న్యూఢిల్లీ: విదేశీ విరాళాల క్రమబర్థికరణ (ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణ బిల్లు-2026పై అభ్యంతరాలు పెరుగుతున్న నేపథ్యంలో దీనిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపే అవకాశం ఉందని జాతీయ మీడియా తెలిపింది. విదేశీ నిధులతో సమకూరిన ఆస్తులు, నియమిత అధికారి అధికారాలకు సంబంధించిన నిబంధనలపై ఈ బిల్లు వ్యతిరేకత ఎదుర్కొంటున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లును 2026 మార్చి 25న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఎఫ్‌సీఆర్‌ఏ నమోదు రద్దైన, స్వచ్ఛందంగా వదులుకున్న లేదా పునరుద్ధరణ పొందని సంస్థలకు చెందిన విదేశీ విరాళాలు, ఆస్తుల పర్యవేక్షణ, నిర్వహణ, వాటి భవిష్యత్ వినియోగానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం దీని లక్ష్యం. చట్టంలోని జరిమానా విధానంలో మార్పులు కూడా ఇందులో ప్రతిపాదించారు.
ప్రతిపాదిత మార్పుల ప్రకారం, చెల్లుబాటు అయ్యే ఎఫ్‌సీఆర్‌ఏ ధ్రువీకరణ పత్రం లేని సంస్థల ఆస్తులను నియమిత అధికారి పర్యవేక్షిస్తారు. కొన్ని పరిస్థితుల్లో ఆస్తులను తాత్కాలికంగా, ప్రత్యేక సందర్భాల్లో శాశ్వతంగా స్వాధీనం చేసుకునే అవకాశం బిల్లులో ఉంది. పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ వివరాల ప్రకారం, 2019 నుంచి 2022 మధ్య 13,520 సంస్థలు విదేశీ విరాళాల రూపంలో రూ.55,741 కోట్లు అందుకున్నాయి. 2026 జూలై 15 నాటికి ఎఫ్‌సీఆర్‌ఏ పోర్టల్‌లో 14,449 చురుకైన ధ్రువీకరణ పత్రాలు ఉండగా, 22,498 రద్దయ్యాయి. మరో 15,212 గడువు ముగిసినవిగా నమోదయ్యాయి.
తమిళనాడు, మిజోరంలో ఆందోళనలు
తమిళనాడు శాసనసభ మంగళవారం ఏకగ్రీవంగా ఒక తీర్మానం ఆమోదించి, ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రాలు, సంబంధిత వర్గాలతో విస్తృతంగా సంప్రదింపులు జరపాలని సూచించింది. విదేశీ విరాళాలు స్వీకరించే విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వృద్ధుల సంరక్షణ కేంద్రాలు, ఇతర సేవా సంస్థలపై ఈ బిల్లు ప్రభావం చూపే అవకాశం ఉందని ఆ తీర్మానంలో ఆందోళన వ్యక్తం చేశారు.
ఎఫ్‌సీఆర్‌ఏ నమోదు రద్దు అయినప్పుడు, పునరుద్ధరణ తిరస్కరించినప్పుడు లేదా నమోదు స్వచ్ఛందంగా వదులుకున్నప్పుడు సంబంధిత సంస్థల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, నిర్వహించడం లేదా విక్రయించడం వంటి నిబంధనలపై తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేసింది. సహజ న్యాయం, సమతుల్యత, ఆస్తి హక్కులు, చట్టబద్ధ అంచనాలు, సమాఖ్య వ్యవస్థ ఆధారంగా రక్షణ చర్యలు ఉండాలని కోరింది.
మిజోరంలో వివిధ క్రైస్తవ మత విభాగాలకు చెందిన వేలాది మంది ఐజ్వాల్‌లో ప్రతిపాదిత సవరణలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. మిజోరం కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ఈ సమాఖ్యలో ప్రెస్బిటేరియన్ చర్చ్ ఆఫ్ ఇండియా, బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ మిజోరం సహా 9 ప్రధాన చర్చిలు ఉన్నాయి.
ఎఫ్‌సీఆర్‌ఏ నమోదు రద్దు అయినప్పుడు లేదా పునరుద్ధరణ జరగనప్పుడు చర్చిలు, స్వచ్ఛంద సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం లేదా విక్రయించే పరిస్థితులు ఏర్పడతాయని నిరసనకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. భూములు, భవనాలు, నిధులు, ఇతర ఆస్తుల విషయంలో నియమిత అధికారి పాత్రపై కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు.


