న్యూఢిల్లీ: విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణ బిల్లు-2026ను బుధవారం అధికారికంగా సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెట్టింది. ఉదయం వాయిదా అనంతరం లోక్‌సభ సమావేశం తిరిగి ప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
“విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు-2026ను పరిశీలన కోసం లోక్‌సభ స్పీకర్ నామినేట్ చేసే 21 మంది లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ ఛైర్మన్ నామినేట్ చేసే 10 మంది రాజ్యసభ సభ్యులతో కూడిన ఉభయ సభల సంయుక్త కమిటీకి పంపాలి” అని హోంమంత్రి అమిత్ షా తరఫున ప్రవేశపెట్టిన ఈ తీర్మానంలో పేర్కొన్నారు.
లోక్‌సభ అనుబంధ కార్యాచరణ జాబితా ప్రకారం ప్రతిపాదిత సంయుక్త కమిటీలో మొత్తం 31 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 21 మంది లోక్‌సభ నుంచి, 10 మంది రాజ్యసభ నుంచి ఉంటారు. ఈ కమిటీ బిల్లును సమగ్రంగా పరిశీలించి, 2026 శీతాకాల సమావేశాల తొలి వారం చివరి రోజునాటికి తన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించనుంది.
కమిటీ సమావేశాలకు మొత్తం సభ్యుల సంఖ్యలో మూడింట ఒక వంతు హాజరైతే కోరమ్ పూర్తైనట్టుగా పరిగణిస్తామని తీర్మానంలో పేర్కొన్నారు. ప్రభుత్వం బిల్లును సమీక్ష కోసం కమిటీకి పంపాలని నిర్ణయించినప్పటికీ, కాంగ్రెస్ మాత్రం ఈ బిల్లును వ్యతిరేకిస్తూ పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ప్రతిపాదిత సవరణలను పౌర సమాజ సంస్థలు, మైనారిటీ సంస్థలను లక్ష్యంగా చేసుకునేందుకు ఉపయోగించే అవకాశం ఉందని ప్రతిపక్షం గతంలో ఆందోళన వ్యక్తం చేసింది.
కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరగా, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ కూడా ఆ డిమాండ్‌కు మద్దతు తెలిపారు. దీనికి సమాధానంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు మాట్లాడుతూ, బిల్లును జేపీసీకి పంపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షం స్వాగతించాలని అన్నారు. మైనారిటీ సంస్థలను లక్ష్యంగా చేసుకునే ఎలాంటి నిబంధన ఈ బిల్లులో లేదని స్పష్టం చేశారు.
భారత్‌లో వ్యక్తులు, సంఘాలు, సంస్థలు విదేశీ విరాళాలను స్వీకరించడం, వినియోగించడం విషయాలను ఎఫ్‌సీఆర్‌ఏ నియంత్రిస్తుంది. విదేశీ నిధులు ఏ ప్రయోజనం కోసం అందుకున్నారో అదే ప్రయోజనం కోసం వినియోగించేలా చూడటం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం.


