జీవితంలో పెను సవాళ్లు నడవాలనుకున్న మార్గంలో ఎదురుగాలులు... అయినా వాళ్లు ఆగలేదు... ముందుకు సాగారు. సవాళ్లను సోపానాలుగా చేసుకున్నారు. అందుకే వారికి నేడు జాతీయ గౌరవంగా ‘పద్మశ్రీ’ దక్కింది. అస్సాం గాయని పోఖిలా లెఖ్తెపి, యాసిడ్ ఆటాక్‌ను ఎదుర్కొని ప్రొఫెసర్‌గా స్ఫూర్తినిస్తున్న మంగళా కపూర్‌ల జీవన విశేషాలు.
పోఖిలా లెఖ్తెపి కొండ మీద తేనె పాట
కొండలకు పాటలు తెలుసు. కొండలు పాడతాయి. కాని వాటిని గొంతులో నింపుకుని జనానికి పంచేవారే కావాలి. అలాంటి కొండ మీద తేనె పాటే పోఖిలా లెఖ్తెపి. అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో గత ఐదు దశాబ్దాలుగా ‘స్వరాల రాణి’గా పేరుగాంచిన పోఖిలా లెఖ్తెపికి ‘పద్మశ్రీ’ ప్రకటించడం కొంచెం ఆలస్యమైనట్టే. ఆ మాటకొస్తే ఈ 72 ఏళ్ల జానపద గాయనికి ఈ గౌరవాలు, సత్కారాలు ఏమీ పట్టవు. పాట పాడటమే ఆమెకు తెలుసు. పాట వినిపించడమే ఆమె జీవితం.
తండ్రి వద్ద పాటలు నేర్చుకొని..
అస్సాంలోని ఆంగ్లాంగ్ జిల్లా దుపార్ టిముంగ్ గ్రామంలో పోఖిలా జన్మించారు. తండ్రి ముఖిమ్ లేక్తే, తల్లి బాస్డే టిముపి బాగా పాడతారు. ముఖిమ్ లేక్తే ఆ రోజుల్లో గ్రామాల్లో ప్రదర్శించే నాటకాలలో సంగీతం అందించేవారు. అలా పోఖిలా చిన్న వయస్సులోనే సంగీతం పట్ల ఆకర్షితురాలైంది. బడిలో ప్రతి శనివారం పాటల పోటీ తండ్రి వద్ద పాటలు నేర్చుకుని పాడితే ప్రెయిజులన్నీ ఆమెకే. ఆ ఉత్సాహంతో తనే సొంతంగా పాటలను స్వరపరచడం ప్రారంభించారు. 1976లో డిఫులో జరిగిన కర్బీ యువజనోత్సవంలో పాడినప్పుడు మొత్తం అస్సాంకు ఆమె పాట తెలిసింది. 1978 నాటికి ఎంత గుర్తింపు వచ్చిందంటే ఆకాశవాణి గౌహతిలోని కర్బీ శాఖ డైరెక్టర్ ఆమెకు రేడియోలో పాడే అవకాశాన్ని కల్పించారు.
కర్బీ భాషలో కొత్త శైలి...
పోఖిలా పాడే సమయానికి కర్బీ భాషలో ఆధునిక పాటలు లేవు. పోఖిలా కర్బీ భాషలో మొదటి క్యాసెట్ ‘కాంగ్‌హోన్’ విడుదల చేశారు. అనంతరం జుబీన్ గార్గ్ సహా అస్సాంకు చెందిన పలువురు కళాకారులతో కలిసి ఆమె పాటలు పాడారు. ఇప్పటి వరకు 300కి పైగా పాటలు పాడారు. కర్బీ పాటలకు దేశవ్యాప్తంగా ప్రజాదరణ తీసుకురావడంలో ఆమె కృషి విశేషమైనది. కర్బీ సంగీతానికి ఆమె చేసిన సేవకు గాను 2011లో హిల్స్ ఐడల్ ‘క్వీన్ ఆఫ్ మెలోడీ’ బిరుదుతో సత్కరించింది. 2023 అస్సాం ప్రభుత్వం ఆమెకు శిల్పి అవార్డుతోపాటు శిల్పి పెన్ష¯Œ ను ప్రదానం చేసింది. 2024లో అస్సాంలో మూడో అత్యున్నత ΄ûర పురస్కారమైన ‘అస్సాం గౌరవ్’ అవార్డును అందించింది. కర్బీ ఆంగ్లాంగ్ వంటి మారుమూల ప్రాంతానికి చెందిన తనలాంటి గాయనిని కేంద్ర ప్రభుత్వం సత్కరించడం సంతోషకరమైన విషయం అని ఆమె అంటున్నారు.
మంగళా కపూర్ యాసిడ్ దాడిని పాటతో ఓడించారు
యాసిడ్ దాడి పిరికివాళ్ల చర్య. దానిని ఎదుర్కొని ఎదగడం స్థైర్యవంతుల లక్షణం. ప్రయాణం ముగిసిపోయినట్టే అని అందరూ అనుకున్నప్పుడు గొప్ప ప్రయాణాన్ని తిరిగి మొదలుపెట్టారు మంగళా కపూర్. సంగీత సాధన చేసి సంగీత విద్వాంసురాలిగా మారారు. ‘పద్మశ్రీ’ వరకూ ఎదిగారు. ఇది అసాధారణ కథ. స్ఫూర్తి గాథ.
గ్వాలియర్ ఘరానాకు చెందిన శాస్త్రీయ గాయని మంగళా కపూర్ 1965లో యాసిడ్ దాడి ఎదుర్కొన్నారు. అప్పటి వరకూ అద్భుతమైన తన కంఠంతో ఆమె ‘కాశీ లతా మంగేష్కర్’గా గుర్తింపు పొందారు. సంగీత రంగంలో ఎన్నో కలలు కంటూ ఉండగా యాసిడ్ దాడి జరిగింది. ఫలితంగా ఆరు సంవత్సరాలు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. అయినా కుంగిపోలేదు. ఆ సమయంలో కూడా చదువును కొనసాగించి బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంగీత విద్య పూర్తి చేశారు.
అక్కడే ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. మంగళా కపూర్ సంగీతం ప్రొఫెసర్ మాత్రమే కాదు, సామాజిక సేవలోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. సమాజంలోని వెనుకబడిన వర్గాల పిల్లల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఆమెకు అనేక అవార్డులు వరించాయి. రాజ్యసభ ఆమెకు ‘రోల్ మోడల్’ అవార్డును ప్రదానం చేసింది. ఆమె జీవితం ఆధారంగా 2025లో మరాఠీ చిత్రం ‘మంగళ’ నిర్మించారు. సంగీతం, విద్య ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకు రాగలమని మంగళా కపూర్ అంటున్నారు.


