మధుమేహం అనేది కేవలం తీపి పదార్థాలు, పిండి పదార్థాలు తింటేనే పెరుగుతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఒక్కోసారి మనం ఏమీ తినకపోయినా, కడుపు ఖాళీగా ఉన్నా రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగిపోతుంటాయి. దీని వెనుక ఉన్న రహస్యాలను కెనడాకు చెందిన డాక్టర్ రాచెల్ వాంగ్, డాక్టర్ చిరాగ్ టాండన్‌లు వివరించారు. మనం చేసే నాలుగు చిన్న పొరపాట్లు మన ప్రాణాల మీదకు తెస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.
నిద్ర లేమి: ఇన్సులిన్‌కు శత్రువు
చాలామంది పని ఒత్తిడిలోనో, మొబైల్ ఫోన్లు చూస్తూనో రాత్రి నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. ఎవరైతే రాత్రిపూట ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతారో, వారిలో ఉదయాన్నే ‘ఫాస్టింగ్ బ్లడ్ షుగర్’ అధికంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. నిద్ర సరిగ్గా లేనప్పుడు శరీరం ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’కు గురవుతుంది. అంటే శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా వాడుకోలేక, కాలేయం నుంచి గ్లూకోజ్‌ను నేరుగా రక్తంలోకి విడుదల చేస్తుంది. అందుకే మధుమేహ సమస్య ఉన్నవారు తప్పనిసరిగా 7-8 గంటల పాటు నిద్ర పోవాలి.
మానసిక ఒత్తిడి: సైలెంట్ కిల్లర్
ఎవరైనా సరే మానసిక ఆందోళనకు గురైనప్పుడు శరీరంలో ‘కోర్టిసాల్’, ‘అడ్రినలిన్’ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించే క్రమంలో కాలేయంలో నిల్వ ఉన్న గ్లూకోజ్‌ను రక్తం వైపు మళ్లిస్తాయి. ఫలితంగా పూటంతా ఉపవాసం ఉన్నా సరే, ఒత్తిడి కారణంగా షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. ప్రశాంతంగా ఉండటం కేవలం మానసిక ఆరోగ్యానికే కాదు, షుగర్ కంట్రోల్‌కు కూడా చాలా అవసరమని వెద్యులు చెబుతుంటారు.
ఖాళీ కడుపుతో కాఫీ: ఒక హెచ్చరిక
ఉదయాన్నే ‘బెడ్ కాఫీ’ తాగే అలవాటు ఉందా? అయితే మీరు జాగ్రత్తపడాల్సిందే. ఖాళీ కడుపుతో కెఫిన్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు అది ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది. ముఖ్యంగా కాఫీలో చక్కెర, క్రీమ్ జోడిస్తే ఆ ప్రభావం రెట్టింపు అవుతుంది. డయాబెటిస్ ఉన్నవారు కాఫీ తాగాలనుకుంటే, అల్పాహారం తర్వాత లేదా బ్లాక్ కాఫీని మితంగా తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
భోజనం మానేయడం: అస్సలు చేయకూడదు
బరువు తగ్గాలనో లేదా బిజీ షెడ్యూల్ వల్లో భోజనం మానేస్తే షుగర్ తగ్గుతుందని చాలామంది పొరబడతారు. కానీ, ఎక్కువ సేపు శరీరం ఆకలితో ఉన్నప్పుడు, దానికి కావాల్సిన శక్తి కోసం కాలేయమే సొంతంగా గ్లూకోజ్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలలో అస్థిరత ఏర్పడి, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. క్రమబద్ధమైన సమయాల్లో భోజనం చేయడం రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది.
జీవనశైలి మార్పులే అసలైన మందు
ఈ నాలుగు అంశాలను గమనిస్తే, రక్తంలో చక్కెర పెరగడానికి కేవలం ఆహారమే కాదు, మన దైనందిన అలవాట్లు కూడా ప్రధాన కారణమని అర్థమవుతోంది. సరైన నిద్ర, ఒత్తిడి లేని జీవితం, సరైన సమయంలో ఆహారం తీసుకోవడం వంటివి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చిన్న మార్పులే పెద్ద ఫలితాలను ఇస్తాయి.
వైద్యుల సలహా తప్పనిసరి
ఆరోగ్యం విషయంలో సొంత నిర్ణయాల కంటే నిపుణుల సలహాలే సురక్షితంగా ఉంచుతాయి. ఎవరైనా సరే వారి జీవనశైలిలో లేదా డైట్ ప్లాన్‌లో ఏవైనా మార్పులు చేసే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. నిరంతరం గ్లూకోజ్ లెవల్స్‌ను పర్యవేక్షించుకుంటూ, ఆరోగ్యకరమైన అలవాట్లను జీవితంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: గ్యాస్ కష్టాలు: పనుల్లేక సొంతూళ్లకు వలస కూలీలు


