గ్యాస్ కష్టాలు: పనుల్లేక సొంతూళ్లకు వలస కూలీలు | Migrant workers from Kerala to their Native Places | Sakshi
Sakshi News home page

గ్యాస్ కష్టాలు: పనుల్లేక సొంతూళ్లకు వలస కూలీలు

Mar 14 2026 1:46 PM | Updated on Mar 14 2026 1:50 PM

Migrant workers from Kerala to their Native Places

తిరువనంతపురం: దేశాన్ని ఎల్పీజీ కొరత అతలాకుతలం చేస్తోంది. వంట గ్యాస్ దొరక్క వందలాది హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడటంతో మరో పెను సంక్షోభం తెరపైకి వచ్చింది. ఉపాధి కోల్పోయిన వేలాది మంది వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు తిరుగుపయనం అవుతున్నారు. కేరళలోని హోటల్ రంగం ప్రధానంగా పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలపైనే ఆధారపడి నడుస్తోంది.

ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం, మరోవైపు రంజాన్ పండుగ దగ్గరపడుతుండటంతో వీరంతా ముందస్తుగానే ఇళ్లకు తరలి వెళుతున్నారు. సాధారణంగా ఎన్నికల సమయానికి వారం ముందు వెళ్లే వీరు, ఇప్పుడు గ్యాస్ కొరత వల్ల హోటళ్లు మూతపడటంతో పనులు లేక  ముందుగానే సొంతూళ్లకు తరలివెళ్లిపోతున్నారు. ‘ఎల్పీజీ సంక్షోభం  మధ్య చిన్న తరహా హోటల్ యజమానులు తమ సిబ్బందిని కాపాడుకోలేకపోతున్నారు. ఒక్కసారి వీరు తమ గ్రామాలకు వెళ్తే మళ్లీ రెండు మూడు నెలల వరకు తిరిగి రారు. ఇది కేరళలోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది’ అని కేరళ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి. జయపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

కేరళలోని వలస కార్మికులలో సుమారు 50 శాతం మంది ఎన్నికలు జరగబోయే బెన్సాం, అస్సాం ప్రాంతాల వారేనని గణాంకాలు చెబుతున్నాయి. కొందరు యజమానులు గ్యాస్‌కు బదులు ఇతర ఇంధనాలను వాడుతూ పనివారిని ఆపే ప్రయత్నం చేస్తున్నా, పరిస్థితులు ఆశాజనకంగా లేవు. తిరువనంతపురంలోని ప్రముఖ మాల్స్‌కు సిబ్బందిని సరఫరా చేసే ఏజెన్సీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గతంలో 25 మంది పనిచేసే చోట ఇప్పుడు కేవలం ఐదుగురు మాత్రమే మిగిలారు. ప్రస్తుతానికి స్థానిక మహిళలతో పనులు కానిస్తున్నా, వలస కూలీలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. గ్యాస్ సమస్య త్వరగా పరిష్కారం అయితేనే కేరళ ఆతిథ్య రంగం తిరిగి కోలుకునే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ విదేశీ శక్తుల కీలుబొమ్మ: ప్రధాని మోదీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement