ఫలించిన వైఎస్సార్‌సీపీ ప్రజా పోరాటం | Center renews FCRA for RDT company | Sakshi
Sakshi News home page

ఫలించిన వైఎస్సార్‌సీపీ ప్రజా పోరాటం

Mar 25 2026 5:28 AM | Updated on Mar 25 2026 5:28 AM

Center renews FCRA for RDT company

ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరించిన కేంద్రం

గతేడాది ఏప్రిల్‌లో ఎఫ్‌సీఆర్‌ఏ నిలిపివేత 

వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో ఉవ్వెత్తున ఎగసిన ప్రజా ఉద్యమం 

పోలీసుల ద్వారా అడ్డుకున్నా.. ఆగని ఆందోళనలు 

ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణ ప్రజాపోరాటానికి లభించిన విజయం.. నిస్సిగ్గుగా క్రెడిట్‌ చోరీకి చంద్రబాబు, లోకేశ్‌ ప్రయత్నాలు 

సాక్షి, అనంతపురం/అమరావతి: వైఎస్సార్‌సీపీ అలు­పె­ర­గని పోరాటం ఫలించింది. కరువు సీమకు కల్పతరువుగా మారిన రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్డీటీ) సంస్థపై ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ (ఫారిన్‌ కాంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌) కింద అననుమతులను పునరుద్ధరించింది. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు రా­య­లసీమలోని మరిన్ని ప్రాంతాల్లో ఆర్డీటీ సేవలు యథాతథంగా అందుబాటులోకి రానున్నాయి. 

2031 వరకు ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల గొంతుక­గా వైఎస్సార్‌సీపీ చేసిన పోరాటం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధ­రించిందని ప్రజలు, మేధావులు స్పష్టం చేస్తున్నారు.   దీనిని కూడా క్రెడిట్‌ చోరీ చేసేందుకు చంద్రబాబు, లోకేశ్‌ ప్రయతి్నస్తున్నారంటూ మండిపడుతున్నారు.  

2025లో ఆర్డీటీ ఖాతాలు ఫ్రీజ్‌ 
రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్డీటీ) అనంతపురంలో 1969లో ఏర్పాటైంది. నాటినుంచి ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా పేదలను ఆదుకునేందుకు ఏటా రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లు వెచ్చిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాంటి సంస్థను చంద్రబాబు ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. 2025 ఏప్రిల్‌ 21న కేంద్రం ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరించకపోవడంతో ఆర్డీటీ విదేశీ ఖాతాలు ఫ్రీజ్‌ అయ్యాయి. దీంతో పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఆ సంస్థ పథకాలు అందక వారంతా నిరాశ, నిస్పృహలకు లోనయ్యా­రు. 

పేదలు పడుతున్న కష్టాలను గుర్తించిన వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజా పోరాటాలు చేపట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ బాధ్యతలను మాజీ ఎంపీ తలారి రంగయ్యకు అప్పగించగా.. ఆయన పార్టీ నేతలు, ప్రజలతో కలిసి ఆందోళనలు, ర్యాలీలు, ధర్నాలు, నిరసనల కార్యక్రమాలు చేపట్టారు. 

లక్ష పోస్టుకార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టి ప్రధానమంత్రికి విజ్ఞప్తులు పంపారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవడంతో­పాటు ఢిల్లీలో పార్లమెంట్‌ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలపై స్పందించిన కేంద్రం ఎట్టకేలకు ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరించింది. ఆర్డీటీ పరిరక్షణకు కృషి చేయాల్సిన టీడీపీ నాయకులు ఒక్కరోజు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టలేదు.  

వైఎస్‌ జగన్‌ అభినందనలు 
ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణ కోసం అలుపెరగని పోరాటం చేసిన మాజీ ఎంపీ, వైఎ­స్సార్‌సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్యకు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌చేసి అభినందించారు.

వైఎస్‌ జగన్‌ ఆశీస్సులు.. ప్రజల మద్దతుతోనే విజయం 
1969 నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు సేవలు అందిస్తున్న గొప్ప సంస్థ ఆర్డీటీ అని, అలాంటి సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ నిలిపివేయడంతో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పోరాటం చేపట్టి విజయం సాధించామని మాజీ ఎంపీ తలారి రంగయ్య, అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజనాథ్‌ స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో వారు మాట్లాడుతూ.. ‘పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆశీస్సులు.. ప్రజల మద్దతుతో విజయం సాధించాం.

10 నెలల నిరంతర పోరాట ఫలితంగా కేంద్రం ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరించడం శుభపరిణామం. చంద్రబాబు ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రజల మద్దతుతో పోరాటాన్ని కొనసాగించాం. దీని ఫలితంగానే కేంద్రం ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరించింది. ఉద్యమానికి అండగా నిలిచిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు, సహకరించిన ప్రజా సంఘాలకు, జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు. 

సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు క్రెడిట్‌ చోరీకి ప్రయత్నించడం దారుణం. అనంతపురం జిల్లా ప్రజలు కూటమి నేతల తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం కూటమి నేతలు చేసిందేమీ లేదు’ అని స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement