అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి 2020 అధ్యక్ష ఎన్నికల వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. చైనా అమెరికా ఎన్నికల డేటాలో భారీ స్థాయిలో జోక్యం చేసుకుందని, దాదాపు 22 కోట్ల (220 మిలియన్) మంది అమెరికన్ ఓటర్ల వివరాలను అక్రమంగా సేకరించిందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రపంచ రాజకీయాల్లో "పెద్దన్న"గా భావించే ఆయన.. అమెరికా ఎన్నికల భద్రతపైనే విదేశీ జోక్యం జరిగిందంటూ చేసిన ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు దారితీశాయి. అయితే, ట్రంప్ ఆరోపణలకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చైనా కౌంటర్ ఇచ్చింది.
వైట్‌హౌస్‌లో ప్రైమ్‌టైమ్‌లో ప్రసంగించిన ట్రంప్.. 2020 ఎన్నికల సమయంలోనే చైనా అమెరికా ఓటర్ల డేటాను లక్ష్యంగా చేసుకుని చరిత్రలోనే అతిపెద్ద డేటా చోరీకి పాల్పడిందని ఆరోపించారు. దీంతో అమెరికా ఎన్నికల భద్రత తీవ్ర ప్రమాదంలో పడిందన్నారు. ఎన్నికల వ్యవస్థలోని లోపాలను "డీప్ స్టేట్"లోని కొందరు కావాలనే దాచిపెట్టారని కూడా విమర్శించారు.
ట్రంప్ ఆరోపణలకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి లియూ చాంగ్ స్పందించారు. "అమెరికా ఎన్నికలతో మాకేం అవసరం?. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదన్న సూత్రాన్ని చైనా ఎప్పుడూ పాటిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తిగా అమెరికా అంతర్గత అంశం. వాటి ఫలితాన్ని అమెరికా ప్రజలే నిర్ణయిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు.. భవిష్యత్తులో కూడా జోక్యం చేసుకోదు. అలాంటి అవసరం కూడా మాకు లేదు" అని స్పష్టం చేశారు.
ఇక ట్రంప్ తన ప్రసంగంలో.. రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా నుంచి అమెరికా ఎన్నికల వ్యవస్థ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న అమెరికా ఎన్నికల విధానం నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికలకు ఏమాత్రం సరిపోదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రతి ఓటు ఖచ్చితంగా లెక్కించబడేలా, హ్యాకింగ్ లేదంటే విదేశీ జోక్యానికి అవకాశం లేకుండా ఎన్నికల వ్యవస్థను పూర్తిగా పునర్నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఎన్నికల మౌలిక వసతుల్లో ఉన్న బలహీనతలను వెల్లడించే కీలక నిఘా సమాచారాన్ని ప్రజలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
అమెరికాలో ఓటర్ల నమోదుకు పౌరసత్వ ధ్రువీకరణ తప్పనిసరి చేసే సేవ్ యాక్ట్ SAVE Actను వెంటనే ఆమోదించాలని కాంగ్రెస్‌ను ట్రంప్ కోరారు. అయితే, ఈ బిల్లు అమలైతే లక్షలాది మంది చట్టబద్ధ ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఓటర్ల హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికా చట్టాల ప్రకారం విదేశీయులు ఓటు వేయడం ఇప్పటికే నిషేధితమే.
ఇక 2020 ఎన్నికల్లో భారీ మోసం జరిగిందన్న ట్రంప్ ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి న్యాయపరమైన నిర్ధారణ లభించలేదు. ట్రంప్, ఆయన మద్దతుదారులు దాఖలు చేసిన 60కుపైగా కేసుల్లో ఎన్నికల ఫలితాలను మార్చే స్థాయి అక్రమాలు జరిగాయని ఏ కోర్టూ తేల్చలేదు. రీకౌంట్లు, ఆడిట్లు, ట్రంప్ హయాంలోని న్యాయశాఖ కూడా అలాంటి ఆధారాలు గుర్తించలేదు.
అంతేకాకుండా, ఎన్నికల మోసంపై తన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయని ఏబీసీ, ఎన్బీసీ వంటి టీవీ నెట్‌వర్క్‌లపై కూడా ట్రంప్ మండిపడ్డారు. అవి ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసే కుట్రలో భాగమని ఆరోపిస్తూ.. వాటి ప్రసార లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


