కుప‍్పకూలిన సుఖోయ్ యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి | 2 Air Force Pilots Killed In Sukhoi Su-30 Crash In Assam | Sakshi
Sakshi News home page

కుప‍్పకూలిన సుఖోయ్ యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి

Mar 6 2026 10:21 AM | Updated on Mar 6 2026 10:33 AM

2 Air Force Pilots Killed In Sukhoi Su-30 Crash In Assam

న్యూఢిల్లీ: అసోంలోని కార్బి ఆంగ్లాంగ్ జిల్లాలో సుఖోయ్ సు-30 ఎం‌కేఐ యుద్ధ విమానంతో కమ్యూనికేషన్‌ కట్‌ అయినట్లు అధికారులు ‍ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై భారత వాయుసేన పూర్తి వివరాలు తెలిపింది. ఆ యుద్ధ విమానం కుప్పకూలిపోయిందని, భారత వాయుసేనకు చెందిన ఇద్దరు పైలట్లు మృతి చెందారని చెప్పింది. 

మృతి చెందిన పైలట్లు స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పుర్వేశ్ దురాగ్కర్‌గా అధికారులు గుర్తించారు. “భారత వాయుసేనకు చెందిన సిబ్బంది అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం” అని వాయుసేన ఎక్స్ లో తెలిపింది.

సుఖోయ్ సు-30 ఎం‌కేఐ శిక్షణ మిషన్‌లో ఉండగా జోర్హాట్ వాయుసేన స్థావరం నుంచి ఎగిరిన కొద్ది సేపటికే కనిపించకుండా పోయింది. అది కుప్పకూలిన ప్రాంతం అక్కడి నుంచి సుమారు 60 కిలోమీటర్లు దూరంలో ఉంది.

నిన్న రాత్రి 7.42 గంటలకు దానితో కమ్యూనికేషన్‌ కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. సుఖోయ్ సు-30 ఎం‌కేఐ రెండు సీట్లు ఉండే, మల్టీరోల్‌, దీర్ఘ శ్రేణి యుద్ధ విమానం. రష్యా విమాన తయారీ సంస్థ సుఖోయ్ దీన్ని అభివృద్ధి చేసింది.

ప్రస్తుతం భారత వాయుసేన అవసరాల కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లైసెన్స్‌తో దీనిని తయారు చేస్తోంది. భారత వాయుసేన వద్ద 260కి పైగా సుఖోయ్ సు-30 ఎం‌కేఐ యుద్ధ విమానాలు ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement