కాంగ్రెస్ నిర్వాకాల వల్ల అస్సాం జనాభా స్థితిగతుల్లో మార్పులు
చొరబాటుదార్ల సంఖ్య ఏకంగా 64 లక్షలకు చేరుకుంది
వారి నుంచి విముక్తి లభించాలంటే బీజేపీని గెలిపించాలి
అస్సాం బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు
గౌహతి: అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చొరబాటుదార్లు విచ్చలవిడిగా ప్రవేశించారని, రాష్ట్రంలో జనాభా స్థితిగతుల్లో ప్రతికూల మార్పులు వచ్చాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. అస్సాం నుంచి చొరబాటుదార్లను బయటకు పంపించి, స్థానికులను రక్షించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. శుక్రవారం అస్సాం రాష్ట్రం ధెమాజీ జిల్లాలో మిసింగ్ తెగ ప్రజల యువజన వేడుక ముగింపు కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం దిబ్రూగఢ్‌లో పర్యటించారు. రూ.1,715 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించారు.
చొరబాటుదార్ల నుంచి రాష్ట్రానికి పూర్తిస్థాయిలో విముక్తి లభించాలంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకాల వల్ల ఇక్కడ చొరబాటుదార్ల సంఖ్య ఏకంగా 64 లక్షలకు చేరుకుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఏడు జిల్లాల్లో వారే మెజార్టీగా ఉన్నారని చెప్పారు. ఈ ధోరణి మారాలంటే బీజేపీని గెలిపించాలని స్పష్టంచేశారు. అస్సాంలో జనాభా స్థితిగతులను పూర్వస్థితికి తీసుకురావాలన్నదే మోదీ ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. చొరబాటుదార్ల నుంచి విముక్తి కల్పించడం బీజేపీతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రికి మరింత బలం ఇవ్వాలి
‘‘చొరబాట్లు ఆగాలని ప్రజలు నిజంగా కోరుకుంటే మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. చొరబాట్లకు వ్యతిరేకంగా పోరాడేందుకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు మరింత బలం ఇవ్వాలి. రాష్ట్రంలో బీజేపీ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. 1.26 లక్షల ఎకరాల భూములను చొరబాటుదార్ల నుంచి కాపాడింది. మిసింగ్ తెగ ప్రజలు కష్టజీవులు. శ్రమించడం వారి సంస్కృతిలోనే ఉంది. ఎగువ అస్సాంలోకి చొరబాటుదార్లు ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది.
బ్రహ్మపుత్ర నదిపై బోగిబీల్ వంతెనను నిర్మించింది. దీనివల్ల దిబ్రూగఢ్, ధెమాజీ మధ్య అనుసంధానం పెరిగింది. భారతదేశ ప్రగతికి ఈ వంతెన ఒక ప్రతీకగా నిలుస్తోంది. దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అస్సాం నుంచి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. కానీ, బోగిబీల్ వంతెన నిర్మాణం పూర్తిచేయలేదు. నరేంద్ర మోదీ పట్ల రాష్ట్ర ప్రజలు విశ్వాసం కనబర్చారు. అందుకే వంతెన నిర్మాణం నాలుగేళ్లలో విజయవంతంగా పూర్తయ్యింది’’ అన్నారు.
రాహుల్ అవమానించడం దారుణం
ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అవమానించడం దారుణం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన ‘ఎట్‌హోం’ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందజేసిన ‘గమోసా’ను ధరించడానికి రాహుల్ నిరాకరించారు. దేశ విదేశీ ప్రముఖులు ఆ కండువాను గౌరవపూర్వకంగా ధరిస్తే రాహుల్ మాత్రం ధరించకుండా అగౌరవపర్చారు. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని కించపరిస్తే బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోదు. అస్సాం అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. తుపాకులు, తూటాలు, ఘర్షణలు, మరణాలు తప్ప అస్సాంకు కాంగ్రెస్ ఇచ్చిందేమిటో చెప్పాలి. ఆ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసింది. అందుకోసం చొరబాట్లను ఆయుధంగా ఉపయోగించుకుంది.
బీజేపీ అధికారంలోకి వచ్చాక చొరబాట్లకు అడ్డుకట్ట పడింది. చట్టవిరుద్ధంగా మనదేశంలోకి ప్రవేశించినవారిని గుర్తించి, కచ్చితంగా వెనక్కి పంపిస్తాం. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తోంది. యూరోపియన్ యూనియన్‌తో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో అస్సాం తేయాకు పరిశ్రమకు, కారి్మకులకు లబ్ధి చేకూరుతుంది. ఇక్కడ నుంచి యూరప్ దేశాలకు తేయాకు ఎగుమతులు పెరుగుతాయి. అభివృద్ధి, శాంతి, రక్షణ, పారిశ్రామిక, వ్యవసాయ ప్రగతి కావాలంటే మరోసారి బీజేపీకి పట్టం కట్టాలి. చొరబాట్లు, వరదల నుంచి అస్సాంను కాపాడే సత్తా బీజేపీకి మాత్రమే ఉంది’’ అని అమిత్ షా తేలి్చచెప్పారు.
అన్ని సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు సమానమే
‘‘కాంగ్రెస్ పాలనలో గిరిజన తెగలు అస్థిత్వ సమస్యను ఎదుర్కొన్నారు. సొంత గుర్తింపును కాపాడుకొనేందుకు పోరాడాల్సి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వారికి భద్రత లభిస్తోంది. పారామిలటరీ దళాల్లో నియామకాల విషయంలో గిరిజన యువతకు ప్రాధాన్యమిస్తాం. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, భాషలకు మరింత గుర్తింపు దక్కాల్సి ఉంది. వేర్వేరు సంస్కృతుల సమ్మేళనం వల్లనే భారతదేశ సంస్కృతి మరింత వికసిస్తుంది. దేశంలో అన్ని రకాల సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలకు సమాన హక్కులున్నాయి. అవన్నీ సమానమే’’ అని అమిత్ షా చెప్పారు.


