ముసాయిదా ఆమోదం వాయిదా: జేపీసీ
న్యూఢిల్లీ: తీవ్రమైన ఆరోపణలపై నిర్బంధానికి గురైన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులను పదవుల నుంచి తొలగించే బిల్లును పరిశీలిస్తున్న పార్లమెంటరీ ఉమ్మడి కమిటీ సమావేశంలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ఈ కమిటీ చేసిన ఐదు సిఫార్సులలో ఒక్కో దానిపై ఓటింగ్ జరపగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో, ముసాయిదా నివేదిక ఆమోదాన్ని వాయిదా వేయాలని కమిటీ నిర్ణయించింది.130వ రాజ్యాంగ సవరణపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఐదు సిఫార్సులు చేసింది. వీటి ప్రతులను కమిటీ సభ్యులకు అందజేసింది.
.శుక్రవారం ఈ సిఫారసులపై వేర్వేరుగా ఓటింగ్ చేపట్టింది. వీటిపై సంబంధిత వర్గాలతో మరిన్ని సంప్రదింపులు అవసరమన్న అభిప్రాయాన్ని సభ్యులు వ్యక్తపరిచారు. కమిటీలోని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఎన్‌సీపీ(ఎస్‌పీ)కి చెందిన ఎంపీ సుప్రియా సూలే అసమ్మతిని వ్యక్తపరిచారు. అయితే, నివేదిక ఆమోదాన్ని వాయిదా వేయాలని కమిటీ నిర్ణయించడంతో అసమ్మతిని వాపసు తీసుకుంటున్నట్లు అనంతరం వీరిద్దరూ ప్రకటించారు. 130వ రాజ్యాంగ సవరణ ప్రతిపాదనపై సంబంధిత వర్గాలతో మరిన్ని సంప్రదింపులు చేపట్టాల్సిన అవసరముందని కమిటీ ఏకాభిప్రాయంతో ఉందని బీజేపీకి చెందిన కమిటీ చీఫ్ అపరాజిత సారంగి తెలిపారు.


