పూర్తయిన ప్రత్యేక సవరణ ప్రక్రియ
తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన ఈసీ
గౌహతి: అస్సాంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పూర్తయింది. తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రచురించింది. 2.43 లక్షల ఓటర్ల పేర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించారు. తుది జాబితాలో 2.49 కోట్ల మంది ఓటర్లకు స్థానం కల్పించారు. ముసాయిదా జాబితాతో పోలిస్తే 0.97 శాతం ఓటర్లు తగ్గిపోయినట్లు అస్సాం చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈఓ) ఒక ప్రకటనలో వెల్లడించారు.
తుది జాబితాలో 1.25 కోట్ల మంది పురుషులు, 1.24 కోట్ల మంది మహిళలున్నారు. గత ఏడాది డిసెంబర్ 27న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 2.52 కోట్ల మంది ఓటర్లు ఉండగా, తుది జాబితాలో 2.49 కోట్ల మంది ఉన్నారు. అస్సాంలో మరికొన్ని నెలల్లో తాజా జాబితా ఆధారంగానే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అర్హుల పేర్లు గల్లంతైతే దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ సూచించింది.


