మలయాళ సింగర్ అమృత సురేశ్‌కు ప్రేమ కలిసి రావడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త (నటుడు బాల) కూతురు పుట్టాక విడాకులు తీసుకున్నాడు. ఆ సమయంలో ఒంటరితనంతో కుమిలిపోతున్న తనకు మ్యూజిక్ కంపోజర్ గోపీ సుందర్ దగ్గరయ్యాడు. కానీ, ఇది కూడా మూణ్నాళ్ల ముచ్చటే అయింది. ఈ జంట కొంతకాలానికే బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే గోపీ సుందర్ తాను జీవితంలో మర్చిపోలేని ఓ పని చేశాడంటోంది.
ప్రియుడి తల్లిని..
అమృత సురేశ్ మాట్లాడుతూ.. కొన్నేళ్లపాటు నరకం, బాధ అనుభవించిన సమయంలో గోపీ సుందర్ నాకు సపోర్ట్‌గా నిలబడ్డాడు. మేము ఎంతో బాగా కలిసిపోయాం. ఎంతలా అంటే అతడి తల్లిని కూడా నేను నా తల్లిగానే భావించాను. అంతలా ఆ కుటుంబాన్ని ప్రేమించాను. ఇప్పటికీ అతడి కుటుంబంపై ప్రేమ అలాగే ఉంది. మా రిలేషన్‌షిప్ ఎప్పటికీ ఇలాగే కొనసాగాలనుకున్నాం. కానీ, అది జరగలేదు. అలా అని అతడెప్పుడూ నన్ను బాధపెట్టలేదు.
అల్లుడి స్థానంలో నిలబడి
మా నాన్న చనిపోయినప్పుడు ఒక కొడుకులా ముందు నిలబడి అంత్యక్రియలు జరిపించాడు. మా నాన్న చితికి అల్లుడి స్థానంలో నిలబడి నిప్పు పెట్టాడు. అది నేనెప్పటికీ మర్చిపోలేను. కానీ రానురానూ మేము కలిసి ఉండటం కష్టమని అర్థమైంది. గొడవపడుతూ కలిసుండటం కన్నా అర్థం చేసుకుని విడిపోవడమే మంచిదని భావించాం. ఇద్దరం విడిపోయాం. బర్త్‌డే, పండగల సమయంలో మాత్రం ఒకరినొకరం విష్ చేసుకుంటాం అని చెప్పుకొచ్చింది.
పెళ్లి
అమృత సురేశ్ గతంలో నటుడు బాలాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2010లో వివాహం చేసుకున్న వీరిద్దరికీ 2012లో కూతురు అవంతిక జన్మించింది. 2015లో భార్యాభర్తలిద్దరూ విడివిడిగా జీవిస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. చివరకు అవే నిజం చేస్తే 2019లో వీరు విడాకులు తీసుకున్నారు.


