లోకేష్‌ వల్ల ఒరిగింది శూన్యం : రాచమల్లు | Rachamallu says Their job is to blame Jagan | Sakshi
Sakshi News home page

లోకేష్‌ వల్ల ఒరిగింది శూన్యం : రాచమల్లు

Jul 16 2026 11:53 AM | Updated on Jul 16 2026 12:08 PM

Rachamallu says Their job is to blame Jagan

పొద్దుటూరు: రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం దగా చేస్తున్నదని, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డిని విమర్శించడమే వారు పనిగా పెట్టుకున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో నారా లోకేష్‌ పర్యటన వల్ల జిల్లాకు ఒనగూరిన ప్రయోజనం శూన్యం. జిల్లాకు వచ్చి జగన్‌పై ఆరోపణలు, నిందలు వేయడం, చేయని వాటిపై సెల్ఫ్‌ డబ్బా కొట్టుకోవడం తప్ప చేసిందేమీ లేదు. ఇప్పటికి రెండేళ్లయ్యింది...జగన్‌ పేరు ఉచ్చరించకుండా తండ్రీ కొడుకులకు ఒక్కరోజైనా గడిచిందా అని రాచమల్లు ప్రశ్నించారు. 

జగన్‌ నామస్మరణ చేయకపోతే తండ్రీకొడుకులకు సూర్యుడు ఉదయించడు..అస్తమించడు. జగన్‌ క్యాన్సర్‌ గడ్డ...చిన్నాన్నను లేపేసినాడు..ఎప్పుడూ ఇవే ఆరోపణలు. రైజింగ్‌ రాయలసీమ అనే సెల్ఫ్‌ డబ్బా..పరిశ్రమలన్నీ తామే తెస్తున్నట్లు కలరింగ్‌ ఇస్తున్నారు. స్పష్టంగా ప్రశ్నిస్తే ఒక్క దానికి కూడా సరైన సమాధానం చెప్పలేదు. జగన్‌ ఆయన చిన్నాన్నను చంపినాడా..? అరగదీసిన క్యాసెట్టు వేయడానికి కాస్తన్నా సిగ్గుండాలి అని రాచమల్లు అన్నారు.

ఈ దేశంలోనే అత్యున్నత సంస్థలు సీబీఐ, సుప్రీం కోర్టు స్పష్టంగా జగన్‌ ఈ కేసులో ముద్దాయి కాదని స్పష్టంగా చెప్పింది. సీబీఐ ఈ కేసులో ఎవర్నీ విచారించాల్సిన అవసరం లేదని చెప్పిన తర్వాత కూడా అవే ఆరోపణలు చేస్తున్నారు. నువ్వు సీబీఐ కంటే గొప్పవాడివా లోకేష్‌..సుప్రీం కోర్టు కంటే గొప్ప న్యాయ వ్యవస్థవా? అని ప్రశ్నించారు. పదే పదే అవే అబద్ధాలు చెప్పి సుప్రీం కోర్టును, సీబీఐని నువ్వు అవమాన పరుస్తున్నావా...? జగన్‌పై మీకున్న అసూయ, పదవి ఉందనే అహంకారంతో మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు. వివేకాను జగన్‌ చంపాడనేది ఆబద్ధం..చంద్రబాబు మామను వెన్నుపోటు పొడిచింది నిజం. వివేకాను జగన్‌ చంపలేదు..విచారణ కూడా అవసరం లేదని సుప్రీం కోర్టు చెప్పింది నగ్న సత్యం అని రాచమల్లు పేర్కొన్నారు.

అయినా మీకు సిగ్గు, మానం, మర్యాద లేకుండా తప్పుడు మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. జగన్‌ క్యాన్సర్‌ గడ్డా...రాయలసీమలో పుట్టిన రత్నమా అనేది ప్రజల రెఫరెండం తీసుకుందామా..? జగన్‌ అనే వ్యక్తి భావితరాలకు బంగారు బాట వేసే గొప్ప నాయకుడు. ఒక్క సారి అవకాశం ఇస్తేనే ఆయన దీన్ని నిరూపించి చూపించాడు. రాయలసీమలో పుట్టిన రత్నం..ఆంధ్ర రాష్ట్రానికి అమూల్యమైన సంపద జగన్‌. నీ తండ్రి చంద్రబాబు ఈ రాష్ట్రానికి క్యాన్సర్‌ గడ్డ లాంటివాడైతే..నువ్వు టీడీపీకి క్యాన్సర్‌ గడ్డ లాంటి వాడివి. నీవల్ల తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం ఎంతో కాలం లేదు అని రాచమల్లు అన్నారు.

వ్యవసాయం దండగ అని చెప్పిన వాడు నీ తండ్రి..మరి ఎవరు రైతు ద్రోహి..? వ్యవసాయం పండుగ అన్న రాజశేఖరరెడ్డి రక్తం పంచుకుపుట్టిన వాడు జగన్‌. 2019–24 మధ్యలో వైఎస్‌ జగన్‌ ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పింది జగన్‌..పంట నష్టం జరిగితే నెలరోజుల్లో పరిహారం ఇచ్చింది జగన్‌. సున్నా వడ్డీ రుణాల నుంచి..ఉచిత పంటల బీమా వరకూ చేసింది జగన్‌. రైతుకు ఆసరాగా రైతు భరోసా కల్పించింది జగన్‌..వ్యవసాయ పనిముట్లు ఇచ్చింది జగన్‌ అని రాచమల్లు గుర్తుచేశారు.

అలాంటి జగన్‌ రైతు ద్రోహి ఎలా అవుతాడు..? రాయలసీమకు సాగునీరు ఇవ్వకుండా అన్యాయం చేసిన రైతు ద్రోహి చంద్రబాబు. రైతుల నుంచి అమరావతిలో బలవంతంగా కొట్టి, తిట్టి భూములు లాక్కుంటున్న మీరు రైతు ద్రోహులు. ఏ రైతైనా మీకు భూములు ఇవ్వకపోతే..బుల్డోజర్లు పంపుతున్నారు..నీళ్లతో నింపుతున్నారు. బలవంతంగా భూములు లాక్కుంటుంటే ఓ ఇళ్లాలు పెట్టిన కంటనీరు మీ ప్రభుత్వాన్ని సమూలంగా నాశనం చేస్తుంది లోకేష్‌.. ఇదేనా మీరు రైతులకు ఇస్తున్న గౌరవం..ఇదేనా రైతు అనుకూల ప్రభుత్వం..? అని నిలదీశారు.

నోరుందని, అధికారం ఉందని ఏదంటే అది మాట్లాడితే కుదరదు లోకేష్‌.. రైజింగ్‌ రాయలసీమ అని నువ్వు చెప్పేదేంటి..? మా సీమ ఎప్పుడూ రైజింగ్‌ రాయలసీమే. రాయలేలిన సీమ..రతనాల సీమ మా రాయలసీమ. కానీ మీ తండ్రి చంద్రబాబు పుణ్యామాని మా రాయలసీమ రాళ్లసీమగా మారిపోయింది. మీరు రాయలసీమ వాళ్లు కానే కాదు..చిత్తూరులో పుట్టినా రాయలసీమ పట్ల ఏమాత్రం ప్రేమాభిమానాలు లేని కుటుంబం మీది. రాయలసీమ ప్రజలను మీరు సవతితల్లి బిడ్డలా చూశారు కాబట్టే ఎప్పుడూ సీమవాసులు మిమ్మల్ని ప్రేమించరు అని రాచమల్లు పేర్కొన్నారు. 

రాష్ట్రంలో పరిశ్రమలను తీసుకొచ్చింది వైఎస్‌ జగన్‌..పరిశ్రమలు తెచ్చామనే బ్రమను కల్పిస్తున్నది మాత్రం మీరు. సింగపూర్‌ పోతారు..ఎన్నో పరిశ్రమలు అంటారు..కానీ ఒక్కటి రాదు..కానీ సూటు బూటుతో విదేశాల్లో లోకేష్‌ షోకులు పడుతున్నాడు. జగన్‌ కడప జిల్లాకు ఏమేమి పరిశ్రమలు తెచ్చాడో ఒక్క సారి చరిత్ర తెలుసుకుని మాట్లాడు లోకేష్‌. పరిశ్రమలు తరిమికొట్టింది జగన్‌ కాదు...ఆయన తెచ్చిన పరిశ్రమలకు శంకుస్థాపనలు చేస్తూ జబ్బలు చరుచుకుంటున్నది మీరు. మా ప్రభుత్వంలో మంజూరైన పనులను ఆపేసిన ఘనత మీది..ఇక మీరు ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించండి అని రాచమల్లు ప్రశ్నించారు. 

జగన్‌ తెచ్చిన 18 మెడికల్‌ కాలేజీలను పూర్తి చేయలేని వారు..సీట్లను వెనక్కు పంపిన వారు మీరా అభివృద్ధి గురించి మాట్లాడేది..? నిన్న లోకేష్‌ సందర్శించిన దొరసానిపల్లి స్కూల్‌ అభివృద్ధి చేసింది కూడా జగనే. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను ఊటీ స్కూళ్ల మాదిరిగా అభివృద్ధి చేశాం. మీ తండ్రి సీఎంగా ఒక్క స్కూళ్లో బాత్‌రూమ్‌ కట్టించాడా...? రానున్న రోజుల్లో గాంధీ తాతను చంపింది కూడా జగనే అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తారు. నేడు వివేకాను చంపింది జగనే అన్నప్పుడు...గాంధీని చంపాడని ప్రచారం చేసినా ఆశ్చర్యమేమీ లేదు. మంట లేకుండా వంట చేయగలిగిన ఆయన ఇలాంటి అబద్ధాలు చెప్పడని గ్యారెంటీ ఏముంది..? వాళ్లది నాలుక కాదు...తాటి మట్ట..ఎన్ని అబద్ధాలనైనా చెప్తుంది అని రాచమల్లు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement