్కొంది. అప్పుడే అది ఎక్కడి నుంచి తొలుత షేర్‌ అయిందనేది తెలుస్తుంది. దాంతో అలాంటి ఏఐలో చట్టవ్యతిరేక సమాచారముంటే తొలిసారి షేర్‌చేసిన వ్యక్తి/సంస్థను గుర్తించడం అత్యంత సులభమవుతుంది.  

యూజర్‌ డిక్లరేషన్‌ ఉండాల్సిందే
తొలిసారిగా అప్‌లోడ్‌ చేసిన వ్యక్తి/సంస్థ/యూజర్‌ సంబంధిత కంటెంట్‌పై డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందే. సింథటిక్‌గా సృష్టించిందా లేదా ఏఐతో మార్పులు చేసిందా? అనేది పేర్కొనాలి. అయితే ఈ డిక్లరేషన్‌లు నిజమైనవా కావా ? అని సరిచూసుకునే టెక్నికల్‌/ఆటోమేటెడ్‌ టూల్స్‌ను సామాజికమాధ్యమ వేదికలు అందుబాటులోకి తేవాలి. లేబులింగ్‌ లేదా వెరిఫికేషన్‌ జరగని పక్షంలో సంబంధిత డేటాపై సామాజికమాధ్యమ వేదికలదే బాధ్యత అవుతుందని ప్రభుత్వం హెచ్చరించింది.  

చట్టవ్యతిరేకమైనదంతా నేరమే
చట్టవ్యతిరేక కార్యకలాపాల కోసం సృష్టించబడే ఏఐ కంటెంట్‌ను ఇకపై నేరమయ కంటెంట్‌గా పరిగణిస్తారు. చిన్నారులపై లైంగికవేధింపుల మెటీరియల్, అసభ్య కంటెంట్, గొప్ప వ్యక్తిని కించపరుస్తూ ఆయన ప్రతిరూపాలు తయారుచేయడం, తప్పుడు ఎల్రక్టానిక్‌ రికార్డ్‌లు సృష్టించడం, ఆయుధాలు, పేలుడు పదార్థాల వంటి అక్రమ వస్తువులను ప్రోత్సహించే ఎలాంటి కంటెంట్‌ను అయినా నేరమయ కంటెంట్‌గా లెక్కించి కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే కృత్రిమ కంటెంట్‌ను ఎప్పటికప్పుడు ఆటోమేటెడ్‌ టూల్స్‌తో తొలగించే బాధ్యతాయుత సంస్థలకు ఐటీ చట్టంలోని 79 సెక్షన్‌ ప్రకారం రక్షణ లభిస్తుందని కేంద్రం భరోసా ఇచి్చంది. కంప్యూటర్‌ ఆధారిత, చాట్‌జీపీటీ, గ్రోక్, జెమినిలతో కృత్రిమ, అల్గారిథంతో సృష్టించిన, ఎడిట్‌ చేసిన, మార్పులుచేసిన, అవాస్తవ ఫొటో లు, ఆడియో, విజువల్, ఆడియో–విజువల్‌ కంటెంట్‌ మొత్తాన్నీ ఏఐగా పరిగణస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement