సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శన వ్యవస్థపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కె. నారాయణ స్వామి టీటీడీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ప్రోటోకాల్ దర్శనం ఇవ్వాల్సి ఉండగా.. సాధారణ దర్శనానికి పంపించారని.. ఇది తనను అవమానించినట్లేనని పేర్కొంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“దేవుడి దగ్గర అందరూ సమానమే. కానీ భక్తుల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరించడం బాధాకరం. నాకు ప్రోటోకాల్ ఉన్నప్పటికీ సాధారణ దర్శనం ఇచ్చారు. ఇది అవమానంగా భావిస్తున్నాను” అని నారాయణ స్వామి అన్నారు. అలాగే తిరుమలలో వైఎస్సార్సీపీకి చెందిన నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన వాపోయారు.
అదే సమయంలో టీటీడీలో వీఐపీ సంస్కృతిపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. “తిరుమలలో పూర్తిగా వీఐపీ దర్శనాలను తొలగించి.. సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరినీ అవమానించే పరిస్థితులు ఉండకూడదు” అని సూచించారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల దర్శన విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పండుగలు, రద్దీ రోజుల్లో సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు అధిక ప్రాధాన్యత లభిస్తోందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి.
ప్రోటోకాల్ పేరుతో ప్రముఖులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండటంతో సాధారణ భక్తుల దర్శన సమయం మరింత ఆలస్యమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. క్యూలైన్ల నిర్వహణ, భక్తుల సౌకర్యాల పర్యవేక్షణలో పోలీసులు, విజిలెన్స్ విభాగం మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రద్దీ సమయాల్లో భక్తుల ఇబ్బందులు, నీరు, ఆహారం, వైద్య సదుపాయాలపై మరింత దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు.


