పాత్రకు తగ్గట్లుగా తన శరీరాన్ని మార్చుకొనే అతి కొద్దిమంది నటుల్లో మంచు మనోజ్ ఒకరు. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తుంటాడు. బాక్సాఫీస్ వద్ద ఫలితం ఎలా ఉన్నా సరే.. ఆయన నటనకు మాత్రం ఎప్పుడూ నెగెటివ్ కామెంట్స్ రాలేదు. గతకొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమైన మనోజ్.. మిరాయ్ సినిమాతో గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన శక్తివంతమైన విలన్ పాత్ర అయిన మహాబీర్ లామా..‘బ్లాక్ స్వోర్డ్’గా కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా మనోజ్ చేసిన పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్‌కు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు లభించాయి.
ఇప్పుడు మంచు మనోజ్ మరో వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అదే డేవిడ్ రెడ్డి. తన కెరీర్‌లో అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా ఇది రూపొందుతోంది. ఈ భారీ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామాను హనుమ రెడ్డి యెక్కంటి తెరకెక్కిస్తున్నారు. నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోతుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకోసం మనోజ్ తన లుక్‌ని మార్చేస్తున్నాడు. యోధుడిలా కనిపించేందుకు మూడు వారాలుగా కఠినంగా శ్రమిస్తున్నానంటూ వర్కౌట్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
ఆ పోస్ట్‌లో మనోజ్ తన తీసుకున్న నిర్ణయం గురించి చాలా నిజాయితీగా మాట్లాడారు. సౌకర్యంగా ఉండటానికి సాకులు వెతకకుండా వాటిని పక్కకు పెట్టేసి కష్టపడాలని నిర్ణయించుకున్నానని ఆయన పేర్కొన్నారు. “మూడు వారాల క్రితం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక సౌకర్యంతో రాజీ పడటం లేదు. ఇక సాకులు చెప్పాలని అనుకోవటం లేదు. కేవలం కష్టం మాత్రమే,” అని ఆయన రాశారు. ఇదే క్రమంలో యాక్షన్ సినిమాలు చేయడం ఎంత కష్టమో కూడా ఆయన వివరించారు. “యాక్షన్ సినిమాలో మీ కోసం ఎవరూ నటించలేరు. ప్రతి పంచ్, దెబ్బ తగిలినప్పుడు పడిపోవటం, ప్రతి దెబ్బకు మీ శరీరం సిద్ధంగా ఉండాలి. లేకుంటే వెంటనే బయటపడుతుంది. కెమెరా ఎప్పుడూ అబద్ధం చెప్పదు,” అని ఆయన అన్నారు.
ఇకపై కేవలం లుక్ కోసం కాకాకుండా..శక్తి, సహనాన్ని పెంచుకోవడంపైనే తాను దృష్టి పెట్టానని ఆయన చెప్పారు. తన లక్ష్యం “ ధృడమైన వ్యక్తి”లా తయారవడం అని పేర్కొన్నాడు. ఈ అప్‌డేట్‌ను “వీక్ 3” అని పేర్కొంటూ, ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైందని, కానీ కేవలం 21 రోజుల్లోనే తాను పూర్తిగా వేరే వ్యక్తిలా అనిపిస్తున్నానని మనోజ్ తెలియజేశారు.
డేవిడ్ రెడ్డి విషయానికొస్తే.. 1897 - 1920 మధ్య బ్రిటిష్ వలస పాలన కాలంలో జరిగే కథతో ఈ సినిమా రూపొందుతోంది. అణచివేతకు ఎదురు తిరిగే ఒక ధైర్యవంతుడైన యోధుడి జర్నీని ఇందులో చూపిస్తున్నారు. అంతర్జాతీయ నటి మారియా ర్యాబోషాప్కా కీలక పాత్రలో నటిస్తోంది.


